Story: పులి ముందుచూపు..!

మహేంద్రగిరి అడవికి రాజుగా సింహగిరి అనే సింహం ఉండేది. దానికి ఆరోగ్యం బాలేకపోవడంతో మంత్రి కుందేలును పిలిచి.. ‘నా ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. పాలనా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోతున్నాను.

Published : 29 May 2024 03:25 IST

హేంద్రగిరి అడవికి రాజుగా సింహగిరి అనే సింహం ఉండేది. దానికి ఆరోగ్యం బాలేకపోవడంతో మంత్రి కుందేలును పిలిచి.. ‘నా ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది. పాలనా బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే.. కొత్త రాజును నియమించాలి అనుకుంటున్నాను’ అని చెప్పింది. ఎవరు ఆ పదవికి అర్హులో కూడా దానికి చెప్పింది. అప్పుడు కుందేలు.. ‘మృగరాజా! మీకు నచ్చిన వారిని అడవికి రాజుగా నియమిస్తే, జంతువులకు అసంతృప్తిగా అనిపించవచ్చు. వాటి సమక్షంలోనే ఆ ఎంపిక జరిగితే బాగుంటుంది’ అని సలహా ఇచ్చింది. ఆ మాటలు విన్న సింహం.. అడవిలోని జీవులన్నింటితో సమావేశం ఏర్పాటు చేయమని కుందేలును ఆదేశించింది.

చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయాన్నే సమావేశానికి అన్ని జంతువులు హాజరయ్యాయి. అప్పుడు మృగరాజు మాట్లాడుతూ.. ‘నా ఆరోగ్యం ఈ మధ్య కాలంలో సరిగా ఉండటం లేదు. అడవి పాలనా బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను. కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే ఒక నెల రోజులపాటు తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించడానికి, మీకు నచ్చిన జంతువును ఎంపిక చేసుకోండి’ అని అంది. అప్పుడు ఒక ఎలుగుబంటి.. ‘మృగరాజా! మా బాగోగులు చక్కగా చూసే జంతువును మీరే తాత్కాలిక రాజుగా నియమించండి’ అంది. సమావేశానికి వచ్చిన మిగతా జంతువులు కూడా దానితో ఏకీభవించాయి. అప్పుడు మృగరాజు.. ‘మన అడవికి తాత్కాలిక రాజుగా.. పెద్దపులి ఉంటుంది’ అని ప్రకటించింది.

ఇక ఆ రోజు నుంచి అడవికి రాజుగా బాధ్యతలు చేపట్టింది పెద్దపులి. మంత్రి కుందేలు ద్వారా సింహగిరి.. అది పాలనలో చేపడుతున్న కొత్త కార్యక్రమాలను తెలుసుకోసాగింది. పులి అడవి జీవులకు సమావేశం ఏర్పాటు చేసి.. ఎండిపోయిన నీటి చెరువుల్లో చెత్తాచెదారం తొలగించాలని ఆజ్ఞలు జారీ చేసింది. కానీ ఆ పనులు చేయడం జంతువులకు కొంచెం కష్టం అనిపించింది. అంతే కాకుండా పక్షులతో అడవి శివార్లలో నలువైపులా విత్తనాలు చల్లించింది. అవి మొలకెత్తిన తర్వాత సంరక్షించే బాధ్యత ఆ పరిసరాల్లో ఉన్న జంతువులు తీసుకోవాలని చెప్పింది. జంతువులన్నీ.. ఈ తాత్కాలిక మృగరాజు.. చాలా కష్టమైన పనులు చెబుతుందని భావించసాగాయి. ఒకరోజు, ఒక కోతి ఆహార సేకరణకు వెళ్లకుండా.. చిన్న, ముసలి జీవులకు తెచ్చే ఆహారాన్ని దొంగిలించి తినేస్తుందనే ఫిర్యాదు పెద్దపులికి అందింది. దాంతో ఆ కోతికి.. ఎవరి వద్దనైతే ఆహారం దొంగతనం చేసిందో.. వాటికి పది రోజులపాటు ఆహారం తెచ్చి ఇవ్వాలని శిక్ష విధించింది. అలా మరో రెండు రోజులు గడిచిన తర్వాత.. పులి పదవి గడువు ముగిసింది.

మృగరాజు సింహగిరి మళ్లీ సమావేశం ఏర్పాటు చేసి.. ‘నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. మరో నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు పులినే రాజుగా కొనసాగిద్దామా?’ అని అడవి జీవులకు ప్రశ్నించింది. దానికి కొన్ని జంతువులు ‘వద్దు.. వద్దు’ అంటూ సమాధానమిచ్చాయి. ‘కారణమేంటో వివరించండి!’ అడిగింది మృగరాజు. ఒక తోడేలు ముందుకు వచ్చి.. ‘ఈ పులి నెల రోజులుగా అడవిలోని జీవులకు విశ్రాంతి లేకుండా చేసింది. చాలా పనులు చేయించింది. అది మాకు చాలా కష్టంగా ఉంది. అందుకే చాలా జంతువులకు ఇష్టం లేదు’ అని చెప్పింది. అప్పుడే, ఆహారం దొంగిలించి శిక్ష అనుభవించిన కోతి తల్లి వచ్చి.. ‘మృగరాజా! నా పిల్ల కోతి ఇన్ని రోజులు సోమరితనంతో ఉండేది. కానీ పులి విధించిన శిక్ష వల్ల చలాకీగా మారింది. దాని ఆహారాన్ని అదే సంపాదించుకుంటోంది. మీ ఆరోగ్యం కుదుటపడే వరకు పులి రాజుగా ఉంటేనే బాగుంటుంది’ అని చెప్పింది.

తర్వాత ఒక ముసలి ఎలుగుబంటి లేచి.. ‘ఈతరం జీవులకు మన అడవి విస్తీర్ణం అసలు తెలియదు. దట్టమైన పొదలతో చెట్లతో చాలా పెద్దగా ఉండేది. కానీ సమీప గ్రామాల ప్రజలు చెట్లను నరుకుతూ అడవి విస్తీర్ణం తగ్గించేశారు. అది మళ్లీ పెంచాలనే ఉద్దేశంతో.. అడవి శివార్లలో మొక్కలు పెంచే కార్యక్రమం చేపట్టింది. ఎండిన చెరువుల్లో చెత్తను తీయించి.. వర్షాలు పడినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన పులి ఆలోచన బాగుంది’ అని చెప్పింది. దానితో పాటు మరికొన్ని జంతువులు కూడా వంతపాడాయి. పులిని మృగరాజుగా వద్దన్న జీవులు దాని దగ్గరకు వచ్చి.. ‘మమ్మల్ని క్షమించు. నీ ముందుచూపుని అర్థం చేసుకోలేకపోయాము’ అని చెప్పాయి. అప్పుడు సింహగిరి.. ‘పులి చేపట్టిన చర్యలు నేను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాను. మీ అందరి అభీష్టంతో రాజుగా ఈ పెద్దపులిని ప్రకటిస్తున్నాను. నేను ఇక శాశ్వతంగా బాధ్యతలు నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటాను’ అని చెప్పింది. మృగరాజు నిర్ణయాన్ని జంతువులన్నీ అంగీకరించాయి.

 మొర్రి గోపి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని