చందమామలో మేనమామ!
తుల్యభాగా నదీ తీరాన ఉన్న అడవిలో సౌఖ్యం అనే కుందేలు ఉంది. దానికి రత్నం అనే బుజ్జి పిల్ల ఒకటుంది. రత్నం రోజూ ఆహారం తినడానికి మారాం చేసేది. దాని కోసం సౌఖ్యం అడవంతా తిరిగి మరీ చిలగడదుంపలు, ముల్లంగి మొదలైనవి వెతికి తీసుకొచ్చేది. ఒకరోజు సౌఖ్యం తన పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకుని చంద్రుణ్ని చూపిస్తూ.. ‘చూడు.. చూడు.. ఆ చంద్రుడిలో నీ మేనమామ ఎలా కనిపిస్తున్నాడో.. నువ్వు ఈ దుంప పూర్తిగా తినేస్తే నీకు మంచి బహుమతులు తెచ్చిస్తాడు’ అంటూ తినిపిస్తోంది.
‘నన్నెప్పుడూ చూడడానికి కూడా రాని మామ, ఇప్పుడు ఈ దుంప తినేస్తే బహుమతులు తీసుకొస్తాడా?’ అంటూ తెలివైన ప్రశ్న వేసింది రత్నం. ‘వస్తాడమ్మా.. పౌర్ణమి రాగానే నీ మేనమామ వచ్చేస్తాడు.. కావాలంటే చూడు నీ వంక ఎలా చూస్తున్నాడో..’ అంటూ చందమామను చూపించి ఆ రోజుకు తినిపించింది.
‘మన రోజుల్లో పిల్లలు ఏదైనా చెబితే ప్రశ్నించకుండా వినేవారు.. ఇప్పుడలా కాదు..’ అంది అప్పుడే చెట్టు దిగిన ఉడత. కానీ అమ్మ మాటలు రత్నంలో ఆలోచనలు రేకెత్తించాయి. ‘మావయ్య ఎందుకు మా దగ్గరకు రావడం లేదు.. అసలు అంత దూరంగా ఎందుకు వెళ్లిపోయాడు’ అని అడిగింది మరలా.
‘ఆకాశంలో ఉండి మనందరికీ వెన్నెల పంచుతున్నాడు. అక్కడే బాగుందేమో ఇక్కడికి రావడం లేదు’ అంది తల్లి. ‘అలాగా..’ అంటూ మరలా ఆలోచనలో పడింది రత్నం. ఎలాగైనా.. మావయ్యను తీసుకురావాలనుకున్న దాని నిర్ణయం మరింత బలపడింది. దాంతో ఒక రోజు తల్లికి చెప్పకుండా చంద్రుని దగ్గరకు బయలుదేరింది. దారిలో దానికి ఓ జింక ఎదురైంది.
‘ఏయ్ కుందేలూ.. నువ్వు సౌఖ్యం పిల్లవి కదా.. ఎక్కడికి వెళ్తున్నావు?’ అని ప్రశ్నించింది. ‘మా మావయ్యను తీసుకు రావడానికి వెళ్తున్నా జింక మామా’ అంది రత్నం. సరేనంది జింక. కొంత దూరంలో దానికి కోతి కనిపించి.. ‘ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగింది.
‘మావయ్య దగ్గరికి కోతి బావా, వచ్చేటప్పుడు నాతోపాటు తీసుకొస్తా’ అంది. జాగ్రత్తలు చెప్పి పంపించింది కోతి. అలా అందరితో ఉత్సాహంగా మాట్లాడుతూ అడవి దాటేసింది రత్నం. పిల్ల కనిపించకపోవడంతో తల్లి కంగారు పడుతూ.. అడవి మొత్తం వెతకసాగింది. ఇంతలో ‘మావయ్యను తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పిందే..’ అంది కోతి.
‘అయ్యో.. ఎంత పని జరిగింది. ఇప్పుడది ఎక్కడికెళ్లిందో.. ఏమిటో..’ అంటూ కంగారుగా బయలుదేరింది. అడవి దాటిన రత్నం.. ‘అందరికీ మామ ఆ చందమామ.. చందమామలో ఉన్నాడు నా మేనమామ’ అని పాడుకుంటూ మరో అడవిలోకి ప్రవేశించింది.
అప్పుడే తన మంత్రి ఏనుగుతో వనంలో తిరుగుతున్న అక్కడి మృగరాజు.. ‘ఇదేదో కొత్తగా మన అడవిలోకి వచ్చినట్టుందే..’ అని అడిగింది. ‘అవును మృగరాజా..! తల్లిదండ్రులకు చెప్పకుండా బయట తిరుగుతున్నట్లుంది’ అంది ఏనుగు. అయితే దీన్నివాళ్ల అమ్మ దగ్గరికి పంపాలంది.
‘ఇలాంటి చిన్న పిల్లలు మనం చెబితే వినరు మృగరాజా..! వాళ్లకు వాళ్ల పద్ధతిలోనే చెప్పాలి’ అంది ఏనుగు. ‘ఓయ్ కుందేలు పిల్ల.. ఎక్కడి నుంచి వస్తున్నావు. నీ పేరేంటి?’ అంది ఏనుగు. ‘నేను మా ఇంటి నుంచి వస్తున్నా. మా మావయ్య చంద్రుని దగ్గర ఉన్నాడు. మా ఇంటికి తీసుకు వెళ్లాలి’ అంది రత్నం తన పేరు చెబుతూ.
‘మీ మామ అక్కడున్నాడని ఎవరు చెప్పారు?’ అడిగింది ఏనుగు. ‘ఒకసారేమిటీ.. మా అమ్మా నాకు దుంపలు తినిపిస్తూ రోజూ చెబుతుంది’ అంది. ‘అదీ సంగతి మృగరాజా..! ఇది తిండి తినకుండా మారాం చేస్తోందని వాళ్లమ్మ చెప్పిన మాటలు పట్టుకుని చంద్రుని దగ్గరకు బయలుదేరింది’ సింహంతో అంది మంత్రి ఏనుగు.
‘మరెలా దీన్ని వెనక్కి పంపడం?’ అంది మృగరాజు. దానికి చిట్కా నా దగ్గరుందంటూ.. ‘ఓ రత్నం.. నీ మేనమామ నిన్న రాత్రే ఇక్కడకు వచ్చాడు. నీ వెంట పంపుతాను. అందాకా ఈ పచ్చిక తింటూ ఉండు’ అంది. ‘భలే భలే.. నా మేనమామ ఇక్కడే ఉన్నాడా?’ ఎగురుకుంటూ అంది రత్నం. అడవిలో ఉన్న మరో కుందేలును రత్నం మేనమామగా పరిచయం చేసింది ఏనుగు.
‘ఇదిగో మేనమామా.. మీ రత్నాన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు’ అంది. అలా.. మేనమామను తీసుకుని తన అడవికి బయలుదేరింది రత్నం. క్షేమంగా బిడ్డను తీసుకు వచ్చిన కుందేలుకు కృతజ్ఞతలు చెప్పింది సౌఖ్యం.
‘వస్తాను రత్నం’ అంది మేనమామ కుందేలు. ‘అప్పుడే వెళ్లిపోతావా మావయ్యా?’ అంది రత్నం. ‘అందరికీ వెన్నెల పంచాలి కదా.. రాత్రికి చంద్రుడితో ఉండి, నీకు వెన్నెల పంపుతా?.. పిల్ల జాగ్రత్త’ అంటూ వీడ్కోలు పలికింది. ఆ రోజు పున్నమి చంద్రుడిలో ఉన్న కుందేలును చూస్తూ.. అమ్మ పెట్టిన దుంప తింటూ.. అందరికీ.. ‘మన మామ చందమామ.. ఆ చందమామలో ఉన్నాడు నా మేనమామ’ అంటూ అమ్మ ఒడిలో నిద్దురపోయింది రత్నం.
కూచిమంచి నాగేంద్ర
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
అంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎలా వచ్చింది?
-
General News
Viveka murder case : వివేకా హత్య కేసులో తులసమ్మ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
Ap-top-news News
Gudivada Amarnath : మంత్రి గారికి కోపమొచ్చింది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్
-
Ts-top-news News
MLC kavitha: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ
-
Ap-top-news News
Vijayawada: విజయవాడ- శిర్డీ విమాన సర్వీసు ప్రారంభం