భలే.. భలే.. రివర్స్‌లో రికార్డ్‌!

స్కేటింగ్‌ అంటేనే కష్టం... అలాంటిది రివర్స్‌లో స్కేటింగ్‌ అంటే... ఇంకా కష్టం. కానీ ఓ అన్నయ్యకు మాత్రం రివర్స్‌లో స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం.

Published : 13 Feb 2023 00:08 IST

స్కేటింగ్‌ అంటేనే కష్టం... అలాంటిది రివర్స్‌లో స్కేటింగ్‌ అంటే... ఇంకా కష్టం. కానీ ఓ అన్నయ్యకు మాత్రం రివర్స్‌లో స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. మరి ఆ అన్నయ్య ఎవరు? రివర్స్‌లో స్కేటింగ్‌ ఏంటో... ఆ విశేషాలు తెలుసుకుందామా! అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి మరి.

విజయం సాధించాలంటే ముందుకు సాగాలి. కానీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రయత్న్‌ శర్మ అనే అన్నయ్య మాత్రం వెనక్కు వెళ్లి మరీ విజయం సాధించాడు. ఏకంగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానమూ సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు ఏకంగా రెండు గిన్నిస్‌ రికార్డులు సాధించాడు. ఇంకా తొమ్మిది లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డులు, పది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులు సొంతం చేసుకున్నాడు.


అయిదేళ్ల నుంచే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రయత్న్‌ శర్మ తనకు అయిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే రోలర్‌ స్కేటింగ్‌ చేస్తున్నాడు. ఈ అన్నయ్యకు స్కేటింగ్‌ చేయాలన్న ఆసక్తి వాళ్ల అన్నయ్య నుంచి వచ్చింది. అతడి కోసం తెచ్చిన స్కేటింగ్‌ షూస్‌ను ప్రయత్న్‌ వేసుకుని ప్రాక్టీస్‌ చేసేవాడు.


చిరుత వేగం..

ప్రయత్న్‌ తన పేరుకు తగ్గట్లు తొలిప్రయత్నంలోనే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం రెండునిమిషాల ఎనిమిది సెకన్లలోనే ఒక కిలోమీటరు దూరం వెనక్కి రోలర్‌ స్కేటింగ్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చిరుత వేగంతో పోటీపడుతూ చేసిన ఈ ఫీటే ప్రయత్న్‌కు గిన్నిస్‌ రికార్డ్‌ను తెచ్చిపెట్టింది.


మెలికల్లోనూ మెరిక!

రివర్స్‌ రోలర్‌ స్కేటింగ్‌లోనే కాకుండా... మెలికలు తిరుగుతూ స్కేటింగ్‌ చేసి కూడా ప్రయత్న్‌ రికార్డు సాధించాడు. 20 కోన్లను కాళ్లను మెలికలు తిప్పుతూ 4.16 సెకన్లలోనే దాటి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.  


ఉదయం నుంచి రాత్రి వరకు...

ఉదయాన్నే నాలుగు గంటలకు ప్రయత్న్‌ తన స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టి రాత్రి పది గంటలకు ముగిస్తాడు. ఒక్కోసారి రాత్రి రెండుగంటల వరకూ స్కేటింగ్‌ చేసిన రోజులున్నాయి. ఈ ప్రయత్నంలో ఎన్ని గాయాలైనా ప్రయత్న్‌ వెనక్కి తగ్గలేదు. భవిష్యత్తులో అంతర్జాతీయ యవనికపై భారత్‌ తరఫున పాల్గొని విజయం సాధించడమే తన లక్ష్యమని ప్రయత్న్‌ చెబుతున్నాడు. మరి ఈ అన్నయ్య అనుకున్నది సాధించాలని మనమూ మనసారా ఆల్‌ది బెస్ట్‌ చెబుదామా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని