kanthi sree: ‘శ్రీ’రస్తు.. విజయోస్తు!

కాళ్లకున్న చక్రాలతో స్కేటర్లు కదిలిపోతుంటే.. చూడ్డానికి మనకు రెండు కళ్లూ చాలవు. కానీ ఆ విన్యాసాలు చేసేవాళ్లకు ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం.

Published : 30 May 2024 00:56 IST

కాళ్లకున్న చక్రాలతో స్కేటర్లు కదిలిపోతుంటే.. చూడ్డానికి మనకు రెండు కళ్లూ చాలవు. కానీ ఆ విన్యాసాలు చేసేవాళ్లకు ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. ఎన్నో గాయాలను ఓర్చుకోవాలి. శరీరాన్ని నాజూగ్గా మలుచుకోవాలి. ఆ శరీరాకృతిని కొనసాగించాలి. అందుకే మనచుట్టు పక్కల రోలర్‌ స్కేటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ అంటే... చాలా అరుదనే చెప్పాలి. అలాంటి క్రీడలో రాణిస్తోంది హైదరాబాద్‌కు చెందిన అనుపోజు కాంతి శ్రీ. మనలో స్ఫూర్తి నింపేంత ప్రతిభ ఉన్న ఈ అక్కయ్య గురించి తెలుసుకుందామా మరి. 

కాంతి శ్రీ.. ప్రస్తుతం 12వ తరగతి చదువుతోంది. బుడిబుడి అడుగుల వయసులోనే స్కేటింగ్‌పై మక్కువ పెంచుకుంది. దీనికి కారణం ఈమె అక్కయ్య ఖ్యాతి శ్రీ. స్కేటింగ్‌లో రాణిస్తున్న సోదరి బాటలోనే తనూ నడవాలనుకుంది. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడే రింక్‌లో అడుగుపెట్టి గాయాలపాలైంది. ‘వద్దు తల్లీ.. నీ వల్ల కాదు’ అని తల్లిదండ్రులు అనుపోజు చండీ ప్రసన్న, శ్రీధర్‌ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. పడిలేచిన కెరటంలా ఓ సంవత్సరం తర్వాత, స్కేటింగ్‌లో మెరుగైన శిక్షణ తీసుకుని రాటు తేలింది. అలా అని చదువును నిర్లక్ష్యం చేయలేదు. విద్యాభ్యాసం, క్రీడలకు సమాన ప్రాధాన్యమిస్తోంది. శ్రీ ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 91 పతకాలను సొంతం చేసుకుంది. త్వరలో సెంచరీ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 

ఛాంపియన్‌గా నిలవాలని...

 అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలంటే కఠోర సాధన అవసరం. అందుకు తగిన సమయం కేటాయించడం ముఖ్యం. దీంతో ప్రతి రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు జింఖానా రింక్‌లో కాంతి శ్రీ ప్రాక్టీస్‌ చేస్తోంది. ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్కిటెక్చర్లు. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ల కెరీర్‌ను సైతం పక్కనపెట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా... శక్తివంచన లేకుండా చేయూతనిస్తున్నారు. కొన్నేళ్లుగా.. ఉదయం తండ్రి, సాయంత్రం తల్లి జింఖానాలోని రింక్‌కు తీసుకువెళ్తున్నారు. 2018లో ఆసియా ఛాంపియన్‌ షిప్‌లో అక్క ఖ్యాతి శ్రీకి పతకం రావడంతో తాను కూడా అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలని లక్ష్యంగా పెట్టుకుని కాంతి శ్రీ ముందుకు సాగుతోంది. 

గొప్ప లక్ష్యం.. ఉన్నత ఆశయం!

 ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ అంటే కాంతి శ్రీకి ఎక్కువ ఇష్టం. ఇందులో సోలో డ్యాన్స్, కపుల్‌ డ్యాన్స్‌ ఉంటాయి. వీటిలో పదకొండేళ్ల కెరీర్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 50 స్వర్ణ, 30 రజత, 11 కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొమ్మిదిసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌ కావడమే తన లక్ష్యం అని గర్వంగా చెబుతోంది కాంతి శ్రీ. చదువుల్లోనూ రాణిస్తూ.. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో కాలేజ్‌ టాపర్‌గా నిలిచింది. భవిష్యత్తులో రోలర్‌ స్కేటింగ్‌లో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయడమే ఆశయం అంటోంది. మరి మనమంతా తనకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా! 
జ్యోతికిరణ్, ఈటీవీ  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని