శ్రీ.. తేజు.. లక్కీ.. ఐషు.. చిన్ను...!
నక్షత్ర కోట అనే గ్రామంలో శ్రీ, తేజు, లక్కి, ఐషు, చిన్ను అనే అయిదుగురు స్నేహితురాళ్లు ఉండేవారు. వారందరూ ఒకే బడిలో చదువుతున్నారు. ఒకే వీధిలో నివసించేవారు కూడా. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే వారిని చూసిన వారంతా అక్కాచెల్లెళ్లు అనుకునేవారు.
ఒకసారి ఆ అయిదుగురు మాట్లాడుకుంటుండగా.. ‘మన ప్రపంచం చాలా అందంగా ఉంది కదా’ అంది తేజు. దానికి చిన్ను.. ‘మన ప్రపంచం కంటే అందమైన గ్రహంలో ఉండొచ్చు కదా’ అంది. చిన్ను చెప్పిన మాటలను శ్రీ అంగీకరించకుండా.. ‘వేరే గ్రహం ఏదీ నివాసయోగ్యంగా లేదు. భూమి ఒక్కటే అన్నింటికీ అనుకూలం’ అని చెప్పింది. ఇవన్నీ వింటున్న లక్కీ.. ‘అసలు ఈ భూమి బయట ఏం ఉంటుంది? నాకు చూడాలని ఉంది’ అంది కుతూహలంగా. అప్పుడు చిన్ను ‘అవును.. నాకు కూడా చూడాలని ఉంది. ఐషు నువ్వు ఏం మాట్లాడడం లేదేంటి?’ అని అడిగింది. ‘తను ఏదో ఆలోచిస్తున్నట్లుంది’ చెప్పింది తేజు. అప్పుడు ఐషు.. ‘నేను మీ మాటలు వింటున్నాను. ఏం ఆలోచిస్తున్నానంటే మనమే ఒక వాహనాన్ని తయారుచేసుకొని భూమి బయట ఏముందో చూడొచ్చు కదా’ అని తన ఆలోచనను చెప్పింది.
అది విన్న శ్రీ.. ‘వాహనమా.. అదెలా తయారు చేసుకోవాలి?’ అని అడిగింది. ‘దాని గురించి రేపు మాట్లాడుకుందాంలే..’ అని అనడంతో అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంట్లో కూడా ఆ వాహనం గురించే ఆలోచించసాగింది ఐషు.
మరుసటి రోజు వారందరూ ఒకచోట కలుసుకున్నారు. ఆ వాహనం గురించి, అది ఎలా తయారు చేయాలనే విధానాన్ని వివరిస్తూ.. ఆ రాత్రి తను గీసిన ప్లాన్‌ను మిగతావారికి చూపించింది. వారందరూ దాని ప్రకారం వాహనం తయారు చేయడం మొదలుపెట్టారు. నాలుగుసార్లు విఫలమైనా, మరోసారి ప్రయత్నించసాగారు. ఇరుగు పొరుగు వారందరూ.. ‘ఏ పనీ చేతకాక ఆటబొమ్మలు తయారు చేస్తున్నారు. అవి ఎందుకూ పనికిరావు’ అంటూ హేళన చేసేవారు. ఆ మాటలను వారు పట్టించుకోకుండా.. వాహనం తయారు చేయడంలోనే నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి.
ఆ వాహనానికి బయట ఏం ఉందో తెలుసుకోగలిగే శక్తి, మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పే సామర్థ్యాలు ఉన్నాయి. రెండున్నర సంవత్సరాలు పడిన శ్రమకు తగిన ఫలితం రాబట్టారా స్నేహితురాళ్లు. ఆ వాహనానికి ‘విహార విహంగం’ అని పేరు పెట్టారు. అందరూ కలిసి భూమి బయట ఏం ఉందో చూడడానికి ప్రయాణం అయ్యారు.
భూమి బయట అంతా చీకటిగా ఉంది. చాలా దూరం ప్రయాణించినా, ఏమీ కనిపించలేదు. ‘భూమి తప్ప మరో గ్రహం లేనట్టుంది’ అని భయపడుతూ అంది తేజు. ‘అవును.. మనం మళ్లీ భూమి పైకి వెళ్లిపోదాం’ అంది శ్రీ. ‘ఒక్క నిమిషం ఆగండి’ అంటూ ‘ఈ చుట్టుపక్కల ఏదైనా గ్రహం ఉందా?’ అని విహార విహంగాన్ని అడిగింది ఐషు. ‘మనం ఉన్న ప్రదేశానికి కాస్త దూరాన ఒక గ్రహం ఉంది’ అని అది బదులిచ్చింది. ‘మమ్మల్ని ఆ గ్రహం వైపు తీసుకెళ్లు’ అని అడగడంతోనే అది అటుగా బయలుదేరింది. మిత్రులందరూ ఆ గ్రహానికి చేరుకున్నారు. అక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి. భూమి పైన అంతరించిపోయిన జీవులూ అక్కడ బతికి ఉండటం చూశారు. రకరకాల చెట్లు, సహజ వనరులతో ఆ గ్రహం మొత్తం హరివిల్లులా కనిపించింది.
అవన్నీ చూస్తూ.. తిరుగుతున్న వాళ్లు అక్కడో వ్యక్తిని చూశారు. అతడిని ఆపిన లక్కీ.. ‘మీరు ఎవరు?’ అని అడిగింది. ‘మా ప్రాంతానికి వచ్చి.. నన్నే ఎవరని అడుగుతున్నారా? ఇంతకీ మీరెవరు?’ అని ప్రశ్నించాడతను. ‘మేము భూగ్రహం నుంచి వచ్చాం’ అని శ్రీ సమాధానమిచ్చింది.
‘అలాగా..’ అన్నాడతను. ‘మీ గ్రహం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి దృశ్యాలను చూస్తుంటే, ప్రకృతి ఇంత బాగుంటుందా? అని అనిపిస్తుంది’ అని అన్నారా మిత్రులు. ‘ఇక్కడ కనిపించే జీవులన్నీ గతంలో భూమి మీద కూడా జీవించేవి. ఇక్కడి నదులు, కొండలు, సెలయేర్లు.. ఇలా ఒక్కటేమిటి.. భూమి మీద ఇంతకంటే అందమైన అద్భుతాలు ఉండేవని మా పూర్వీకులు కథలుగా చెబుతుండేవారు. కానీ.. కాలుష్యం, ప్లాస్టిక్, రసాయనాల కారణంగా క్రమక్రమంగా ఒక్కోటి కనుమరుగయ్యాయట. అలా జీవులూ అంతరించిపోయాయి. ఇకనుంచైనా మీ భూగ్రహం మీద ప్లాస్టిక్‌కు అడ్డుకట్ట వేసి, మొక్కలు నాటేలా చూడాలి. ఈ విషయాలపైన పాఠశాలల్లోనూ అవగాహన కల్పించాలి. అవన్నీ ఇంట్లో కూడా చెప్పాలని పిల్లలను ప్రోత్సహించాలి. అప్పుడే భూమి కూడా మా గ్రహం మాదిరి మళ్లీ అందంగా తయారవుతుంది’ అంటూ కొన్ని మొక్కలను బహుమతిగా ఇచ్చాడా వ్యక్తి. వాటిని తీసుకొని ‘విహార విహంగం’లో తిరిగి భూమికి చేరుకున్నారా అయిదుగురు స్నేహితురాళ్లు.
కాసేపటికి మెలకువ వచ్చి.. కళ్లు తెరిచి చూసింది శ్రీ. ‘అయ్యో ఇదంతా కలా?’ అనుకుంది. ఈ విషయాన్నంతా తమ స్నేహితురాళ్లతో పంచుకుంది. వాళ్లంతా కలిసి మొక్కలు నాటి సంరక్షించాలనుకున్నారు. ఇదే విషయాన్ని మిగతా స్నేహితులతోనూ పంచుకున్నారు. అనుకున్నట్లుగానే వాళ్లంతా ఉపాధ్యాయుల సాయంతో ఖాళీ స్థలంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించారు. వీళ్లను చూసి చుట్టుపక్కల వాళ్లు కూడా పచ్చదనం పెంపొందించడానికి ముందుకు వచ్చారు.
మట్టే తేజస్విని
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: నన్ను కోర్టులోనే చంపేస్తారేమో: ఇమ్రాన్ ఖాన్
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు