సీతాకాలం!

‘తెల్లని మడిలో నల్లని విత్తులు...చేతితో దున్నుతారు...నోటితో చల్లుతారు...!’ ఈ పొదుపు కథను విప్పగలరా? తెలియకపోతే నేనే చెప్పేస్తున్నా... దానికి జవాబు సీతాఫలం..ఇప్పుడు దీని గురించి ఎందుకుంటారా? నోరూరించే నా ఆ పండ్ల రుచి మీకు తెలుసు కానీ వాటి కమ్మని కబుర్లు తెలియవు కదా...అవి చెప్పాలనే నేను వచ్చేశా!ఇంతకీ నేనెవరినని తెల్లముఖం వేయకండి... సీతాఫలం చెట్టును!...

Updated : 13 May 2022 14:34 IST

‘తెల్లని మడిలో నల్లని విత్తులు...

చేతితో దున్నుతారు...

నోటితో చల్లుతారు...’

ఈ పొదుపు కథను విప్పగలరా? తెలియకపోతే నేనే చెప్పేస్తున్నా... దానికి జవాబు సీతాఫలం..

ఇప్పుడు దీని గురించి ఎందుకుంటారా? నోరూరించే నా ఆ పండ్ల రుచి మీకు తెలుసు కానీ వాటి కమ్మని కబుర్లు తెలియవు కదా...

అవి చెప్పాలనే నేను వచ్చేశా!

ఇంతకీ నేనెవరినని తెల్లముఖం వేయకండి...

సీతాఫలం చెట్టును!

నేనూ... నా పేరు!


 

శీతకాలం రాగానే చల్లని చలితో పాటు మీకు నా కమ్మకమ్మని రుచిని అందిస్తుంటా. ఎప్పుడెప్పుడు తిందామా? అని మీరు నా పండ్ల కోసం ఎదురుచూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను.

మీరంతా నన్ను సీతాఫలం చెట్టు అని పిలుస్తారు. ఇంకా షుగర్‌ యాపిల్‌, స్వీట్సాప్‌, కస్టర్డ్‌ యాపిల్‌ అంటూ బోలెడు పేర్లున్నాయి. నా శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. కుటుంబమేమో అనోనేసి. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోనే నేను పెరిగేస్తుంటా. రకరకాల ఇసుక నేలల్నీ తట్టుకుని ఉండగలను. దక్షిణ అమెరికా దేశాలతో పాటు మీ దేశంలోనూఎక్కువగా ఉంటా. కొండప్రాంతాలంటే నాకు చాలా ఇష్టం.

నేనూ... నా పండ్లు!

యాపిల్‌ కాయంత పరిమాణంలో ఉండే నా పండ్లు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చూడ్డానికి నొక్కులు నొక్కులతో ఏవో గింజల్ని వరుసగా పేర్చినట్టు భలేగా కనిపిస్తాయి. లోపలేమో బోలెడన్ని గింజలతో తెల్లని గుజ్జుతో ఉంటాయి. నా ఈ గుజ్జంతా ఎంత రుచిగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి.

నేనూ... నా ఎత్తు!

నన్ను చూసే ఉంటారుగా. చిన్న చిన్న కొమ్మలతో ఉంటాన్నేను. ఇంచుమించు 10 నుంచి 26 అడుగుల ఎత్తు వరకు పెరిగేస్తా. అన్ని కాలాల్లో పచ్చగా పెరుగుతూ ఉంటా. నాకు రెండేళ్లు వచ్చినప్పటి నుంచే పూత పూస్తుంది. ఆ తర్వాత నుంచి మీకోసం మధురమైన పండ్లుకాసేస్తా.

నేనూ... నా వల్ల లాభాలు!
 

నా పండ్లు తినడం వల్ల మీకు విటమిన్‌ సి, విటమిన్‌ బీ6, ఇంకా పీచు పదార్థాలు ఎక్కువగా అందుతాయి.

నా పండ్లు మీ జుట్టుఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి.

నా ఆకులు, బెరడు, వేర్లు, గింజలు ఇలా అన్నిభాగాల్ని ఔషధాల తయారీలో వాడేస్తారు.

నా గుజ్జుతో స్వీట్లు, జెల్లి, ఐస్‌క్రీమ్‌, జామ్‌ వంటివి తయారుచేస్తుంటారు. 

నేనూ... నాలో రకాలు!

ప్రపంచవ్యాప్తంగా నాలో బోలెడన్ని రకాలున్నాయి. వాటిల్లో పింక్స్‌ మముత్‌, ఆఫ్రికన్‌ ప్రైడ్‌ ముఖ్యమైనవి.

మీ దగ్గర రెడ్‌ స్పిక్లెడ్‌, బాలనగర్‌, రెడ్‌ సీతాఫలాల్ని ఎక్కువగా సాగు చేస్తుంటారు. రామాఫలం, లక్ష్మణాఫలం, హనుమాఫలం ఈ పేర్లు వినే ఉంటారుగా. ఇవీ మా కుటుంబానికి చెందినవే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని