చాక్‌పీస్‌ నవ్వింది...!

అదొక తరగతి గది. టీచర్‌ లోపలకు అడుగు పెట్టగానే.. పిల్లలందరూ లేచి ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అంటూ నమస్కరించారు. వారిని కూర్చోమని చెప్పి, హాజరు తీసుకున్నారు. అనంతరం విద్యార్థుల వైపు చూస్తూ.. ‘ఈరోజు నేనో ప్రశ్న అడుగుతాను.

Published : 08 Feb 2023 00:38 IST

దొక తరగతి గది. టీచర్‌ లోపలకు అడుగు పెట్టగానే.. పిల్లలందరూ లేచి ‘గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌’ అంటూ నమస్కరించారు. వారిని కూర్చోమని చెప్పి, హాజరు తీసుకున్నారు. అనంతరం విద్యార్థుల వైపు చూస్తూ.. ‘ఈరోజు నేనో ప్రశ్న అడుగుతాను. దానికి మీరందరూ జవాబులు చెప్పాలి’ అన్నారు టీచర్‌. పిల్లలంతా సరేనన్నారు. ‘నేనడిగే ప్రశ్న పాఠానికి సంబంధించినది కాదు.. ఇది పూర్తిగా మీ గురించి తెలుసుకోవడం కోసమే కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో నిర్భయంగా చెప్పండి. ఇందుకోసం ఏమీ ఆలోచించనక్కర్లేదు’ అన్నారు టీచర్‌. మళ్లీ తలూపారు విద్యార్థులు. ‘పిల్లలారా.. ఇదొక ఊహ.. మీకు మరో జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలని అనుకుంటున్నారో చెప్పండి. ఒకరిని చూసి మరొకరు కాకుండా, సొంతంగా సమాధానాలు ఇవ్వాలి. అందరూ చెప్పాల్సిందే.. మీ సమాధానాలను నేను డైరీలో రాసుకుంటాను కూడా..’ అని అన్నారు టీచర్‌.

అప్పుడు ఓ విద్యార్థి లేచి.. ‘టీచర్‌.. నాకు పువ్వై పుట్టాలని ఉంది’ అన్నాడు. ‘ఎందుకు?’ అని అడిగారు టీచర్‌. ‘ఎందుకంటే పువ్వులను అందరూ ఇష్టపడతారు. ఎంతో మృదువుగా ఉండాలన్నది నా ఆశ’ అన్నాడా విద్యార్థి. బాగుందంటూ తరవాతి విద్యార్థి వైపు చూశారు టీచర్‌. అప్పుడా విద్యార్థి నిలబడి.. తనకు గులాబీ పువ్వులా పుట్టాలని ఉందన్నాడు. ఎందుకని అడిగితే.. ‘పిల్లలంటే ఎంతో ఇష్టపడే జవహర్‌లాల్‌ నెహ్రూ తాతయ్య జేబుకు ఎప్పుడూ ఆ పువ్వే ఉంటుంది కాబట్టి..’ అని జవాబిచ్చాడా విద్యార్థి. నవ్వుతూ డైరీలో అది రాసుకున్నారు టీచర్‌. తర్వాత అంటూ మరో వరసలోని విద్యార్థిని వైపు చూడగా.. నెమలిగా పుట్టాలనుందని చెప్పింది. ఎందుకని అడిగితే.. ‘నెమలికి శరీరమంతా కళ్లే ఉంటాయి. వాటి వర్ణం ఎంతో ఆకట్టుకుంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో అది చేసే నృత్యానికి ముగ్ధులవని వారెవరూ ఉండరు’ అని తెలివిగా చెప్పిందా అమ్మాయి. బాగా చెప్పావన్నారు టీచర్‌.

ఆ తర్వాత ఇంకొక అమ్మాయి తనకు సీతాకోకచిలుకలా పుట్టాలనుందని అంది. ఎందుకని టీచర్‌ అడగ్గా.. దాని రెక్కల్లోని అందమంటే తనకెంతో ఇష్టమట. ఎంచక్కా హాయిగా ఎగురుకుంటూ పువ్వుల మీద వాలి మకరందాన్ని జుర్రుకోవచ్చని చెప్పింది. టీచర్‌.. తన జవాబును మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. అనంతరం ఇంకో విద్యార్థి.. తనకు జింకలా పుట్టాలనుందని చెప్పింది. ఎంచక్కా చెంగుచెంగుమని గెంతుతూ ఆడుకోవచ్చని.. అంతేకాకుండా దాని మీద చుక్కలన్నా, పదునైన కొమ్ములన్నా భలే ఇష్టమంది. వెంటనే ఓ అబ్బాయి లేచి.. తనకు ఓ చెట్టులా పుట్టాలనుందన్నాడు. ఎందుకు అని టీచర్‌ అడిగితే.. చెట్టుగా పుట్టి అందరికీ సేవ చేయాలనుందని చెప్పాడు. ‘ఎలా?’ అని ప్రశ్నించారు టీచర్‌. ‘గుబురుగా ఉన్న చెట్టు మీద ఒక్క చిలుకలేంటీ.. రకరకాల పక్షులు వాలుతుంటాయి. అలా అవి కొమ్మల మీద వాలినప్పుడు నాకొచ్చే అందం అంతా ఇంతా కాదు.. అంతేకాదు, ఎండలో అలసిపోయే బాటసారులు సేదదీరడానికి నా చెట్టు నీడ ఉపయోగపడుతుంది. పండ్లు, కాయలు అందిస్తూ.. ఎంతో మంది ఆకలి తీరుస్తాను. అందుకే నేను చెట్టులా పుట్టడాన్నే కోరుకుంటాను’ అని వివరించాడతను. ఆ జవాబుకి ఎంతగానో సంతోషించారు టీచర్‌.

ఇలా ఒక్కొక్కరూ చెబుతూ.. ఒకతను గాయకుడిలా పుట్టాలనుందని అన్నాడు. ఎందుకని అడిగితే తన స్వరమాధుర్యంతో ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకోవచ్చట. ఇంతలో మరొకరు.. తనకు కుందేలులా పుట్టాలని ఉందన్నాడు. ‘ఎందుకు?’ అని టీచర్‌ ప్రశ్నించడంతో.. ‘ఎందుకంటే.. మీరు కుందేలు తెలివితేటల గురించి చెప్తూ, అది ఓ మృగరాజుని ఎలా బోల్తా కొట్టించిందో ఉదహరించారు. ఆ సంఘటన నా మనసులో అలా నాటుకుపోయింది. అందుకే నాకు కుందేలులా పుట్టాలని ఉంది’ అన్నాడా విద్యార్థి.

అలా దాదాపు విద్యార్థులందరూ సమాధానాలు చెప్పిన తర్వాత.. క్లాస్‌ లీడరు లేచి, ‘టీచర్‌ టీచర్‌.. నేనొకటి అడగాలనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఏమిటో అడుగు..’ అని ఆసక్తిగా చూస్తూ అనుమతిచ్చారు టీచర్‌. ‘మమ్మల్నందరినీ అడిగారు బాగానే ఉంది కానీ, మరో జన్మంటూ ఉంటే మీరేలా పుట్టాలని కోరుకుంటున్నారు?’ అని అడిగాడా విద్యార్థి. అప్పుడా టీచర్‌.. ‘నేనా..! నేను ఒక చాక్‌పీస్‌లా పుట్టాలనుకుంటాను. ఎందుకో తెలుసా.. కేవలం బ్లాక్‌ బోర్డు ఎవరికీ ఏదీ నేర్పదు. మీరందరూ నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి తనను తాను అర్పించుకునే చాక్‌పీస్‌ త్యాగం అసామాన్యమైంది. ఒకరికి నేర్పిస్తూ తన జీవితాన్ని ధారబోసే చాక్‌పీస్‌ జీవితం అన్ని విధాలుగా ధన్యం’ అని చెబుతుంటే.. తరగతి గది మొత్తం విద్యార్థుల చప్పట్లతో మారుమోగింది. అంతేకాదు, విద్యార్థులందరూ తమకు కూడా చాక్‌పీస్‌గా పుట్టాలని ఉందన్నారు. ఆ మాటతో టీచర్‌ చేతిలో ఉన్న తెల్ల రంగు చాక్‌పీస్‌.. అందరి వైపూ చూసి ఓ నవ్వు నవ్వింది.

యామిజాల జగదీశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని