Published : 31 Jan 2023 00:19 IST

కొక్కో రోజీ.. భౌభౌ టామీ!

‘అన్నా! వచ్చే ఆదివారం నన్ను చంపి, కూర వండుకుని తింటారంట, నన్ను ఎలాగైనా వీళ్ల బారి నుంచి రక్షించవా?’.. చింటూకు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఈ మాటలు. తన ఇంటిలో ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న పెంపుడుకుక్క టామీతో, కొన్ని రోజులక్రితమే నాన్న తెచ్చిన కోడి అంటున్న మాటలివి.

చింటూ.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు, రోజీ అని పేరు పెట్టి పిలుచుకుంటున్న కోడి మాటలు విని! అయినా శ్రద్ధగా అవి మాట్లాడుకుంటున్న మాటలు చెవులు రిక్కించి వినసాగాడు. ‘నిన్ను ఎందుకు చంపుతారు చింటూ వాళ్ల నాన్న, మనిద్దరిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు కదా?’ అంది టామీ.

‘లేదు, నన్ను చంపి కూర వండుకుని తినడానికే తీసుకొచ్చారట, నేను స్పష్టంగా విన్నాను కదా! చింటూ వాళ్ల అమ్మతో, వాళ్ల నాన్న అంటున్న మాటలు..’ అంది రోజీ.
‘అయితే నన్నూ ఏదో ఒకరోజు చంపి వీళ్లు తింటారన్న మాట’ అంది టామీ. ‘లేదు.., లేదు.. నిన్ను అపురూపంగా పెంచుకోవడానికే తెచ్చుకున్నారు. అంతకుముందు పెంచుకున్న పప్పీ ముసలిదైపోయి, చనిపోయిన తరువాత నిన్ను తెచ్చుకున్నారంట. ఈ మధ్యనే వీళ్ల బంధువులెవరో వస్తే వాళ్లతో చింటూ వాళ్ల అమ్మ చెప్పటం నేను విన్నాను’ అంది రోజీ.

‘అదేంటీ, మనిద్దరిని ఎంతో అపురూపంగా, సొంతబిడ్డల్లా చూసుకుంటున్నారు కదా! అటువంటిది నిన్ను చంపడమేంటి?’ అని అయోమయంగా అడిగింది టామీ.
‘ఏమో, నాకేమీ ఆ విషయాలు తెలియవు కానీ.. నన్నెలాగైనా ఈ ఆపద నుంచి రక్షించవా అన్నా!’ అని దీనంగా వేడుకుంది రోజీ.

‘అయితే ఒక పని చేస్తా, కన్నబిడ్డలాంటి నిన్నే చంపాలనుకుంటున్న చింటూ వాళ్ల నాన్నకు బుద్ధి వచ్చేలా.. వాళ్ల కన్నబిడ్డ అయిన చింటూ పీక పట్టుకుని కొరికి చంపుతా. కడుపుకోత ఏంటో అప్పుడు తెలుస్తుంది. తరువాత నన్ను చంపినా సరే’ అంది టామీ.

ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు చింటూ. మరుక్షణమే రోజీ ఇలా అంది... ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పిచ్చిపని చేయకు.. నేను చనిపోయినా పర్వాలేదు.. వాళ్లకు పుత్రశోకం కలగజేయకు.. నేను తట్టుకోలేను.. చింటూ మనిద్దరిని ఎంత గారాబంగా సాకుతున్నాడో నీకు తెలియదా! అయినా నువ్వు విశ్వాసానికి మారుపేరు’ అనేసరికి చింటూ కళ్లలో నీళ్లు తిరిగాయి.

తక్షణమే వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి... ‘నాన్నా! మనం పెంచుకునే రోజీని చంపి కూర వండుకుని తిందామని అమ్మతో అన్నారా?’ అని నిలదీశాడు చింటూ.
‘అవును, వచ్చే ఆదివారం దాన్ని కూర వండుకుని తిందామన్నాను’ అని బదులిచ్చాడు నాన్న. ‘అలాగైతే మనం పెంచుకుంటున్న టామీ, నన్ను చంపి తినడం మీకిష్టమేనా?’ గట్టిగా ప్రశ్నించాడు చింటూ. ‘ఏం మాట్లాడుతున్నావు చింటూ, మనం ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న టామీ, నిన్ను చంపడమేంటి?’ భయంభయంగా అడిగాడు నాన్న.

‘మనం ఎంతో చక్కగా చూసుకుంటున్న రోజీని చంపటానికి ఏం సంకోచించని మీరు, టామీ నన్ను చంపుతుంది అనేసరికి ఎందుకంత భయపడుతున్నారు. మీ చింటూ లాంటిది కాదా ఆ రోజీ. అందుకే నన్ను టామీ చంపనీ, నన్ను టామీ చంపనీ..’ అని గట్టిగా ఏడుస్తూ అన్నాడు చింటూ!

‘‘ఏంటి చింటూ... ‘నన్ను టామీ చంపనీ, నన్ను టామీ చంపనీ’ అంటున్నావు’’ అని కొడుకుని నిద్రలేపాడు నాన్న. అప్పుడు కానీ చింటూకు అర్థం కాలేదు.. తాను నిద్రలో కలవరిస్తున్నట్లు.

తర్వాత విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. రోజీని చంపొద్దని వేడుకున్నాడు. ‘టామీతో సమానంగా రోజీని పెంచుకుందాం’ అని చింటూ వాళ్ల నాన్న అనేసరికి ఆనందంగా ఆయన్ను కౌగిలించుకున్నాడు చింటూ.

కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు