మామిడి కాయల దొంగ!

కోనవలస గ్రామంలో ఉండే రిక్కీ చేసేవన్నీ అల్లరి పనులే. చదివేది ఎనిమిదో తరగతే కానీ చాలా చురుకైనవాడు. సరిగ్గా బడికి వెళ్లేవాడు కాదు.

Published : 01 Mar 2023 00:08 IST

కోనవలస గ్రామంలో ఉండే రిక్కీ చేసేవన్నీ అల్లరి పనులే. చదివేది ఎనిమిదో తరగతే కానీ చాలా చురుకైనవాడు. సరిగ్గా బడికి వెళ్లేవాడు కాదు. ఎప్పుడో ఒకసారి వెళ్లినా, నడకదారి పక్కనే ఉన్న పొలాల్లో దిగి చెరుకు గడలు, శనక్కాయలు కోసుకొని.. మొక్కలను పాడుచేసేవాడు. అదే తరగతిలో ఆనంద్‌ అనే తెలివైన కుర్రాడు ఉన్నాడు. అతడితో స్నేహం చేస్తే నోట్స్‌ ఇస్తాడని రిక్కీకి ఆలోచన వచ్చింది. తరువాత రోజు దొంగతనంగా కోసుకొచ్చిన జామకాయలను ఆనంద్‌కిచ్చి ‘మా తోటలోవి.. తియ్యగా ఉంటాయి.. తీసుకో..’ అన్నాడు. వద్దన్నా వినకుండా చేతిలో పెట్టడంతో తీసుకున్నాడు ఆనంద్‌. తరువాత రోజు చెరకు గడలు, మరో రోజు కందికాయలు తెచ్చిచ్చాడు.

అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత నుంచి రిక్కీ బయటకి వెళ్లేటప్పుడు ఆనంద్‌ని రమ్మనడం మొదలుపెట్టాడు. రానని చెప్పలేక మొహమాటంతో వెళ్లేవాడు ఆనంద్‌. అది చూసిన తోటి విద్యార్థులు ఆనంద్‌ను హెచ్చరించేవారు. అతడితో తిరిగితే ప్రమాదమని వారించేవారు. దానికి ‘నేను మంచివాడిని కాబట్టి నాకే నష్టం లేదు. మహా అయితే వాడు బాగుపడతాడు తప్ప నాకు పోయేది ఏమీ లేదు కదా..’ అంటూ తేలిగ్గా తీసుకునేవాడు ఆనంద్‌. ఒకరోజు బడి వదిలిన తరువాత ఇద్దరూ కలసి ఇంటికి వెళ్తుండగా దారి పక్కనున్న మామిడి తోటలోకి వెళదామన్నాడు రిక్కీ. ఆనంద్‌ వద్దని చెప్పినా.. తను వినిపించుకోలేదు. ‘నీకంత భయమైతే ఇక్కడే ఉండు. నేను వెళ్తాను’ అని తోటలోకి వెళ్లాడు రిక్కీ.

మంచి నిగనిగలాడే మామిడి కాయలను కోసుకుని పుస్తకాల సంచిలో వేసుకోసాగాడు. రిక్కీకి తెలియని విషయమేమంటే.. ఆ తోటకు కాపలా ఉండే వ్యక్తి చాటుగా అదంతా గమనించడం. తోటలోని కాయల్ని ఎవరో కోసుకుపోతున్నారని బాగా కోపంతో ఉన్నాడా తోటమాలి. దొంగ దొరికితే బడితె పూజ చేయాలనే మాటు వేశాడు. రిక్కీ చెట్టు ఎక్కి, కాయలు కోసుకున్న తర్వాత పట్టుకోవాలని ఎదురుచూడసాగాడు. మామిడి కాయల్ని సంచిలో వేసుకున్న రిక్కీని చూసి, దుడ్డుకర్ర పట్టుకుని చెట్టు కిందకు వెళ్లి పైకి చూస్తూ నిల్చున్నాడు. ‘ఓ దొంగబ్బాయ్‌.. కిందకు దిగు.. నీ పని చెబుతా..’ అని గట్టిగా అరిచాడు. తోటమాలిని చూడగానే రిక్కీ క్షణకాలం భయపడ్డాడు. కానీ, అతడికది కొత్తేమీ కాదు. వెంటనే తమాయించుకుని ‘ఏం చేస్తావేంటి? నువ్వు ఒక్కడివి ఉన్నావు. మేము ఇద్దరం వచ్చాం. నిన్ను తన్నేసి వెళ్లినా అడిగే వారు లేరు’ అని తిరిగి దబాయించాడు.

ఆ మాటలకి తోటమాలికి మరింత కోపం వచ్చింది. ‘రెండోవాడు ఎక్కడ?’ అని అడిగాడు. ‘కంచె అవతల ఉన్నాడు. నేను తీసుకువెళ్లబోయే మామిడి కాయల కోసం చూస్తున్నాడు’ అంటూ ఆనంద్‌ని చూపించాడు. తోటమాలికి ఆనంద్‌ సరిగా కనబడకపోవడంతో.. రెండడుగులు పక్కకి వేసి తల తిప్పి అటుగా చూశాడు. ‘నిజమే.. అక్కడొకడున్నాడు..’ అనుకొని రిక్కీ కోసం మళ్లీ చెట్టు మీదకు చూశాడు. అప్పటికే చెట్టు మీద నుంచి దూకేసి పారిపోయాడు. దాంతో తోటమాలి ఆగ్రహం రెట్టింపైంది. ‘కాయలు దొంగతనం చేయడమే కాకుండా నన్ను బెదిరిస్తాడా?’ అనుకొని రిక్కీని వెంబడించాడు. కానీ దొరకలేదు. దాంతో ‘వాడు పోతే పోయాడు. రెండో వాడిని పట్టుకుంటాను. అప్పుడు మొదటి వాడు దొరుకుతాడు’ అనుకుంటూ ఆనంద్‌ వైపు పరిగెత్తాడు తోటమాలి.

అది తెలిసి కూడా తోటమాలి వస్తున్నాడని ఆనంద్‌ని హెచ్చరించలేదు రిక్కీ. తన వైపు పరుగెత్తుకొస్తున్న తోటమాలిని చూశాడు ఆనంద్‌. కానీ.. ‘నేనెందుకు భయపడాలి. నేను దొంగతనం చేయలేదు కదా..’ అని అనుకున్నాడు ధీమాగా. అలా చూస్తుండగానే దగ్గరికి వచ్చిన తోటమాలి ఆనంద్‌ జుట్టుని గట్టిగా పట్టుకున్నాడు. తల కిందకు వంచి వీపు మీద కొట్టడం మొదలుపెట్టాడు.

‘నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేశాను? నీ తోటలోకి కూడా రాలేదు కదా..?’ అని అడిగిన ఆనంద్‌కి.. రెండు చెంపలు వాయించి.. ‘ఇంకా నేనేం చేశానని అడుగుతున్నావా.. సిగ్గు లేదూ? దొంగతనానికి వచ్చి, ఒకడిని లోపలికి పంపి.. నువ్వు బయట కాపలా ఉంటావా? పద.. చెట్టుకు కట్టేస్తాను నిన్ను.. రోజూ మీ ఇద్దరూ కాయలు తెంపి పడేస్తున్నారు. మా యజమాని వచ్చేవరకూ వదిలేది లేదు’ అన్నాడు లోపలకి లాక్కెళ్తూ.. ‘నా మాట నమ్మండి. నేనలాంటివాడిని కాదు’ అని ఆనంద్‌ ఎంత మొత్తుకున్నా తోటమాలి వినిపించుకోకుండా చెట్టుకు కట్టేశాడు.

ఆ దారి వెంబడి వెళుతున్న బాటసారులు  చెట్టుకు కట్టేసి ఉన్న ఆనంద్‌ని చూసి.. ఊళ్లోకి వెళ్లి వాళ్ల అమ్మానాన్నలకు చెప్పారు. వాళ్లు వచ్చి ఆనంద్‌ని విడిపించారు. అసలు జరిగింది ఏంటో అక్కడి వారందరికీ వివరించి.. అందులో తన తప్పేం లేదన్నాడు. ‘చెడ్డ వాడితో స్నేహం చెయ్యడమే నీ తప్పు. ఇంకా ఏం చేయాలి’ అని తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. ‘మిత్రులు హెచ్చరించినా వినకుండా.. తెలిసి తెలిసి రిక్కీతో స్నేహం చేశాను. అందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇకనుంచి పొరపాటు చేయను’ అంటూ బాధపడ్డాడు ఆనంద్‌.  

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని