Moral story: ఎవరి ప్రత్యేకత వారిదే..!

వింద్యారణ్యంలో ఒక చెట్టు మీద ఓ కోయిల.. దాని పిల్ల కోయిల కుహూతో నివసించేది. ఒకరోజు ఆడుకోవడానికి వెళ్లొచ్చి.. ‘అమ్మా! ఈ రోజు ఆ కాకిపిల్ల నాతో పోటీలో ఓడిపోయింది’ అని సంబరంగా చెప్పింది పిల్లకోయిల.

Published : 13 Jun 2024 00:04 IST


వింద్యారణ్యంలో ఒక చెట్టు మీద ఓ కోయిల.. దాని పిల్ల కోయిల కుహూతో నివసించేది. ఒకరోజు ఆడుకోవడానికి వెళ్లొచ్చి.. ‘అమ్మా! ఈ రోజు ఆ కాకిపిల్ల నాతో పోటీలో ఓడిపోయింది’ అని సంబరంగా చెప్పింది పిల్లకోయిల. ‘అవునా..! ఇంతకీ ఏం పందెం పెట్టుకున్నారు?’ అని కుతూహలంగా అడిగింది తల్లి కోయిల. ‘పాటల పోటీ అమ్మా! నా అంత తీయగా పాడలేక.. కావ్‌ కావ్‌మంటూ అది ఒకటే గగ్గోలు పెట్టేసింది. దాని కంటే నేనే గొప్ప కదమ్మా’ కాస్త గర్వంగా చెప్పింది కుహూ. ‘తప్పమ్మా! అలా అనకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు చక్కగా పాడగలవు.. అది ఇంకేదో పనిలో నిష్ణాతురాలు అయి ఉండొచ్చు. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు. అయినా కాకి నీకు సోదర సమానం తెలుసా?’ అని చిన్నగా మందలించింది తల్లి. ‘సోదర సమానమా! ఒకే రంగులో ఉన్నంత మాత్రాన.. కాకి నాకు సోదర సమానం ఎలా అవుతుంది?’ సందేహంగా అడిగింది కుహూ. 

‘అసలు నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా?’ అని అడిగింది తల్లి కోయిల. ‘అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తల్లే కదా అందరు పిల్లలకు జన్మనిచ్చేది..!’ అంది కుహూ. ‘అక్కడే నువ్వు పొరబడ్డావు కుహూ... ఈ సృష్టిలో ప్రతీ పక్షీ తనదైన తీరులో అందమైన గూడు కట్టి.. అందులో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదుగుతుంది. కానీ మన జాతికి గూడు కట్టే నైపుణ్యం, పిల్లల్ని పొదిగే వీలూ లేదు.. తెలుసా!’ చెప్పింది తల్లి విచారంగా. దానికి.. ‘అవునా..! మరి నేనెలా పుట్టానమ్మా? నువ్వు మా అమ్మవి కాదా?’ ఆశ్చర్యపోతూ అడిగింది కుహూ. ‘ముమ్మాటికీ నేనే నిన్ను కన్నతల్లిని. నేను పెట్టిన గుడ్డులో నుంచే నువ్వు వచ్చావు! మనకు గూడు కట్టడం రాదు కదా! ఏ చెట్టు కొమ్మ మీదనో గుడ్లు పెడితే.. కింద పడి పగిలిపోతాయి. పోనీ గుడ్లు పెట్టినా.. పొదగలేము’ అని వివరించింది తల్లి కోయిల. ‘మరి నేనెలా పుట్టాను?’ కంగారుగా అడిగింది కుహూ. ‘నువ్వే కాదు.. మన కోయిల జాతి పుట్టుకకు ఆధారం కాకి జాతే!’ చెప్పింది తల్లి. ‘అదెలాగమ్మా?’ అడిగింది కుహూ. ‘మనలో తల్లి పక్షి గుడ్లను పెట్టే సమయానికి, కాకి గూడును వెతుక్కొని అందులో పెడుతుంది. కాకి ఆ గుడ్లు కూడా.. దానివే అనుకుని, వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది’ అని వివరంగా చెప్పింది తల్లి. ‘హో! అవునా అమ్మా..’ అంటూ విచిత్రంగా చూస్తూ వింటోంది కుహూ. ‘అంతే కాదు..! వాటికి ఆహారం కూడా తెచ్చి పెడుతుంది తల్లి కాకి. కొంత కాలానికి.. వాటికి అరవడం రాగానే వాటి గొంతు గుర్తు పట్టి, కోయిల పిల్లల్ని బయటకు పంపేస్తుంది’ అంది తల్లి కోయిల. 

‘మరి అప్పుడు.. వాటి పిల్లలను మన కోయిలలు ఎలా గుర్తుపడతాయి?’ అని అడిగింది కుహూ. ‘కాకి గూటిలో తల్లి కోయిల గుడ్లు పెట్టినప్పటి నుంచి.. తండ్రి కోయిల దాన్ని కనిపెట్టుకొనే ఉంటుంది. ఎప్పుడూ ఆ చుట్టు పక్కలే తిరుగుతుంటుంది. కాకి దాని పిల్లలు కాదని గుర్తించి బయటకు పంపించినప్పుడు.. కాపాడి తీసుకొస్తుంది. అప్పటి నుంచి మన కోయిల పిల్లలు కాస్త పెద్దయ్యేంత వరకు తల్లిదండ్రులతోనే ఉంటాయి’ చెప్పింది తల్లి కోయిల. ‘మన జాతి పుట్టుక వెనక ఇంత కథ ఉందా? మన పుట్టుకకు ఆధారం కాకి జాతి అన్న మాట. అయితే నువ్వు చెప్పినట్టు.. ఆ కాకి నా సోదర సమానమే అమ్మా! ఇప్పుడే తన దగ్గరకు వెళ్లి.. ఎగతాళి చేసినందుకు క్షమాపణ అడుగుతాను’ అన్నది కుహూ రెక్కలు సవరించుకుంటూ. ‘అవునమ్మా! అందుకే రూపాన్ని, పరిస్థితులను బట్టి ఎవరినీ తక్కువ చేసి మాట్లాడకూడదు... అగౌరవపరచకూడదు. ప్రతి జీవితో ఇంకో జీవికి కచ్చితంగా.. అవసరం ఏర్పడుతుంది.. అర్థమైందా? ఎవరి ప్రత్యేకత వారికే ఉంటుంది’ చెప్పింది తల్లి కోయిల. ‘ఓ బాగా అర్థమైందమ్మా!’ అంటూ బదులిచ్చింది కుహూ. దానిలో వచ్చిన మార్పు చూసి తల్లి కోయిల చాలా సంతోషించింది.

- కోనే నాగ వెంకట ఆంజనేయులు  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని