Mardati Roshan: చూశాడు.. నేర్చేశాడు.. పతకాలూ పట్టాడు!

హాయ్‌ నేస్తాలూ..! కొన్నిసార్లు మనం ఏవైనా అంశాలను చూసినప్పుడు భలేగా నచ్చేస్తాయి.. నేర్చుకోవాలనే ఆసక్తి కూడా కలుగుతుంది.. అవి ఆటలు, పాటలు, నృత్యాలు ఇంకేవైనా కావచ్చు. ఎంత నేర్చుకున్నా అందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేది మాత్రం కొందరే. ఆ కోవకు చెందిన బుడతడి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

Published : 09 Jul 2024 00:22 IST

హాయ్‌ నేస్తాలూ..! కొన్నిసార్లు మనం ఏవైనా అంశాలను చూసినప్పుడు భలేగా నచ్చేస్తాయి.. నేర్చుకోవాలనే ఆసక్తి కూడా కలుగుతుంది.. అవి ఆటలు, పాటలు, నృత్యాలు ఇంకేవైనా కావచ్చు. ఎంత నేర్చుకున్నా అందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చేది మాత్రం కొందరే. ఆ కోవకు చెందిన బుడతడి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెంటనే ఈ కథనం చదివేయండి ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి..!

తిరుపతికి చెందిన మర్దటి రోషన్‌కు పదమూడు సంవత్సరాలు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తన అమ్మానాన్నలు ప్రేమ్‌కుమార్, మహాలక్ష్మి.. ప్రైవేటు ఉద్యోగులు. ఈ బుడతడు.. స్కేటింగ్‌లో ఉన్నతంగా రాణిస్తున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తా చాటుకుంటున్నాడు. తను చిన్న వయసులో ఉన్నప్పుడు.. ఒకసారి అమ్మానాన్నలతో కలిసి బయటికి వెళ్లాడట రోషన్‌. అప్పుడే ఓ చోట.. స్కేటింగ్‌ ఆటను చూసి.. అది నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడట. అలా అనుకోవడం సులభమే.. కానీ కష్టపడి నేర్చుకోవాలంటే ఎంతో పట్టుదల కావాలి. తన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు.. స్కేటింగ్‌ శిక్షణలో చేర్పించారు. ఈ చిన్నారి చాలా శ్రద్ధగా స్కేటింగ్‌ నేర్చుకొని అందులో చక్కని ప్రతిభ చూపుతున్నాడు.

పతకాల పంట..!

మన రోషన్‌ని చూసి.. వాళ్ల అక్క కావ్య కూడా స్కేటింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించిందట. ఇప్పటి వరకు.. రోషన్‌ పదుల సంఖ్యలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అందులో 9 బంగారు, 10 రజత, 4 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొంది.. స్కేటింగ్‌లో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలనేదే తన లక్ష్యమట. అలాగే.. ఆర్మీ ఉద్యోగిగా దేశానికి సేవలందించడం కూడా తన లక్ష్యమట. తను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!

పిల్లనగోయిన రాజు ఈనాడు డిజిటల్, తిరుపతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని