ఇది రోబో ఏనుగు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కేరళ అనగానే మనకు అందమైన ప్రదేశాలతోపాటు పెద్ద పెద్ద ఆలయాలూ గుర్తుకొస్తాయి. అక్కడి గుళ్లలో మనకు మొదటగా కనిపించేవి ఏనుగులే.

Published : 02 Mar 2023 00:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కేరళ అనగానే మనకు అందమైన ప్రదేశాలతోపాటు పెద్ద పెద్ద ఆలయాలూ గుర్తుకొస్తాయి. అక్కడి గుళ్లలో మనకు మొదటగా కనిపించేవి ఏనుగులే. అక్కడ నిర్వహించే వేడుకల్లో గజరాజులూ భాగస్వాములవుతుంటాయి కదా! గొలుసులతో కట్టేసి ఆ పరిసరాల్లోనే ఉండే ఏనుగులు.. కొన్ని సందర్భాల్లో గందరగోళమూ సృష్టిస్తుంటాయి. అటువంటి ఇబ్బందులేమీ లేకుండా.. ఓ ఆలయ నిర్వాహకులు ‘రోబో ఏనుగు’తో పరిష్కారం చూపించారు. ఆ వివరాలే ఇవీ..

కేరళ రాష్ట్రం త్రిశూర్‌లోని శ్రీకృష్ణ దేవాలయంలో ఇటీవల రోజూవారీ పూజల కోసం ఓ రోబో ఏనుగును తీసుకొచ్చారు. కళాకారులతో ప్రత్యేకంగా తయారు చేయించిన దానికి ‘ఇరింజడప్పిల్లి రామన్‌’ అనే పేరు కూడా పెట్టారు.

కళాకారులతో చర్చించి..  

శ్రీకృష్ణ ఆలయంలో వివిధ పూజల నిమిత్తం అర్చకులు, నిర్వాహకులు ఇన్నాళ్లూ ఓ ఏనుగును అద్దెకు తీసుకొచ్చేవారు. ప్రతీసారి దాని తరలింపు, నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో దుబాయ్‌లో నిర్వహించే షాపింగ్‌ ఫెస్టివల్‌ కోసం అదే ప్రాంతానికి చెందిన కొందరు కళాకారులు ఏనుగు బొమ్మలను తయారు చేస్తుంటారని వారికి తెలిసింది. వెంటనే ఆలయ యంత్రాంగం ఆ కళాకారుల దగ్గరకు వెళ్లి, పూజల నిర్వహణ కోసం తమకు కూడా ఓ ఏనుగు బొమ్మ కావాలని.. తగిన కొలతలతో కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలోచనతో ప్రాణమున్న ఏనుగులను బంధించాల్సిన అవసరం ఉండదు కదా.. దాంతో ఈ విషయం తెలుసుకున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం పోరాడే సంస్థ ‘పెటా’ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది.

రూ.5 లక్షల వ్యయంతో..

కళాకారులు మొదట ఇనుముతో ఫ్రేమ్‌ నిర్మించి ఏనుగును తయారు చేశారు. దానిపైన రబ్బరుతో పూత పూశారు. 11 అడుగుల పొడవుతోపాటు 800 కేజీల బరువు ఉండే ఈ రోబో ఏనుగును తయారు చేసేందుకు రూ.5 లక్షలు ఖర్చయిందట. ఈ రోబో ఏనుగు అయిదుగురిని మోయగలదనీ, స్విచ్‌ సాయంతో దాని తొండాన్ని పైకి, కిందకు కదిలించవచ్చనీ చెబుతున్నారు. ఈ ‘ఇరింజడప్పిల్లి రామన్‌’ సహాయంతోనే.. రెండ్రోజుల క్రితం దేవుడి ఊరేగింపు కూడా నిర్వహించారు.

నిర్వహణ భారం ఉండదిక..

తమలాగే మిగతా ఆలయాల్లోనూ ఇటువంటి రోబో ఏనుగులు తయారు చేయించుకోవాలనీ, తద్వారా నిర్వహణ భారం తగ్గడంతోపాటు ప్రాణమున్న జీవాలను బంధీలుగా ఉంచే అవసరం ఉండదని శ్రీకృష్ణ ఆలయ అర్చకులు చెబుతున్నారు. అప్పుడవి ఎంచక్కా..  స్వేచ్ఛగా బతికేయొచ్చన్నమాట. నేస్తాలూ.. ఈ రోబో ఏనుగు భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని