Published : 26 Jan 2023 00:30 IST

తాతయ్య కష్టం.. మరెవరికీ రాకూడదనీ..

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నిత్యం రహదారులపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం కూడా వాటిలో కొన్నింటిని ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం.. ‘అయ్యో’ అనుకొని ముందుకెళ్లిపోవడం తప్ప ఇంకేం చేయం.. మన బంధువులెవరైనా గాయపడితే.. పెద్దవాళ్లు వెళ్లి పరామర్శించి వస్తుంటారు. అంతే కదా.. కానీ, ఓ నేస్తం మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. తమ కుటుంబానికి వచ్చిన కష్టం మరెవరికీ రావద్దనుకున్నాడు. ఇంతకీ తనేం చేశాడో తెలుసుకుందామా..!

పుదుచ్చెరికి చెందిన మసిలమణి అనే బాబుకు 13 సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ నేస్తం వాళ్ల తాతయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారట. అందుకు కారణం గొయ్యేనని తెలుసుకొని, ఒక్కడే కష్టపడి దాన్ని పూడ్చివేసి అందరితోనూ శెభాష్‌ అనిపించుకున్నాడు.

సొంతంగా సామగ్రి సేకరించి..

గత వారం మసిలమణి వాళ్ల తాతయ్య పని నిమిత్తం ద్విచక్రవాహనం మీద సమీప ప్రాంతానికి వెళ్లి తిరిగి బయలుదేరాడు. ఇంటి దగ్గర్లోకి రాగానే అక్కడే రహదారిపైన ఉన్న గొయ్యి కారణంగా బండి అదుపు తప్పింది. దాంతో తాతయ్య కిందపడి గాయపడ్డాడు. కాలు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాతయ్య పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన మసిలమణి.. ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదని అనుకున్నాడు. ఎలాగైనా ఆ గొయ్యిని పూడ్చాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నాడు. ఊరు మొత్తం తిరిగి.. అందుకు అవసరమైన కంకర, ఇసుక తదితర సామగ్రిని సేకరించాడు. వాటన్నింటినీ సిమెంట్‌తో కలిపి రోడ్డుపైనున్న గుంతను ఒక్కడే పూడ్చాడు. అంతకుముందే గొయ్యి పూడ్చేందుకు ఏయే సామగ్రి అవసరం? వాటిని ఎంత మొత్తంలో కలపాలి? తదితర వివరాలన్నింటినీ యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడట.  

బోలెడు ప్రశంసలు

వయసులో చిన్నోడే అయినా.. మసిలమణి చేసిన పనికి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి తనకు ఒక పుస్తకాన్ని బహుమతిగా పంపించాడట. అంతేకాదు..  ఊరి వారంతా కలిసి బాబును ఘనంగా సత్కరించారు. గత ఏడేళ్లుగా ఈ మార్గం మొత్తం గుంతలమయంగా మారిందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ నేస్తం చేసిన పనితో తమ సమస్య ప్రపంచానికి తెలిసిందనీ, అధికారులు సైతం రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా, ఈ బాబు చేసిన పని నిజంగా చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు