Kids Story: మౌనమే సరైన పరిష్కారం!

కౌశంబీ రాజ్యం పొలిమేరల్లో సదానందుడి ఆశ్రమం ఉండేది. అక్కడ చాలామంది విద్యనభ్యసించేవారు. ఒకసారి సదానందుడు శిష్యులతో.. ‘పిల్లలూ! మీరంతా తల్లిదండ్రులు, వృద్ధులు, గురువులకు సేవ చేయాలి.

Published : 10 Jul 2024 00:16 IST

కౌశంబీ రాజ్యం పొలిమేరల్లో సదానందుడి ఆశ్రమం ఉండేది. అక్కడ చాలామంది విద్యనభ్యసించేవారు. ఒకసారి సదానందుడు శిష్యులతో.. ‘పిల్లలూ! మీరంతా తల్లిదండ్రులు, వృద్ధులు, గురువులకు సేవ చేయాలి. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. అందరితో గౌరవంగా మెలగాలి’ అన్నాడు. దానికి అలాగేనని బదులిచ్చారు శిష్యులు. మరుసటి రోజు ఉదయమే.. వృద్ధులకు సేవ చేయాలని ఆ గ్రామం దారిలో ఎవరైనా వృద్ధులు వస్తారేమోనని ఎదురు చూడసాగారు శిష్యులు. మూడు రోజులు అలా ఎదురు చూసినా... ఆ దారి గుండా ఎవరూ రాలేదు. కానీ ఈ మూడు రోజులు మిగతా శిష్యులెవ్వరికీ జయంతుడు కనిపించలేదు. దాంతో వారు ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు. ‘గురువు గారూ! మేము వృద్ధుల కోసం.. మన ఆశ్రమానికి దగ్గర్లో ఉన్న దారిలో మూడు రోజుల నుంచి వేచి చూస్తున్నాము. కానీ ఎవరూ కనిపించలేదు. జయంతుడు మాత్రం మాతో పాటు ఎదురు చూడకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు’ అని సదానందుడితో చెప్పారు శిష్యులు.

అప్పుడే అక్కడికి వస్తున్న జయంతుడిని పిలిచి.. ‘అందరితో పాటు ఉండకుండా నువ్వు ఎక్కడికెళ్లావు?’ అని ప్రశ్నించాడు సదానందుడు. ‘గురువర్యా! నేను మీరు చెప్పింది ఆచరించాలనే.. వీరితో పాటు దారిలో వేచి చూశాను. కానీ ఎంత ఎదురు చూసినా.. ఎవరూ కనిపించలేదు. దాంతో నేను గ్రామం లోపలికి వెళ్లాను. అక్కడ చాలా మంది సేవలు అవసరం ఉన్న వాళ్లు ఉన్నారు. వారికి నా వల్ల అయిన సాయం చేశాను. దానికి మెచ్చి.. వారు దీవెనలు అందించారు. నిజంగా సేవలు అవసరమైన వృద్ధులు మన దగ్గరకు రాలేరు. మనమే వాళ్ల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలి’ అని బదులిచ్చాడు జయంతుడు. అప్పుడు సదానందుడు.. ‘చాలా మంచి పని చేశావు శిష్యా! ఉన్న చోటు నుంచే సాయం చేయాలని కాకుండా, అవసరం ఉన్న వారి దగ్గరకు వెళ్లి నీ సేవలు అందించాలని ఆలోచించావు. నీ ఆలోచనా విధానం అందరికీ ఆదర్శప్రాయం’ అన్నాడు.

ఒకరోజు శిష్యులందరినీ కూర్చోబెట్టి.. ‘శిష్యులారా! నేను ఒక ప్రశ్న అడుగుతాను. సరైన జవాబు చెప్పిన వారిని ఉత్తమ శిష్యులుగా ప్రకటిస్తాను’ అన్నాడు. అలాగేనంటూ ఉత్సాహంగా జవాబిచ్చారు శిష్యులు. ‘ఎదుటి వారికి కోపం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా నివారించాలి’ అని ప్రశ్నించాడు సదానందుడు. అప్పుడు ఒక శిష్యుడు లేచి.. ‘ఎంత కోపం ఉన్నా.. ఎదుటి వారి మీద ప్రదర్శించకుండా అదుపులో పెట్టుకోమని వారికి చెప్పాలి’ అన్నాడు. మరొక శిష్యుడు.. ‘కోపం వచ్చినప్పుడు.. ఆ విషయం గురించి కాకుండా, నచ్చిన అంశాల మీద దృష్టి మరల్చుకోమని చెప్పాలి’ అని జవాబిచ్చాడు. ఆ తర్వాత ఇంకొక శిష్యుడు.. ‘ఆ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపొమ్మనాలి’ అన్నాడు. కానీ ఈ సమాధానాలేవీ సదానందుడికి సంతృప్తినివ్వలేదు. దాంతో జయంతుడిని పిలిచి.. ‘ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు’ అన్నాడు. అది విన్న జయంతుడు మౌనంగా ఉండిపోయాడు. ‘నీ అభిప్రాయం చెప్పమంటే.. మౌనంగా ఉన్నావేంటి జయంతా?’ అన్నాడు గురువు. అయినా కూడా అలాగే ఉన్నాడతడు. దాంతో సదానందుడికి కోపం వచ్చింది.. ‘ఎన్నిసార్లు అడిగినా.. జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి? నా మాటంటే లెక్క లేదా?’ అన్నాడు. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా.. ఉండిపోయాడు జయంతుడు. అది చూసి.. ‘అడిగిన దానికి జవాబు చెప్పడం లేదు. అసలేమైంది జయంతా నీకు’ అన్నాడు సదానందుడు. ‘మీకు ఇంకా నా జవాబు అర్థం కాలేదా! మౌనమే దానికి పరిష్కారం. నేను దాన్ని ఆచరణ రూపంలో మీకు చూపించాను. ఎదుటివారు కోపంలో ఏదో అంటున్నారని మనమూ దానికి అతిగా స్పందించకూడదు. చాలా సందర్భాల్లో కోపాన్ని నివారించాలంటే.. దానికి మౌనమే సరైన పరిష్కారం’ అని బదులిచ్చాడు జయంతుడు. అతని సమాధానం విని.. సదానందుడితో సహా శిష్యులందరూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత.. సదానందుడు, జయంతుడిని ఉత్తమ శిష్యుడిగా ప్రకటించాడు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని