శివ.. రవి.. కుమార్‌.. కృష్ణ.. వంశీ!

పిల్లల మధ్య చర్చను పెట్టి వాళ్లలో ఆలోచనా శక్తిని పెంచడం వాసు మాస్టారికి అలవాటు! ఒకరోజు అయిదో తరగతి విద్యార్థుల మధ్య.. ‘మనం బతకడానికి మూలం సూర్యుడంటాను. మీరేమంటారు?’ అని చర్చకు బీజం వేశారు.

Published : 26 Jan 2023 00:31 IST

పిల్లల మధ్య చర్చను పెట్టి వాళ్లలో ఆలోచనా శక్తిని పెంచడం వాసు మాస్టారికి అలవాటు! ఒకరోజు అయిదో తరగతి విద్యార్థుల మధ్య.. ‘మనం బతకడానికి మూలం సూర్యుడంటాను. మీరేమంటారు?’ అని చర్చకు బీజం వేశారు.

శివ అనే విద్యార్థి లేచి... ‘అమ్మ భోజనం పెట్టడం కొంచెం ఆలస్యమయ్యేసరికి ఆకలితో అల్లాడిపోతాం. చాలా నీరసపడిపోతాం. అందువల్ల సూర్యుడి కంటే ఆహార పంటలే మనం బతకడానికి ముఖ్యమంటాను!’ అని అన్నాడు.

వెంటనే రవి అనే మరో విద్యార్థి లేచి.. ‘పంటలు ముఖ్యమే.. కాదనను. కానీ, ఆ పంటలు పండాలంటే సూర్యరశ్మి ఉండాలి! సూర్యరశ్మి సాయంతోనే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహారం తయారు చేసుకొని బతుకుతాయి. మనకూ ఆహారం అందిస్తాయి! అందుకే మనం బతకడానికి సూర్యుడే మూలమని అంటాను!’ అని శివ వాదనను ఖండించాడు.

‘రవి చెప్పిందే నిజం!’ రవికి అనుకూలంగా పిల్లలంతా అన్నారు. వెనక బెంచీలో ఉన్న కుమార్‌ మాత్రం నిలబడి ‘నేనది అంగీకరించను. పంటలు లేకపోతే మాంసం తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు’ అని చెప్పాడు. అంతటితో ఆగకుండా.. ‘ఆదిమానవుడు జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవాడని మనం చరిత్రలో నేర్చుకోలేదా.. ఏమి?’ అని ప్రతివాదన చేశాడు.

తన తెలివితేటలకు తానే మురిసిపోతూ మాస్టారి వైపు చూశాడు. ఎప్పుడూ చర్చలో పాల్గొనని కుమార్‌ ఆ రోజు నోరు విప్పేసరికి మాస్టారు ఆశ్చర్యపోయారు. తప్పో ఒప్పో చర్చలో ముందు పాల్గొనడం ముఖ్యమని భావించి కుమార్‌ను... ‘నీ అభిప్రాయం ధైర్యంగా చెప్పావు. అదెంత వరకు నిలబడుతుందో చూద్దాం. చర్చలో నువ్వు పాల్గొన్నందుకు చాలా సంతోషం!’ అన్నారు. ఎప్పుడూ తిట్టే మాస్టారు పొగిడేసరికి కళ్లెగరేసి అందరి వైపు చూశాడు కుమార్‌.

కృష్ణ అనే విద్యార్థికి ఒళ్లు మండింది. చూపుడు వేలిని కుమార్‌ వైపు పెట్టి.. ‘కుమార్‌... మాంసం తిని బతకొచ్చని నువ్వు అంటున్నావు. మరి ఆ మాంసం ఎక్కడ నుంచి వస్తోంది?’ అని అడిగాడు. ‘ఆ మాత్రం తెలియదా? కోడి, మేక, గొర్రె... ఇవి లేవా?’ తన తెలివితేటలకు తానే మురిసిపోతూ అన్నాడు కుమార్‌.

కృష్ణ ఏదో సమాధానం చెప్పేలోపు వంశీ అనే విద్యార్థి లేచి... ‘కుమార్‌! ఆ జంతువులు ఏమి తిని బతుకుతున్నాయో చెబుతావా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించిన కుమార్‌ తన పొరపాటు తెలుసుకున్నాడు. నాలుక కరుచుకొని.. ‘నా తెలివి మండిపోను. జంతువులు ఆకులు, అలములు తినే బతుకుతాయి కదా. మరి ఆ మొక్కలు సూర్యుడి వల్ల బతుకుతాయి! నా వాదనను నేను వెనక్కి తీసుకొంటున్నాను. మనం బతకడానికి మూలం సూర్యుడే!’ అని తన వాదనను వెనక్కి తీసుకున్నాడు.

అప్పుడు మాస్టారు కుమార్‌తో... ‘నీ తెలివి మండలేదు నాయనా! చిచ్చుబుడ్డిలా వెలిగింది. అందుకే మూలం తెలుసుకోగలిగావు’ అన్నారు. ఆ వెంటనే ఆయన తరగతి పిల్లలందరినీ ఉద్దేశించి.. ‘తినేది ఏదైనా మనసులో తలచుకోండి. అదెలా మనకు వస్తుందో ఆలోచించండి. తినే వస్తువు తయారీ మూలం అటు తిరిగి, ఇటు తిరిగి.. సూర్యుడు దగ్గరికే వెళ్తుంది, గమనించండి. మీకు రెండు నిమిషాలు సమయమిస్తున్నాను. నా మాట సత్యం కాదని రుజువు చేసిన వారికి మంచి బహుమతి ఇస్తాను’ అన్నారు.

పిల్లల మనసుల్లో పాలు, బెల్లం, ఐస్‌ క్రీం, రొట్టెలు, బిస్కెట్లు, పళ్లు, చాక్లెట్లు... ఇలా తినదగినవి ఎన్నో మెదిలాయి. వాటి మూలాలకు వెళ్తే.. సూర్యుడనే సమాధానమే వచ్చింది. విద్యార్థులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏదీ తోచకపోయేసరికి మాస్టారుతో... ‘మీ నుంచి బహుమతి పొందే అదృష్టం మాకు లేదు. మీ మాట ముమ్మాటికీ సత్యం’ అన్నారు.

‘సొంతంగా మీరు అర్థం చేసుకుంటారనే ఈ చర్చ ఆరంభించాను. మనం బతకడానికి సూర్యుడే మూలమని మీరంతా గ్రహించారు. ఆ భగభగ మండే సూర్యగోళం చూపే చల్లని దయ మన మీద ఉన్నంత వరకు జీవుల మనుగడకు ఢోకాలేదు. మీరు పెద్ద తరగతులకు వెళ్తున్న కొద్దీ సూర్యుడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకుంటారు. ఆ సూర్యకాంతి ఎన్ని రకాలుగా వినియోగించుకోగలమో గ్రహిస్తారు’ అని ఆరోజు చర్చను ముగించారు మాస్టారు.

అంతలో బెల్‌ వినిపించింది. వాసు మాస్టారు ఆ తరగతి నుంచి మరొక తరగతికి వెళ్తూ... ‘చర్చలో చురుకుగా పాల్గొన్నందుకు సాయంత్రం మీ తరగతికి వచ్చి మంచి కథను చెబుతాను’ అన్నారు. విద్యార్థులు ఆనందంతో చప్పట్లు కొట్టారు.

బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని