Story: అంతరం చెరిగిపోయింది..!

అభయారణ్యంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ పైన కొన్ని, కింద కొన్ని జంతువులు నివసిస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి వాటి మధ్య వైరం నడుస్తోంది.

Published : 14 Jun 2024 00:01 IST

అభయారణ్యంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ పైన కొన్ని, కింద కొన్ని జంతువులు నివసిస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి వాటి మధ్య వైరం నడుస్తోంది. పొరపాటున కొండ మీద నుంచి ఏదైనా జంతువు కిందికి వస్తే అక్కడున్న జంతువులు దాడి చేసి చంపేసేవి. కానీ కొండ పైనున్న జీవులకు మాత్రం.. కింద ఉండే జంతువుల మీద ఎలాంటి ద్వేషమూ ఉండేది కాదు. ఎందుకంటే కొండపైన జంతువులకు నాయకత్వం వహించే కేసరి అనే సింహం, దానితో ఉండే జీవులకు.. స్నేహంగా అంతా కలిసుండాలనే చెప్పేది. అంతేగానీ పగతో ఉండమని చెప్పేది కాదు. కింద అడవిని పాలించే సింహేంద్రుడు అనే సింహం మాత్రం.. పైనుంచి ఒక్క జంతువు వచ్చినా విడిచిపెట్టకుండా చంపేయమని ఆదేశించేది. అందుకోసం కొండ కింద ప్రాంతం చుట్టూ బలిష్టమైన ఎలుగుబంట్లను కాపలా ఉంచింది. 

 కొండ మీదున్న ఓ ఏనుగు.. ఒకసారి ఆహారన్వేషణకు వెళ్లిన సమయంలో.. ఓ భారీ వృక్షం దాని కాలు మీద పడింది. దాంతో అది నొప్పితో విలవిలలాడిపోయింది. వెంటనే మిగతా జంతువులన్నీ మృగరాజు దగ్గరకు వెళ్లి.. ‘రాజా! మన ఏనుగుకు ప్రమాదంలో కాలు విరిగింది. ఇక్కడ వైద్యం చేసే వారు ఎవరూ లేరు. కింద అడవిలో కపిరాజు అనే కోతి వైద్యం చేస్తుంది. ఎలాగైనా దాన్ని రప్పించే ప్రయత్నం చేయాలి’ అని తెలియజేశాయి. ‘అక్కడి పరిస్థితులు మీకు తెలిసిందే కదా! మన నీడ కనబడితేనే విరుచుకుపడే జంతువులున్న ఆ అడవికి ఎలా వెళ్లడం? ఒకవేళ వెళ్లినా.. వైద్యం చేసే కోతిని ఎలా రప్పించడం?’ అంది కేసరి. అప్పుడే వాటిలో నుంచి ఓ కోతి ముందుకు వచ్చి.. ‘మీరేం దిగులు చెందకండి. కపిరాజు నాకు చాలా కాలంగా పరిచయం. అప్పుడప్పుడు మేము కలుస్తుంటాము. నేను ఎలాగైనా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను’ అంది. దాని మాటలకు కేసరితో పాటుగా.. మిగతా జంతువులు కూడా సంతోషించాయి. 

కాసేపటికి ఆ కోతి కింది అడవికి వెళ్లి.. రహస్యంగా కపిరాజును కలిసి సహాయం కోరింది. దానికి అది అలాగేనంటూ బదులిచ్చి.. కావాల్సిన మూలికలు తీసుకొని బయలుదేరింది. అక్కడికి చేరుకుని ఏనుగుకు వైద్యం చేసి.. అది కోలుకునేలా చేసింది. కానీ పైన అడవికి కపిరాజు వెళ్లిందన్న విషయం సింహేంద్రకు ఓ కాకి ద్వారా తెలిసింది. దాంతో ఆగ్రహం చెంది.. కపిరాజును అడవి నుంచి బహిష్కరించింది. కానీ దాని పిల్లలు మాత్రం అడవిలోనే ఉండిపోయాయి. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచక బాధపడిపోసాగింది కపిరాజు. దాన్ని చూసిన కేసరి.. ‘మిత్రమా! మన అడవుల మధ్య వైరం ఉన్నా లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని అనుసరించి, ఇక్కడికి వచ్చి నువ్వు బహిష్కరణకు గురయ్యావు. నీ పిల్లలకు దూరమయ్యావు. ఈ పరిస్థితికి మేమే కారణం.. మమ్మల్ని క్షమించు’ అంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఏనుగుకు ఇక పూర్తిగా నయం అయిపోయింది. 
ఒకరోజు జోరున వర్షం మొదలైంది. అడవిలోని అణువణువూ తడిసి.. నీరు వరదలై పారుతోంది. ఎడతెరిపిలేని వాన, వారం రోజులుగా ఆగకుండా కురుస్తూనే ఉంది. పైన అడవిలోని నీరంతా కిందికి చేరి.. కింద అడవి అంతా మునిగిపోయింది. ఆ సమయంలో చేసేదేం లేక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సింహేంద్రతో సహా జీవులన్నీ పై అడవికి చేరుకున్నాయి. కేసరిని ఆశ్రయం ఇవ్వమని వేడుకున్నాయి. అది సంతోషంగా వాటిని ఆహ్వానించడమే కాకుండా, ఆహార ఏర్పాట్లు కూడా చేయించింది. అదంతా చూసి.. ఇన్ని రోజులూ పైన అడవి జీవుల పట్ల తమ ప్రవర్తన గుర్తు చేసుకొని తలదించుకున్నాయి. వాటితో పాటుగా దాని పిల్లలు కూడా రావడంతో చాలా సంతోషించింది కపిరాజు. కేసరి చేస్తున్న మర్యాదలకు, సింహేంద్ర దాని దగ్గరకు వెళ్లి.. ‘నన్ను క్షమించు మిత్రమా! ఇన్ని రోజులూ నిన్నూ, మీ అడవి జీవుల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ అవేమీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని ఆదుకున్నారు.. ఆహారం పెట్టారు. ఇప్పటి నుంచి మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని మాటిస్తున్నాను. ఇకపై మనమంతా కలిసే ఉందాం’ అంది. ఆ మాటలు విన్న జీవులన్నీ సంతోషంతో హర్షధ్వానాలు చేయసాగాయి. అప్పటి నుంచి కేసరి, సింహేంద్ర రెండూ కలిసి అడవిని చక్కగా పాలించాయి. 
- వడ్డేపల్లి వెంకటేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని