ఆటలో మేటి!

హాయ్‌ నేస్తాలూ.. మనల్ని బయటకెళ్లి ఆడుకోమన్నా, ఫోన్‌ ఇచ్చి బ్రౌజ్‌ చేసుకోమని చెప్పినా, టీవీ చూడమన్నా.. ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది

Updated : 25 Mar 2023 00:55 IST

హాయ్‌ నేస్తాలూ.. మనల్ని బయటకెళ్లి ఆడుకోమన్నా, ఫోన్‌ ఇచ్చి బ్రౌజ్‌ చేసుకోమని చెప్పినా, టీవీ చూడమన్నా.. ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. కానీ, అందరికీ అటువంటి పరిస్థితి ఉండదు కదా..! కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే మరీనూ.. ఎటువంటి వసతులు లేకపోయినా, హాకీలో రాణిస్తున్నారు కొందరు విద్యార్థినులు. ఆ వివరాలే ఇవి..

రాజస్థాన్‌ రాష్ట్రంలోని హుంజును జిల్లా.. వ్యాపారవేత్తలకు, ప్రముఖులకు ప్రసిద్ధి. అటువంటి ప్రభావం ఉన్న ఆ జిల్లాలో లంఘినీ అనే మారుమూల గ్రామం ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దీనంతటికీ కారణం.. ఆ గ్రామంలోని విద్యార్థినులు హాకీలో రాణిస్తూ, వివిధ స్థాయిల్లో పతకాలు సాధిస్తుండటమే. ఈ ఊరి బాలికల విజయం వెనుక ఓ మహిళా సర్పంచి కృషి దాగి ఉందట.

సినిమా స్ఫూర్తితో..

హాకీ.. మన జాతీయ క్రీడగా చెప్పుకొంటుంటాం కదా. ‘చక్‌ దే ఇండియా’ సినిమా స్ఫూర్తితో లంఘినీ గ్రామ విద్యార్థినులకు కూడా ఎలాగైనా హాకీ నేర్చుకోవాలని అనిపించింది. కానీ, ఇంట్లో వారెవరూ ప్రోత్సహించలేదు. కొద్దిరోజుల తర్వాత..
ఓ మహిళ ఆ గ్రామానికి సర్పంచి అయ్యారు. హాకీ ఆటపైన ఆసక్తి ఉన్న ఏడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థినులందరూ ఆమెను కలిసి విషయం చెప్పారు. చిన్నతనంలో తాను ఇంటికే పరిమితమయ్యానని, ఇప్పుడా పరిస్థితి ఈ ఊరి బాలికలకు రావొద్దనుకొని.. ప్రోత్సహించారామె.  

ముందు వద్దన్నా..

హాకీ నేర్చుకోవాలని అనుకున్నారు సరే.. కానీ, అందుకు తగిన సదుపాయాలు కూడా ఉండాలి కదా.. అయితే, ఆ ఊరి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ స్టేడియాన్ని ఎంపిక చేసుకున్నారు. సర్పంచే తన వేతనానికి మరికొంత జమచేసి, దాదాపు 20 మంది కోసం హాకీ కిట్లు కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా ఓ శిక్షకుడిని సైతం నియమించారు. మొదట్లో బాలికల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటకు పంపేందుకు అంగీకరించలేదట. కానీ, కాస్త అవగాహన కల్పించడంతోపాటు భవిష్యత్తులో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. దాంతో తల్లిదండ్రుల్లో కొద్దికొద్దిగా మార్పు వచ్చి, శిక్షణకు పంపేందుకు అంగీకరించారు.

జాతీయ స్థాయిలో సత్తా..

ఈ గ్రామ బాలికల హాకీ జట్టు ఇప్పటికే స్థానికంగా జరిగే పలు పోటీల్లో సత్తా చాటింది. గతేడాది జరిగిన రూరల్‌ ఒలింపిక్స్‌లో జిల్లా స్థాయిలో మొదటి స్థానం దక్కించుకున్నారు. చదువును నిర్లక్ష్యం చేయకుండానే.. ప్రతిరోజూ సాయంత్రం, సెలవుల్లో సాధన చేస్తున్నారు. ఎలాగైనా జాతీయ జట్టుకు ఎంపిక కావాలనే లక్ష్యంతో వీరంతా శిక్షణ తీసుకుంటున్నారు. మరి.. మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు