Updated : 05 Jan 2023 00:11 IST

హైందవి... భలే బాల మేధావి!

హాయ్‌ నేస్తాలూ! రెండేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? వచ్చీరాని ముద్దుముద్దు మాటలతో సందడి చేస్తారు. సరదాగా ఆడుకుంటారు. అమాయకంగా మొహం పెట్టి, తమ అనుమానాలన్నింటితో ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఈ చిట్టి నేస్తం మాత్రం తన జ్ఞాపకశక్తితో అందరితో ఔరా! అనిపిస్తోంది. అసాధారణ ప్రతిభతో రికార్డుల మోత మోగిస్తోంది. ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఆలస్యం ఎందుకు ఈ కథనం చదివేయండి.

ఆ బుజ్జాయి ఎవరో కాదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన పేరిచర్ల హైందవి. వయసు రెండేళ్లు. నాన్న పేరిచర్ల రవివర్మ ప్రైవేటు ఉద్యోగి. అమ్మ శ్రావణి గృహిణి. హైందవి ఏడాదిన్నర వయసు నుంచే చాలా చురుగ్గా ఉండేది. తాతయ్య రామరాజు, నానమ్మ భవానీ గతంలో ఉపాధ్యాయులు. దీంతో వారి సహాయంతో చిన్నతనం నుంచే కూరగాయలు, పండ్లు, జంతువులు, పక్షుల పేర్లు, తెలుగు, ఆంగ్ల పద్యాలు, అంకెలు, ఆంగ్ల అక్షరాలు, రంగులు గుర్తించటం నేర్చుకుంది. ఆడియో పుస్తకాల్లోని క్విజ్‌ ప్రశ్నలకూ చకచకా సమాధానాలు చెబుతుంది. ఆంగ్ల అక్షరమాల బోర్డును అలవోకగా పూర్తి చేస్తుంది.

రికార్డులే రికార్డులు...

తాతయ్య, నానమ్మతో హైందవికి చక్కటి అనుబంధం ఉంది. వారు ఒళ్లో కూర్చోబెట్టుకొని పద్యాలు, అక్షరాలు, అంకెలు పలికించేవారు. అలా ఏది చెప్పినా ఇట్టే గుర్తుపెట్టుకోవటంతో వారు హైందవి ప్రతిభను గుర్తించారు. పండ్లు, కూరగాయలు, ఆకారాలు, వాహనాలు, పక్షులు, జంతువులు, శరీర భాగాల పేర్లు, జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పినందుకుగాను ‘ఇండియా బుక్‌ ఆఫ్‌  రికార్డ్స్‌’ వారు 2022 జూన్‌ 13న పరీక్షించి ధ్రువపత్రం ఇచ్చారు. అప్పటికి తన వయసు కేవలం సంవత్సరం తొమ్మిది నెలలే. తర్వాత రెండు నెలలకు ఇవే అంశాలపై ‘కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ ఈ బుడత చోటు దక్కించుకుంది.

కథలంటే ప్రాణం...

హైందవికి కథలంటే ఆసక్తి. రోజూ కనీసం ఓ కథైనా వినాల్సిందే. తనకు పూర్తిగా అర్థమయ్యే వరకూ... ‘మళ్లీ చెప్పు.. మళ్లీ చెప్పు’ అంటూ వాళ్ల నానమ్మను అడిగేది. అలా పురాణ కథలూ వింటోంది. అందులోని పాత్రలు, సన్నివేశాలు ఇలా ఏ ప్రశ్నలడిగినా ఇట్టే సమాధానాలు చెప్పేస్తుంది. ఇక ఏది నేర్చుకోవాలన్నా, ఇదే పద్ధతి. ఇవన్నీ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా సమయం అంటూ కేటాయించలేదు. తనకు స్వతహాగా ఆసక్తి ఉండటం, అమ్మానానమ్మలు చెప్పినవి విని గుర్తుంచుకోవటం మాత్రమే ఈ విజయాలకు కారణం. ఇంత చిన్న వయసులోనే రికార్డులు సాధించిన ఈ బుజ్జాయి భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని మనసారా కోరుకుందామా. అయితే ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి మరి.

-మన్నెం రమాదేవి, ఈనాడు పాత్రికేయ పాఠశాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని