Published : 18 Jan 2023 00:33 IST

గురువు సలహా!

కౌశంబీ రాజ్య సైన్యంలో ముఖ్యమైన పదవి ఒకటి ఖాళీ అయింది. దాని కోసం అనేకమంది పోటీపడ్డారు. ఆ పోటీలో ముగ్గురు ఉన్నతులుగా నిలిచారు. అందులో నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేద్దామనుకున్నారు. కానీ రాజు, మంత్రి వారి శక్తిసామర్థ్యాలను సరిగా అంచనా వేయలేకపోయారు. ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ ముగ్గురూ అందులో విజయం సాధించసాగారు.
చివరగా మంత్రి యుక్తిమంతుడు, తన రాజైన కీర్తిసేనుడితో... ‘మహారాజా! మనం ఒక్కరిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కానీ వీరు ముగ్గురు అత్యంత ప్రతిభావంతులు. అందుకే వీరి శక్తియుక్తులను మనం అంచనా వేయలేకపోతున్నాం. అందువల్ల నాకు ఒక ఉపాయం తట్టింది. ఈ ముగ్గురికి విద్య నేర్పిన గురువు గారు ఒక్కరే అనే సంగతి నాకు తెలిసింది. వారి వద్దకే వెళ్లి వీరి నియామకం గురించి అడుగుదాం.. ఏమంటారు?’ అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు.

మరునాడు వారిద్దరూ గురువు దగ్గరకు గుర్రాలపై బయలుదేరారు. గురువుగారు వారి రాక గురించి తెలుసుకుని.. స్వాగత సత్కారాలు ఘనంగా ఏర్పాటు చేశారు. వారు తాము వచ్చిన పనిని చెప్పారు. అప్పుడు గురువుగారు.. ‘మహారాజా! వారికి నేను విద్య నేర్పిన మాట నిజమే. వారు ముగ్గురూ అత్యంత ప్రతిభ కలవారు. మీరు మాత్రం ఒక్కరినే ఎంపిక చేయమని అంటున్నారు. అది నాకు కూడా కొంచెం కష్టమే. ఎందుకంటారా? వారిలోని మొదటి వ్యక్తి.. మీ రహస్య శత్రువులను గుర్తుపట్టడంలో చాలా నేర్పరి. మీ రాజ్యంలో ఎక్కడ మీ అంతర్గత శత్రువులు ఉన్నా, అతడు ఇట్టే గుర్తుపట్టి, వారిని లేకుండా చేస్తాడు. ఇక రెండో వ్యక్తి యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. మంచి యుద్ధ వ్యూహాలు రచించడంలో దిట్ట. అందువల్ల అతడు మీకు చక్కని సలహాలు ఇచ్చి, మంచి యుద్ధ వ్యూహాలు పన్ని మీకు విజయం దక్కేలా చేస్తాడు. అతడు స్వతహాగా కత్తి సాములో కూడా నేర్పరి. కనుక మీ ఆంతరంగికుడిగా ఉండి మిమ్మల్ని ఎంతటి ఆపద నుంచైనా రక్షిస్తాడు. ఇక మూడో వ్యక్తి వాక్చాతుర్యంలో చాలా గొప్పవాడు. ఎంతటి శత్రువైనా అతడి మాటలకు లొంగాల్సిందే. యుద్ధాలు జరగకుండా సంధి కుదర్చడంలో అతడిని మించిన వారు లేరు. అలా మీకు యుద్ధ నివారణకు అతడు తోడ్పడతాడు. అంతేకాకుండా మీకు పొరుగు రాజ్యాలు, శత్రు రాజ్యాల నుంచి కూడా వర్తక వ్యాపారాలు, ఎగుమతి దిగుమతులకు అతడు మంచి ప్రణాళికలను రచిస్తాడు. పైగా తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ ముగ్గురి ప్రతిభ గురించి నేను మీకు తెలియజేశాను. మీకు ఎవరు నచ్చారో చెప్పండి. వారు ముగ్గురూ నా ప్రియ శిష్యులే’ అని అన్నారు.

ఆ మాటలకు రాజు.. మంత్రితో ‘మనకు రెండో వ్యక్తి అవసరమని నాకు అనిపిస్తోంది. ఎటువంటి యుద్ధానికైనా అతడు కొత్త కొత్త వ్యూహాలు రచిస్తాడు. నన్ను కూడా రక్షిస్తాడు.. ఏమంటారు మహామంత్రీ!’ అని అన్నాడు. అప్పుడు మంత్రి.. ‘మహారాజా! మీ ఇష్టం. అతడి పేరును  గురువు గారికి చెప్పండి’ అన్నాడు మంత్రి. ‘గురువర్యా! మాకు రెండో వ్యక్తి సరైనవాడని అనిపిస్తోంది. మీరు కూడా మీ నిర్ణయం చెబితే మేం సంతోషిస్తాం’ అన్నాడు రాజు.

అప్పుడు గురువుగారు నవ్వి.. ‘మహారాజా! మీరు నా సలహాను అడిగారు కాబట్టి చెబుతున్నాను. మీకు ఇప్పుడు కావాల్సింది యుద్ధాలు కాదు. శాంతి మాత్రమే. ప్రజల నిత్యావసరాలు తీర్చేవారు కావాలని నా అభిప్రాయం. మన రాజ్యంలో కొన్ని పంటలు పండక పోవచ్చు. కొన్ని పొరుగు రాజ్యాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం రావచ్చు. అలా శత్రురాజ్యాల నుంచి కూడా ఏదైనా వ్యాపార అవసరాలు ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో మీకు మంచి మాటకారితనమున్న మూడోవాడే సరిపోతాడని నా అభిప్రాయం. ఏమంటారు?’ అని అన్నారు.

రాజు సంతోషించి... ‘గురువర్యా! మీరు చెప్పిన సలహానే పాటిస్తాం. మీరు నేరుగా అడిగితే చెప్పరేమోనని కావాలనే రెండో వ్యక్తి పేరు చెప్పాను. ఇప్పుడు మాకు చాలా సంతోషం. యుద్ధాలు ఎవరికీ మంచిది కాదు. శాంతిని మించిన మంత్రం ఇంకొకటి లేదు. అంతేకాదు... మిగిలిన ఇద్దరికీ తగిన కొలువులను ప్రత్యేకంగా సృష్టిస్తాను. వారి విద్యలను రాజ్యవృద్ధి కోసం ఉపయోగించుకుంటాను’ అని అన్నాడు. అందుకు గురువుగారు ఎంతో సంతోషించారు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు