చూస్తేనే హడల్‌.. ఇక వెళ్తే..?

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా కొండ ప్రాంతంలో కానీ, ఘాట్‌ రోడ్లలో కానీ ప్రయాణం చేసున్నప్పుడు చాలామంది భయపడుతుంటారు కదూ!

Published : 24 Dec 2022 00:16 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏదైనా కొండ ప్రాంతంలో కానీ, ఘాట్‌ రోడ్లలో కానీ ప్రయాణం చేసున్నప్పుడు చాలామంది భయపడుతుంటారు కదూ! మన దగ్గర ఉండే చిన్న చిన్న పర్వతాలనే చూసి బాబోయ్‌ అనుకుంటాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మాత్రం అంతకంటే భయానకమైనవి. ఇంతకీ అవెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..!


కొండల మధ్య మెలికలు తిరుగుతూ..

చైనా అంటేనే ఎన్నో వింతలకూ, ప్రత్యేక కట్టడాలకూ ప్రసిద్ధి. అనేక ఇంజినీరింగ్‌ అద్భుతాలకూ అది నెలవు. ఆ దేశంలో చాంక్వింగ్‌ అనే పర్వత ప్రాంతం ఒకటి ఉంది. ఎటుచూసినా.. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, లోయలే కనిపిస్తుంటాయి. అటువంటి ప్రాంతాల్లో రోడ్లు వేయడమంటే మామూలు విషయం కాదు. ఈ ఫొటోలో పాములా మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నది అక్కడి రహదారే. నార్వేకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల పనినిమిత్తం చాంక్వింగ్‌కు వెళ్లాడు. ఆయన అక్కడ పర్వత ప్రాంతంలోని ఈ రోడ్డు మీదుగా వాహనాలు ప్రయాణిస్తున్న వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. కొద్ది సమయంలోనే ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఒళ్లు గగుర్పొడిచేలా భారీ కొండల మధ్య ఆ రహదారిని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇక ఎత్తైన ప్రాంతాలంటే భయపడేవారు మాత్రం ఈ మార్గంలో ప్రయాణించకపోవడమే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు.


ఎంత పెద్ద బండరాయో..

నార్వేలోని ఓ ప్రాంతం ఎత్తు ప్రదేశాలంటే భయం లేని వారిని, సాహస కృత్యాలపైన ఆసక్తి చూపే వారికి భలే నచ్చుతుందట. అదేంటంటే.. బల్లపరుపుగా ఉండే పెద్ద బండరాయి అంచు. ‘పల్పిత్‌ రాక్‌’గా పిలిచే ఈ ప్రదేశం.. రాతి కొండను చుట్టూ తొలచి, ఒకచోట మాత్రం నిట్టనిలువుగా వదిలేసినట్లు ఉంటుంది. ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు తప్పకుండా ఈ ప్రమాదకర ప్రాంతాన్ని సందర్శిస్తుంటారట. చదునుగా ఉండే ఆ బండరాయి మీద నిల్చొని చుట్టూ ఉండే పచ్చటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఇంకో విషయం ఏంటంటే.. ఆ రాయి మీద ఎటువంటి బారికెడ్లు కానీ, అడ్డుగోడలు కానీ ఏమీ ఉండవు. కొందరైతే ఈ బండ చివరి వరకూ వెళ్లి, కింద 82 అడుగుల లోతు ఉండే లోయలోకి కాళ్లు పెట్టి మరీ కూర్చుంటారట. ఇటీవల ఓ పర్యాటకుడు దీనికి సంబంధించిన వీడియోను ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. విపరీతమైన లైకులు, షేర్లతో దాన్ని చూసిన వారంతా ముక్కున వేలుసుకుంటున్నారు. మనకూ చూస్తుంటేనే భయం వేస్తుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని