Moral story: రంగయ్య సాధించాడు..!

దేవాపురంలో నివసించే రంగయ్య దివ్యాంగుడు.. సరిగ్గా నడవలేడు. చిన్న కొట్టు నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతను ఉచితంగా ఎవరి నుంచి ఏదీ.. తీసుకోడు. కష్టపడే తత్వం కలిగిన మనిషి. ఎప్పటికైనా.. ఆ కొట్టుని పెద్ద వ్యాపారంగా చేయాలి అనుకున్నాడు.

Published : 19 Jun 2024 00:47 IST

దేవాపురంలో నివసించే రంగయ్య దివ్యాంగుడు.. సరిగ్గా నడవలేడు. చిన్న కొట్టు నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అతను ఉచితంగా ఎవరి నుంచి ఏదీ.. తీసుకోడు. కష్టపడే తత్వం కలిగిన మనిషి. ఎప్పటికైనా.. ఆ కొట్టుని పెద్ద వ్యాపారంగా చేయాలి అనుకున్నాడు. ఆ ఆలోచనలే అందరితో పంచుకునేవాడు. కానీ.. ఆ మాటలు విని అందరూ అతన్ని హేళన చేసేవారు. ‘అన్ని అవయవాలు బాగున్నవారే వ్యాపారాన్ని కొనసాగించలేక.. నానా పాట్లు పడుతున్నారు. అలాంటిది వికలాంగుడివి నీ వల్ల ఏం అవుతుంది. ఈ ఆలోచనలు మానుకొని.. ఉన్న దాంట్లో ఆనందంగా జీవించు’ అని ఉచిత సలహాలు ఇచ్చేవారు. ఆ మాటలకు కొన్నిసార్లు బాధపడినా.. మళ్లీ వాటిని పక్కన పెట్టి తన ప్రయత్నాలు చేసేవాడు. వ్యాపారం చేయడానికి కావాల్సిన డబ్బు కోసం.. తెలిసిన వాళ్లను చాలామందిని అడిగాడు. కానీ.. ‘ఒకవేళ నువ్వు నష్టపోతే.. మాకు ఆ డబ్బు ఎలా చెల్లిస్తావు. నీకు పెద్దగా ఆస్తిపాస్థులు కూడా లేవు’ అంటూ ఎవరూ అతనికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. బ్యాంకుల్లో ప్రయత్నించినా.. కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కానీ రంగయ్య మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. 

ఒకరోజు జమీందారు భూషణం రంగయ్య కొట్టు దగ్గరకు వచ్చి.. కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్లిపోయాడు. కాసేపటికి కొట్టు బయట.. రంగయ్యకు పర్సు లాంటిది కనిపించింది. వెంటనే వెళ్లి దాన్ని తీసుకొని చూశాడు. అందులో చాలా డబ్బుంది. దాంతో అది కచ్చితంగా జమీందారుదేనని గ్రహించాడు. ఆయనకు అందిందామని వెళ్లేసరికే.. కారు చాలా దూరం వెళ్లిపోయింది. ఇక చేసేదేం లేక ఆ పర్సు తన దగ్గరే ఉంచుకున్నాడు. అందులో అతని గురించి ఏమైనా వివరాలుంటాయేమోనని వెతికాడు. కానీ.. ఏమీ దొరకలేదు. అది ఆయనకు ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు.

మరుసటి రోజే.. జమీందారు ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు రంగయ్య. అలా రెండు రోజులు వెతికాక.. భూషణం ఇంటిని చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి.. ‘అయ్యా! మొన్న మీరు నా కొట్టు దగ్గరకు వచ్చి.. కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్లారు. అనుకోకుండా మీ పర్సు అక్కడే పడిపోయింది. మీరు చూసుకోకుండా వచ్చేశారు. అది ఆ రోజే అందివ్వాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే మీ కారు చాలా దూరం వెళ్లిపోయింది. మీ చిరునామా తెలుసుకోవడానికి రెండు రోజులు పట్టింది’ అని ఆ పర్సును జమీందారుకి అందించాడు రంగయ్య. 

దాన్ని తీసుకొని నవ్వుతూ.. ‘నేను నీ కోసమే దాన్ని అక్కడ పెట్టాను రంగయ్య. నీ గురించి చాలాసార్లు విన్నాను. వ్యాపారం పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నావని తెలిసి.. ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుందనే అక్కడ పెట్టి వచ్చాను. నేను నేరుగా నీకు డబ్బు ఇవ్వొచ్చు. కానీ.. కష్టపడకుండా వచ్చిందేదీ నువ్వు తీసుకోవని తెలుసు. ఇలా చేస్తే.. ఆ డబ్బు ఎవరికీ ఇచ్చే వీలు ఉండదు కాబట్టి.. నువ్వు ఉపయోగించుకుంటావేమో అనుకున్నాను. కానీ వెతుక్కుంటు వచ్చి మరీ నాకు అందించావు. ఇది నువ్వే తీసుకొని వ్యాపారం మొదలుపెట్టు’ అన్నాడు జమీందారు. ఆ మాటలు విని.. ‘క్షమించండి.. నేను ఈ డబ్బు తీసుకోలేను’ అని చెప్పి వెనుదిరగబోయాడు రంగయ్య. అప్పుడు భూషణం ఆపి.. ‘ఉచితంగా ఏం తీసుకోవద్దు. నువ్వు బాగా స్థిరపడిన తర్వాత వడ్డీతో సహా నాకు చెల్లించు.. సరేనా?’ అన్నాడు జమీందారు. దానికి అలాగేనంటూ బదులిచ్చి.. ఆ డబ్బు తీసుకొని వెళ్లిపోయాడు రంగయ్య. 

చెప్పినట్లుగానే వ్యాపారం ప్రారంభించాడు. సంవత్సరంలోనే.. వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకున్నాడు. జమీందారి అప్పు కూడా తీర్చేశాడు. జీవితంలో ఎదగడానికి శరీర వైకల్యం ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించాడు రంగయ్య.  

నంద త్రినాథరావు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని