Story: కుందేలు తెలివితేటలు!

తామ్రపర్ణీ నదీ తీరాన ఉన్న అడవికి చందనుడు అనే సింహం రాజుగా ఉండేది. ఆ వనంలో చందనపు చెట్లు చాలా ఎక్కువ. నిత్యం సువాసనలు వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ అరణ్యం.

Published : 02 Jun 2024 04:13 IST

తామ్రపర్ణీ నదీ తీరాన ఉన్న అడవికి చందనుడు అనే సింహం రాజుగా ఉండేది. ఆ వనంలో చందనపు చెట్లు చాలా ఎక్కువ. నిత్యం సువాసనలు వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ అరణ్యం. చందనుడికి చాలా కాలం తర్వాత సంతాన భాగ్యం కలిగింది. కొన్ని నెలల అనంతరం ఆ బుజ్జి సింహాన్ని మంచి గురువు దగ్గర చేర్పించి, చదువు చెప్పించాలని అనుకుంది మృగరాజు. ఈ విషయమై జంతువులన్నింటినీ సమావేశపరిచింది.

‘మృగరాజా..! చిన్ని రాజుకు చదువు చెప్పగల గురువు మన వనంలో లేరు’ అంది మంత్రి ఏనుగు. ‘రాజా.. మన పక్కనున్న వనంలో సుగంధి అనే ఏనుగు చిన్న జంతువులకు పాఠాలు నేర్పుతోందని విన్నాను. పైగా ఆ ఏనుగు చాలా తెలివి గలదని, పిల్లలను ప్రయోజకులుగా చేస్తోందని తెలిసింది’ అంది కాకి. ‘నువ్వు అడవులన్నీ తిరుగుతావు, కానీ మృగరాజు బిడ్డ అలా కాదుగా.. పక్క అడవికి వెళ్లి చదువు నేర్చుకోవడం అంటే మాటలా!’ అంది కోయిల. ‘ఏం ఎందుకు కాదు.. ఒకప్పుడు వేటగాళ్ల బెడద ఎక్కువైందంటే ఆ రాజుకు మనం సహాయం చేయలేదా..!? మృగరాజా.. మీరు అడిగితే ఆ పక్క అడవి రాజు కాదు అనదు. పైగా మనకు ఏదో విధంగా సహాయపడాలని ఆ జంతువులతో చెప్పడం నేను విన్నాను’ అంది కాకి.

‘అయితే ఇంకేం రేపే నువ్వు ఆ అడవికి వెళ్లి మన రాజు మాటగా.. చిన్ని రాజుకు చదువు చెప్పాలని అడిగి రా!.. మీరేమంటారు.. మృగరాజా!’ అంది మంత్రి. ‘మీ అందరికీ ఇష్టమైతే నాకూ ఇష్టమే’ అంది మృగరాజు. ‘కానీ ఇక్కడ ఓ చిక్కు ఉంది’ అంది కాకి. ‘అన్నీ అనుకున్నాక చిక్కేమిటి?’ అని కాస్త విసుగ్గా అంది కుందేలు. ‘ఏం లేదు రాజా.. అక్కడ చండిక అనే నక్క ఉంది. అది అక్కడ రాజుకు తప్పుడు సమాచారం ఇచ్చి, చిన్న చిన్న జంతువులను చంపిస్తోంది. పాపం అవన్నీ ఏమి చేయలేక విలవిల్లాడుతున్నాయి దాని వల్ల మన చిన్ని రాజుకు ఏదైనా ప్రమాదం ఉంటుందేమో’ అని నసిగింది కాకి. ‘దాని సంగతి నేను చూసుకుంటాలే’ అంది మంత్రి ఏనుగు. సరే అంటూ ఆ వనం వైపు ఎగిరింది కాకి.

కాకి తెచ్చిన సమాచారానికి పక్క అడవి రాజు ఎంతో సంతోషించింది. ఈ విధంగా మీకు సహాయపడడం ఆనందంగా ఉందంటూ.. గురువు సుగంధికి కబురు పెట్టి విషయం చెప్పింది. ‘రాజా.. మీ మాట కాదని అంటామా, ఆ చిన్ని రాజుకు చదువు చెప్పి కొద్ది రోజుల్లోనే ప్రయోజకునిగా చేస్తాను. మీ పేరు నిలబెడతాను’ అంది గురువు సుగంధి. ఓ మంచి ముహుర్తాన చందనుడి సంతానమైన చిన్ని రాజును చదువు కోసం పక్క అడవికి తీసుకు వచ్చారు. చందనుడితో పాటు మంత్రి ఏనుగు, ఎలుగుబంటి కూడా వచ్చాయి. ఎంతో సాదరంగా ఆహ్వానించింది పక్క అడవి రాజు. ‘రాజా! మా చిన్ని రాజుకు మీ అడవిలో చదువు నేర్పించేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే మా చిన్ని రాజుకు తోడుగా, మీ అడవిలో ఉండే చండిక అనే నక్కను నియమించాల్సిందిగా కోరుతున్నా’ అంది మంత్రి ఏనుగు.
‘భలే.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు. ఇక చండిక మా చిన్ని రాజును ఏమీ చేయలేదు’ అంది కాకి మెల్లగా. ‘అలాగే’ అంటూ చండికను చిన్ని రాజుకు రక్షణ కోసం నియమించింది పక్క అడవి రాజు. చిన్ని రాజు సుగంధి దగ్గర రోజూ పాఠాలకు వెళుతోంది. చండిక సహాయంగా ఉంటోంది. ‘ఆ నక్క మహారాజు దగ్గర మన గురించి లేని పోనివి చెప్పి మనల్ని చంపిస్తోంది. ఇప్పుడు ఈ చిన్నిరాజుకు రక్షణగా ఉంటోంది. దీని చదువు పూర్తి అయ్యిందా! చండిక మళ్లీ మనల్ని చంపిస్తుంది’ అనుకున్నాయి పక్క అడవిలోని చిన్న జంతువులన్నీ.

‘చిన్ని రాజు చదువు పూర్తి కాకుండానే ఈ చండికను మనం వదిలించుకోవాలి’ అంది జింక. ‘అదెలా..?’ అని తన సందేహాన్ని వ్యక్తం చేసింది నెమలి. ‘దానికి నా దగ్గర ఓ ఉపాయం ఉంది. కానీ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అంది కుందేలు.

చిన్ని రాజు చదువు పూర్తయ్యే వరకు చండిక వేటకు పోవడానికి లేదు. దానికి రోజూ కొద్దిగా మాంసం అందిస్తున్నాయి జంతువులు. అర్ధాకలితో సర్దుకుపోతోంది చండిక. ఒకరోజు చిన్ని రాజుకు పాఠం పూర్తయ్యాక తీసుకువస్తోంది. అప్పుడే దానికి ఓ కుందేలు పిల్ల పక్కన పొదల్లో కనిపించింది. నక్కకు నోరు ఊరింది. ‘చిన్ని రాజా! మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ ఆ పొదల మీదకు దూకింది నక్క. కుందేలు పిల్ల ఇంకా లోపలికి వెళ్లింది. అప్పుడే అక్కడికి జింక వచ్చి... ‘చిన్ని రాజా! ఆపద ముంచుకు వస్తోంది. ముందు మీరు నా వెంట రండి. అంటూ చిన్ని రాజును తీసుకెళ్లింది. పొదలో ఎంత వెతికినా నక్కకు కుందేలు పిల్ల కనబడలేదు. దీంతో... ‘ప్చ్‌... చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుంది’ అనుకుంటూ వెనక్కు వచ్చింది నక్క. అక్కడ చిన్ని రాజు కనబడక పోవడంతో దాని పై ప్రాణాలు పైనే పోయాయి. ‘చిన్ని రాజా!.. చిన్ని రాజా..!’ అని అరుచుకుంటూ చుట్టూ వెతికింది. అప్పటికే పథకం ప్రకారం దాన్ని ఓ చిన్ని గుహలోకి చేర్చింది జింక.

చిన్ని రాజును నక్క ఏదో చేసిందని మిగతా జంతువులు ఈలోపే రాజుకు చెప్పాయి. ‘అసలు చిన్ని రాజుకు తోడుగా ఉండాల్సిన నువ్వు, ఎక్కడికి వెళ్లావు?’ అంది సింహం కోపంగా. ‘కుందేలు పిల్ల కనపడితే దాని వెంట వెళ్లాను’ అని చెబితే ఏం చేస్తుందో అని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నక్క. కోపం తారస్థాయికి చేరి, ఒకే ఒక్క దెబ్బతో నక్కను చంపేసింది సింహం. ఈ విషయం తెలియగానే చిన్ని రాజును తీసుకు వచ్చింది జింక. ‘రాజా...! నక్క ఈ చిన్ని రాజును వదిలి పోవడంతో ప్రమాదమని, నేనే జాగ్రత్తగా ఇక్కడకు తీసుకు వచ్చాను’ అంది. ‘భేష్‌..! మన అడవి పరువు నిలబెట్టావు. రేపటి నుంచి చిన్ని రాజు చదువు పూర్తయ్యేదాకా నువ్వే తోడుగా ఉండు’ అంది రాజు. ‘మేమంతా కూడా సహాయంగా ఉంటాం రాజా!’ అన్నాయి చిన్న జంతువులన్నీ. తర్వాత అవన్నీ.. తెలివిగా నక్కను చంపించిన కుందేలును అభినందించాయి.  

కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని