story: బెక.. బెక.. బతికేస్తా ఎంచక్కా!

హాయ్‌.. నేస్తాలూ బాగున్నారా! నేనో కప్పను. నాకో ప్రత్యేకత ఉంది తెలుసా? ఆ విశేషాలు మీతో పంచుకుందామనే ఇదిగో ఇలా.. మీ ముందుకొచ్చాను.

Published : 17 Jun 2024 00:21 IST

హాయ్‌.. నేస్తాలూ బాగున్నారా! నేనో కప్పను. నాకో ప్రత్యేకత ఉంది తెలుసా? ఆ విశేషాలు మీతో పంచుకుందామనే ఇదిగో ఇలా.. మీ ముందుకొచ్చాను. మరి ఆ వివరాలు తెలుసుకుంటారా?! అయితే ఈ బెక.. బెక.. గురించి చక.. చక.. చదివేయండి సరేనా! 

నా పేరు రానోయిడియా ప్లాటిసెఫాలా. పలకడానికి, గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదూ! మరేం ఇబ్బంది లేదు! నన్ను వాటర్‌ హోల్డింగ్‌ ఫ్రాగ్‌ అని కూడా అంటారు. మీరూ ఇలాగే పిలిచేయండి సరేనా! ఆస్ట్రేలియా నా స్వస్థలం. భూమి లోపల నివసించడం నా ప్రత్యేకత. ఉత్తర ఆస్ట్రేలియాలో చాలా తక్కువ వర్షం పడుతూ ఉంటుంది. అక్కడ కేవలం 12 మి.మి. వర్షపాతం మాత్రమే నమోదవుతూ ఉంటుంది. అందుకే నేను వర్షాకాలంలో నా బరువులో దాదాపు 50 శాతం వరకు నీటిని శరీరంలోనే నిల్వ చేసుకుంటాను. తర్వాత భూమికి మూడు అడుగుల లోతుకు వెళ్లిపోతాను. మళ్లీ వర్షాకాలం ప్రారంభం అయ్యేంత వరకు అక్కడే ఉండిపోతాను. దాదాపు రెండు సంవత్సరాల వరకు ఆహారం లేకుండా అలాగే నేను ఉండిపోగలను తెలుసా! 

పుష్టిగా ఉంటానోచ్‌!

నా పొడవు కన్నా.. వెడల్పే ఎక్కువ. చూడ్డానికి పుష్టిగా కనిపిస్తుంటాను. నా కాళ్లు మిగతా కప్పలతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. కానీ నీటిలో మాత్రం వేగంగా ఈదగలను. వెనక కాళ్లు బలంగా ఉంటాయి. వీటితోనే బురదనేలను తవ్వుకొని లోపలకు వెళ్లిపోతుంటా. మాలో కొన్ని బంగారం, ముదురు గోధుమ, బూడిద రంగులో ఉంటాయి. కొన్నింటికి మృదువైన చర్మం ఉంటే, మరికొన్నింటికి మచ్చలతో కూడిన చర్మం ఉంటుంది. నీరు దొరకని కాలంలో నన్ను నేను రక్షించుకోవడానికి భూమి లోపలికి వెళ్లిపోతుంటాను. ఈ సమయంలో నా శక్తిని ఆదా చేసుకునేందుకు జీవక్రియ వేగాన్ని  తగ్గించుకుంటాను. భూమిపై ఉన్నప్పటి కంటే ఆక్సిజన్‌ వినియోగం కూడా దాదాపు 70 శాతం వరకు తగ్గించుకుంటాను. ఈ క్రమంలో నా చుట్టూ ఒక రకమైన శ్లేష్మపు పొరను ఏర్పరచుకుంటాను. వాతావరణం అనుకూలించాక ఎంచక్కా మళ్లీ బయటకు వచ్చేస్తా. 

ఏం తింటానంటే..

వానాకాలంలో భూమి లోపలి నుంచి బయటకు వచ్చాక చెరువులు, నీటి వనరుల్లో సంతానోత్పత్తి చేస్తాను. వేసవికాలం ప్రారంభం వరకు హాయిగా ఉంటాను. తిరిగి ఎండాకాలం ప్రారంభం కాగానే నాలో నీటిని నింపుకొని భూమి లోపలకు వెళ్లిపోతాను. నేను చిన్న చిన్న పురుగులు, వానపాములు, ఇతర కప్పల టాడ్‌పోల్‌ లార్వాలను ఆహారంగా తీసుకుంటాను. నేల మీద ఉన్నప్పుడు చీమలు, చెదపురుగుల్ని తిని నా పొట్ట నింపుకుంటాను. పాములు, పెద్ద పెద్ద బల్లులు, పక్షులు నాకు ప్రధాన శత్రువులు. వాతావరణ మార్పులతో కూడా నాకు ముప్పు పొంచి ఉంటోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని