బతుకు బాటకు భజగోవిందం

నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా?మయసభలో దుర్యోధనుడిలా ఉంది నీ పరిస్థితి...లేనిది ఉన్నట్టు భ్రమపడుతున్నావ్‌...శాశ్వతమైన సత్యాన్ని చూడలేకపోతున్నావ్‌...విలువైన వజ్రాలను వదిలేసి,కొరగాని రంగురాళ్ల కోసం పాకులాడుతున్నావ్‌...నీ ఆయుర్దాయాన్ని అగ్నిలో ఆజ్యంలా అర్పించేస్తున్నావ్‌..ఓ విషయం గుర్తుంచుకో...సంప్రాప్తే సన్నిహితే కాలే...కాలం తోసుకొచ్చేస్తుంది.జీవితం సంవత్సరాలుగా, రోజులుగా, ఘడియలు, గంటలుగా మారిపోతోంది...విషయ వాంఛల్లో మునిగితేలుతున్నఓ మూఢమతీ.....

Published : 29 Oct 2020 01:39 IST

నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా?
మయసభలో దుర్యోధనుడిలా ఉంది నీ పరిస్థితి...
లేనిది ఉన్నట్టు భ్రమపడుతున్నావ్‌...
శాశ్వతమైన సత్యాన్ని చూడలేకపోతున్నావ్‌...
విలువైన వజ్రాలను వదిలేసి,
కొరగాని రంగురాళ్ల కోసం పాకులాడుతున్నావ్‌...
నీ ఆయుర్దాయాన్ని అగ్నిలో ఆజ్యంలా అర్పించేస్తున్నావ్‌..

ఓ విషయం గుర్తుంచుకో...
సంప్రాప్తే సన్నిహితే కాలే...
కాలం తోసుకొచ్చేస్తుంది.
జీవితం సంవత్సరాలుగా, రోజులుగా, ఘడియలు, గంటలుగా మారిపోతోంది...
విషయ వాంఛల్లో మునిగితేలుతున్న
ఓ మూఢమతీ...
లే... నిజం తెలుసుకో...
ఇజం మార్చుకో...
భగవంతుడు చూపిన మేలుబాటలో పయనించు...
ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో...

...ఇది ఆది శంకరులు మోగించిన జ్ఞాన శంఖారావం.
పరమ సత్యాల ఝంఝామారుతం...
మనిషి జీవన శైలికి ఓ అష్టాంగమార్గం...

నళినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలమ్‌!
విద్ది వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం
శోకహతం చ సమస్తమ్‌!

‘తామరాకుపై నీటి బిందువులా మనిషి జీవితం అతి చంచలమైంది. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మనుషులు రోగాలబారిన పడి దుఃఖాలు అనుభవిస్తున్నా దేహాభిమానాన్ని విడవడం లేదు..’
భూమిమీదికి, మానవ శరీరంలోకి అద్దె ఇంట్లోకి వచ్చిన జీవివి నువ్వు. సంపూర్ణమైన యజమానివి కావన్న విషయాన్ని గుర్తుంచుకో. తామరాకుమీద నీటి బొట్టులా జీవించు. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కానీ నువ్వు అనుభవించేది శాశ్వతమని భావించి మూర్ఖంగా ఉండకు. విపరీతమైన మమకారాలతో, చేష్టలతో వెర్రితలలు వేయకు.

యావద్విత్తో పార్జనసక్త
స్తావన్నిజ పరివారో రక్తః!
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తం కో పిన పృచ్చతి గేహే!

సంపాదిస్తున్నంత వరకే నీ బంధుమిత్ర పరివారమంతా నీపై అనురాగాన్ని చూపుతారు. వార్దక్యంలో నీ దేహం శిధిలమై శక్తివిహీనమైనప్పుడు నిన్ను పలకరించేవారే ఉండరు..’
మోహం, ఆవేశంతో మనం పెంచుకున్న మమకారాలు మనల్ని మాయలో పడేస్తున్నాయి. ప్రియతములను ప్రేమించవద్దని కాదు, అందరితో శాశ్వతానుబంధం ఉందని భ్రమించవద్దు. నీ పారమార్థిక సాధన కోసం నువ్వు కేటాయించుకునే సమయం నీ స్వస్వరూపాన్ని తెలియజేస్తుంది. అది శాశ్వతానందానికి, దివ్యపథానికి కారణమవుతుంది.

మా కురు ధనజనయౌవన గర్వం
హరతి నిమేషాత్కాల స్సర్వమ్‌!
మాయామయ మిద మఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా!!

‘ధనం, పరివారం, యౌవనం ఉన్నాయని గర్వించకు. క్షణంలో కాలం అన్నిటినీ హరించి వేస్తుంది. అదంతా మిథ్య అని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మాన్ని పొందు..’
డలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. దేనిని చూసుకుని గర్వించడానికి లేదు. క్షణంలో కాలం అన్నిటినీ తారుమారు చేస్తుంది. నడమంత్రపు సిరికి, నిలకడలేని సొగసులకు, మిడిమిడి జ్ఞానానికి మిడిసిపడొద్దు.  అన్నీ ఉన్నప్పుడే అందరికన్నా అణకువగా ఉండాలి. పూలమ్మినా, కట్టెలమ్మినా వ్యక్తిత్వమే మనిషికి ఆభరణమన్న విషయం గుర్తించాలి.

సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్‌!
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః!!

‘సజ్జనుల సాంగత్యం వల్ల సంసార బంధాలన్నీ విడిపోతాయి. బంధాలు విడిపోతే అజ్ఞానమూలమైన మోహం తొలగిపోతుంది. మోహం నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధతత్త్వం గోచరిస్తుంది. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగుతుంది’
న్నిహితులంతా మనకు ప్రియమైందే చెబుతారు తప్ప హితమైంది చెప్పరు. కానీ సజ్జనులు మనల్ని సరైన మార్గంలోకి మళ్లిస్తారు. గంగ పాపాల్ని పోగొడుతుంది. చంద్రుడు తాపాల్ని పోగొడతాడు. కల్పవృక్షం దారిద్య్రాన్ని పోగొడుతుంది. గొప్ప ఆశయాలు కలిగిన పవిత్రుడు జీవితానికి పరమార్థం చూపుతాడు.

గేయం గీతానామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్‌!
నేయం సజ్జనసంగే చిత్తం,
దేయం దీపజనాయ చ విత్తమ్‌!!

‘భగవద్గీత, విష్ణు సహస్రనామం పఠించాలి. లక్ష్మీనారాయణుని రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనస్సును నిలిపి ఉంచాలి. దీనులైన వారికి దానం చేయాలి...’
న కడుపునపుట్టిన వారికి రక్షణనిచ్చేది మన ఆస్తిపాస్తులుకావు. మన అధికారహోదాలూ కాదు. మన పారమార్థిక చింతన, మన పుణ్యకార్యాలు. అవే మనల్ని, మన బిడ్డల్ని వెన్నంటి కాపాడతాయి. దీనులసేవ శ్రీమన్నారాయణుని సేవతో సమానమని గుర్తుంచుకోవాలి. ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో అయినా చేసిన పుణ్యకార్యాలే మానవులను కాపాడతాయని గుర్తించాలి.

కురుతే గంగాసాగర గమనం
వ్రతపరిపాలన మధవా దాసమ్‌!
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మ శతేనః!!

‘గంగానదిలో, సముద్రంలో స్నానం చేసినా... వ్రతాలు ఆచరించినా, జ్ఞానం కొరవడిన వ్యక్తి వంద జన్మలెత్తినా ముక్తి లభించదు’
చేదు కాకరను ఎన్ని తీర్థాల్లో ముంచినా తీపిగా మారనట్లు, మనో నైర్మల్యం కొరవడిన వ్యక్తి ఎన్ని పుణ్యస్నానాలు చేసినా పునీతుడు కాలేడు. భక్తి, జ్ఞానం లేకపోతే పూజాపునస్కారాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు.

త్వయి మయి సర్వత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణుః
సర్వస్మిన్నపి పశ్యాత్మానాం
సర్వత్రోత్సజ భేదజ్ఞానమ్‌!!

నీలో, నాలో, అందరిలో ఉన్నది ఒక్కడైన ఆ విష్ణువే.దైవత్వాన్ని పొందాలంటే అందరి విషయంలో సమత్వాన్ని పాటించు’
నలో సమత్వ భావన లేకపోవడం వల్ల ఒకరంటే విపరీతమైన ద్వేషం, మరొకరంటే వెర్రి ఆపేక్ష కలుగుతాయి. నలువైపులా అద్దాలున్న గదిలోకి మనిషి ప్రవేశించినప్పుడు అన్ని దర్పణాల్లో కనిపిస్తున్న ప్రతిబింబం తనదేనని గుర్తించి నవ్వుతూ బయటకు వస్తాడు. అదే గదిలోకి శునకం ప్రవేశిస్తే తన చుట్టూ చాలా శునకాలున్నాయని, అవి తనతో వైరానికి వచ్చాయని మొరగడం మొదలుపెడుతుంది.

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారం!
జాప్యసమేత సమాధి విధానం
కుర్వపధానం మహదవధానం!

రోగ్యానికే కాదు ఆధ్యాత్మికోన్నతికి కూడా నియమనిష్ఠలు అత్యవసరం. క్రమ పద్ధతిలో ఉచ్ఛ్వాస, నిశ్వాసల సమాహారమే ప్రాణాయామం. మనస్సును విషయవాంఛల నుంచి దూరంగా ఉంచడం ప్రత్యాహారం. వస్తు ప్రపంచం వైపు వెర్రి పరుగులు తీయకుండా వివేకంతో మెలినప్పుడే మహాపథంలో ప్రయణించగలుగుతాం.

- సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని