తాతయ్య కోసం మనవడి రికార్డు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీకు బాస్కెట్‌ బాల్‌ ఆడటమంటే ఇష్టమా.. ఎంచక్కా బాల్‌తో ఆడుతూ.. బాస్కెట్‌లో వేస్తే ఒక పాయింట్‌ వచ్చినట్లు కదా! అలా ఎవరెక్కువ పాయింట్లు సాధిస్తే.. వారే విజేతలన్నమాట.

Published : 11 Feb 2023 00:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీకు బాస్కెట్‌ బాల్‌ ఆడటమంటే ఇష్టమా.. ఎంచక్కా బాల్‌తో ఆడుతూ.. బాస్కెట్‌లో వేస్తే ఒక పాయింట్‌ వచ్చినట్లు కదా! అలా ఎవరెక్కువ పాయింట్లు సాధిస్తే.. వారే విజేతలన్నమాట. కానీ, ఓ నేస్తం మాత్రం పాయింట్ల ప్రస్తావనే లేకుండా.. తాతయ్య గుర్తుగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంతకీ అతడెవరో, ఆ ఘనత ఏంటో తెలుసుకుందామా..!

అమెరికాలోని చికాగో నగరానికి చెందిన హెన్రీ స్పీడ్‌వెల్‌కు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. ఇటీవల స్కూల్‌లోని ఇండోర్‌ స్టేడియంలో 80 నిమిషాల పాటు నిరంతరాయంగా బాస్కెట్‌బాల్‌తో ఆడి గిన్నిస్‌ రికార్డు కొల్లగొట్టాడు. అందులో గొప్పేముందని అనుకోకండి.. ఈ ఘనతను కళ్లకు గంతలు కట్టుకొని మరీ సాధించాడీ బాలుడు.

తాతయ్య పైన ప్రేమతో..

ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న హెన్రీకి తాతయ్య అంటే చాలా ఇష్టం. కానీ, క్యాన్సర్‌తో బాధపడుతూ గతేడాది మృతిచెందారాయన. తాతయ్యకు బాస్కెట్‌బాల్‌ అంటే అభిమానం ఉండటంతో.. అదే ఆటలో ఏదైనా రికార్డు సాధించాలనుకున్నాడు హెన్రీ. ఆరోజు నుంచే ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గత వారం స్కూల్‌లోనే కళ్లకు గంతలు కట్టుకొని, ఏకధాటిగా 80 నిమిషాలపాటు బాస్కెట్‌బాల్‌తో ఆడాడు. ఈ ప్రదర్శనకు పాఠశాల ప్రతినిధులు, న్యాయనిర్ణేతలతోపాటు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులూ హాజరయ్యారట. వారు బాలుడి వివరాలు, రికార్డు అంశాలనూ నమోదు చేసుకున్నారు. త్వరలోనే అధికారికంగా అవార్డును ప్రకటించనున్నారట. అంతకుముందు ఈ రికార్డు మరో వ్యక్తి పేరిట ఉండేది. అతడు 66 నిమిషాలపాటు మాత్రమే బాల్‌తో ఆడాడు. తాజా రికార్డు అంతకంటే 13 నిమిషాలు ఎక్కువన్నమాట.

క్యాన్సర్‌ బాధితుల కోసం..

స్కూల్‌లో ఈ ప్రదర్శన నేపథ్యంలో విరాళాల సేకరణ కూడా చేపట్టాడు హెన్రీ. అలా దాదాపు రూ.2.31 లక్షలు పోగయ్యాయి. వాళ్ల తాతయ్య క్యాన్సర్‌తోనే చనిపోవడంతో.. ఆ జబ్బుతో బాధపడే వారికి ఆ మొత్తాన్ని సహాయంగా అందించనున్నాడట. తనను తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారనీ, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడీ నేస్తం. ఇంకెందుకాలస్యం.. మనమూ హెన్రీకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని