Kids Story: ఆఖరుకు దొంగ దొరికాడు...

పూర్వం కనక పట్టణంలో రత్నగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. వ్యాపారం బాగా కలిసివచ్చి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. వయసు మీద పడుతుండడంతో కుమారుడికి వ్యాపార బాధ్యతలు అప్పజెప్పి ప్రశాంతంగా గడపడానికి స్వగ్రామం చేరాడు. అక్కడ లంకంత ఇల్లు కట్టాడు. ఇంటి చుట్టూ పెద్ద తోట పెంచాడు.

Published : 09 Jul 2024 00:23 IST

పూర్వం కనక పట్టణంలో రత్నగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు. వ్యాపారం బాగా కలిసివచ్చి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. వయసు మీద పడుతుండడంతో కుమారుడికి వ్యాపార బాధ్యతలు అప్పజెప్పి ప్రశాంతంగా గడపడానికి స్వగ్రామం చేరాడు. అక్కడ లంకంత ఇల్లు కట్టాడు. ఇంటి చుట్టూ పెద్ద తోట పెంచాడు. ఇంటికి కాపలా, వంటపని, తోట పని చూడడానికి ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సొంత ఊరు చేరాక బంధువులు, ఆయన బాల్యమిత్రులు అనేక మంది ఆయన్ను చూడడానికి వస్తుండేవారు.

వంటవాడు, తోటమాలి నిజాయతీపరులు. కానీ కాపలాదారుడిది దొంగబుద్ధి. చేతికి దొరికిన వస్తువులను పట్టుకెళ్లిపోయేవాడు. వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో సత్రంలాగా ఉండే ఆ ఇంట్లో ఏ వస్తువు పోయిందో, ఏ వస్తువు ఉందో గమనించే వాళ్లు తక్కువ. అదే అదనుగా భావించి కాపలాదారు దొరికినకాడికి వస్తువులను దొంగిలిస్తూ ఉండేవాడు. ఇదంతా గమనించిన వంటవాడు, తోటమాలితో ‘ఇదేమిటి? కంచే చేను మేసినట్టు.. నమ్మిన యజమానికి కాపలాదారు ద్రోహం చేస్తున్నాడు. మనం రత్నగుప్తుడికి విషయం చెబుదాం’ అన్నాడు.

‘అదంతా మనకెందుకు? మన పని మనం చేసుకొని పోదాం’ అన్నాడు తోటమాలి. వంటవాడు ఊరుకోలేక కాపలావాడితో... ‘నువ్వు చేస్తున్నది తప్పు. నిజం నిప్పులాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది’ అన్నాడు. ‘నువ్వు నాకు నీతులు చెప్పడం ఏమిటి? నీ పని నువ్వు చూసుకో’ అని కాపలాదారు వంటవాడిని గదమాయించాడు. అంతటితో ఊరుకోక కాపలాదారు వంటవాడి మీద వ్యాపారికి తప్పుడు ఫిర్యాదు చేశాడు. లేనిపోనివి చెప్పి దొంగతనాలు చేస్తున్నాడని నమ్మబలికాడు.

తగిన విచారణ చేయకనే వర్తకుడు వంటవాడిని పనిలో నుంచి తీసేశాడు. ఇక తనకు అడ్డు లేదని కాపలాదారు చెలరేగిపోయాడు. తన చేతికి మరింత పని కల్పించి, ఇంట్లో వస్తువుల్ని ఒక్కొక్కటి మాయం చేయసాగాడు. ఎట్టకేలకు వర్తకుడు వస్తువులు మాయమవుతుండడం గమనించి... ‘తోటమాలిని పిలిచి ఇంట్లో వస్తువులు పోతున్నాయి. నాకు నీ మీద అనుమానంగా ఉంది. పోయిన వస్తువులన్నీ తెచ్చి యథాస్థానంలో పెట్టు. లేకపోతే దండన కఠినంగా ఉంటుంది’ అన్నాడు.

‘అయ్యా! నేను అలాంటి వాడిని కాను. అయినా మీకు నా మీద అనుమానం ఎందుకొచ్చింది? కాపలాదారు మీద ఎందుకు రాలేదు?’ అన్నాడు. ‘ఇంతకుముందు ఇంట్లో ఉన్న దొంగను అతడే కదా పట్టించాడు. అలాంటి వ్యక్తి ఎందుకు దొంగతనం చేస్తాడు? అందుకే నీ మీద నాకు అనుమానం వచ్చింది’ అన్నాడు వర్తకుడు. తోటమాలిలో పశ్చాత్తాపం కలిగింది. ‘దొంగ ఎవరో తనకు తెలిసినా... ఇంతకాలం నాకెందుకులే అని చెప్పకపోవడమే, ఈ రోజు వ్యాపారికి తన మీద అనుమానం కలగడానికి కారణం అయింది. అంతేగాక తను నిజాన్ని దాచడం వల్ల అమాయకుడైన వంటవాడికి శిక్ష పడింది. ఇక దాచి లాభం లేదు... అంతా చెప్పేయాలి’ అనుకుని వర్తకుడికి పూస గుచ్చినట్టు జరిగిందంతా చెప్పేశాడు.

వర్తకుడు, కాపలాదారుణ్ని పిలిచి... ‘నువ్వు వంటవాడి మీద నాకు అబద్ధాలు చెప్పినపుడే, నీ మీద నాకు అనుమానం కలిగింది. అయితే నిజాన్ని నిదానంగా రాబట్టాలనుకున్నాను. అందుకే విచారణ చేయకుండానే వంటవాడిని పనిలోంచి తీసివేసినట్లు నటించాను. అతడు నాకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పటికీ అతనికి నేను సాయం చేస్తూనే ఉన్నా. వంటవాడు పనిలోకి రాకున్నా... దొంగతనాలు ఆగకపోవడం గమనించాను. నా అనుమానం నిజమైంది. తోటమాలిని అనుమానించినట్లు నటించి, అతని నుంచే నిజం రాబట్టాను. దొంగ ఎవరో తెలిసీ మౌనంగా ఉండటం తోటమాలి చేసిన తప్పు. తన పొరపాటును తెలుసుకుని, ఇప్పుడు నిజం చెప్పేశాడు. నిన్ను ఈ క్షణమే పనిలో నుంచి తీసివేస్తున్నాను. దొంగిలించిన సొత్తంతా తీసుకురా. లేకపోతే కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది’ అన్నాడు. కాపలాదారు, వ్యాపారికి చెందిన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చాడు. ఇక ఊర్లో వారికి మొహం చూపలేక, గ్రామం వదిలిపెట్టి వెళ్లి పోయాడు. వర్తకుడు వంటవాడిని తిరిగి పనిలో చేర్చుకున్నాడు. అతడి నిజాయతీకి మంచి బహుమతి కూడా ఇచ్చాడు.

డా.గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని