బొమ్మను కుడితే..!

ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నేస్తాలూ..! ‘బొమ్మను గీస్తే... అనాలి కదా.. కుట్టడం ఏంటి? పోనీ అదేమైనా ఆటబొమ్మా... కుట్టడానికి అంటే ఊహూ.. కానే కాదు.

Published : 03 Feb 2023 00:23 IST

ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నేస్తాలూ..! ‘బొమ్మను గీస్తే... అనాలి కదా.. కుట్టడం ఏంటి? పోనీ అదేమైనా ఆటబొమ్మా... కుట్టడానికి అంటే ఊహూ.. కానే కాదు. అయినా... దుస్తుల్ని కుడతారు... బొమ్మల్ని గీస్తారు కదా! ’ అని ఆలోచిస్తున్నారు కదూ! కానీ ఓ అన్నయ్య మాత్రం బొమ్మను గీయడు... ఎంచక్కా కుడతాడు. మరి ఆ విశేషాలేంటో చకచకా తెలుసుకుందామా!

పంజాబ్‌లోని పటియాలాకు చెందిన అరుణ్‌ బజాజ్‌ ఓ దర్జీ. కేవలం సాదాసీదా టైలర్‌ మాత్రమే అయిఉంటే... ఈ రోజు ఇలా మన ‘హాయ్‌బుజ్జీ’లోకి వచ్చి ఉండేవాడు కాదు. ఈ అన్నయ్య కుట్టుమిషన్‌తో కనికట్టు చేస్తాడు. మిషన్‌తో దుస్తుల్ని ఎవరైనా కుడతారు. అందులో వింతేమీ లేదు. అందుకే తాను ఏదైనా వినూత్నంగా చేయాలనుకున్నాడు. అందులోంచి వచ్చిన ఆలోచనే బొమ్మల్ని కుట్టడం.

ఒకే ఒక్కడు...!

కుట్టుమిషన్‌తో ఇలా చిత్రాల్ని కుట్టే కళాకారుడు ప్రపంచంలో ఈ అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. నిజానికి అరుణ్‌కు అసలు టైలరింగ్‌ అంటేనే ఇష్టం ఉండేది కాదు. అరుణ్‌ వాళ్ల నాన్న గారు కూడా దర్జీనే. ఆయన బలవంతంతో టైలరింగ్‌ నేర్చుకున్నారు. అరుణ్‌కు దుస్తులు కుట్టడం కంటే కూడా ఎంబ్రాయిడరీ పని అంటేనే ఇష్టం ఉండేది. ఇతరులకు భిన్నంగా ఏదైనా చేయాలని ఈ అన్నయ్య ఎప్పుడూ ఆలోచిస్తుండేవాడు.  

కల నుంచి పుట్టిన కళ!

కుట్టుమిషన్‌తో చిత్రాలను రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా... కలలో! అవును అరుణ్‌కు ఓ రోజు నిద్రలో తాను గురునానక్‌ చిత్రాన్ని కుట్టుమిషన్‌తో కుడుతున్నట్లు కల వచ్చింది. వెంటనే మెలకువ వచ్చింది. అసలు ఇదంతా సాధ్యమేనా... కుట్టుమిషన్‌తో చిత్రాలు వేయగలనా... అని ఆలోచించాడు.

‘ప్రయత్నే ఫలి’!

కేవలం ఆలోచిస్తూ కూర్చోకుండా దాన్ని అమల్లో పెట్టాడు. నెమ్మదిగా ప్రయత్నించాడు. ఓ వారంలో గురునానక్‌ చిత్రాన్ని వస్త్రంపై కుట్టాడు. దాన్ని చూసిన వారంతా ఎంతో మెచ్చుకున్నారు. అది తనకు ప్రేరణలా పనిచేసింది. తర్వాత ఈ అన్నయ్య ఇలా కుట్టుమిషన్‌ మీద శ్రీకృష్ణుడి చిత్రాన్ని కుట్టాడు. ఇందుకోసం 28 లక్షల మీటర్ల దారాన్ని ఉపయోగించాడు. ఈ చిత్రం పూర్తికావడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. ఈ చిత్రం పలు ప్రపంచ రికార్డులనూ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈయన ఇలా ఎన్నో చిత్రాలకు రూపం ఇచ్చారు. మొత్తానికి ఈ అరుణ్‌ అన్నయ్య గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని