అహింసే మూలస్తంభం.. త్రిరత్నాలతో జన్మ ధన్యం

ప్రపంచ శాంతికి తొలి సోపానం... మానవ జీవన గమనంలో మహోన్నత మార్గం... అహింస. అందుకే దానికి అంత పెద్దపీట దక్కింది. మహాత్మాగాంధీ లాంటి ఎందరినో ప్రభావితం చేసింది. అహింస విషయంలో జైనం ఓ అడుగు ముందుందనే చెప్పాలి! హింస మూడు రకాలంటారు పెద్దలు. అవి మానసిక హింస (పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం కోల్పోవటం, పాపభీతి లేకుండా ప్రవర్తించటం)....

Published : 22 Apr 2021 00:37 IST

ప్రపంచ శాంతికి తొలి సోపానం... మానవ జీవన గమనంలో మహోన్నత మార్గం... అహింస. అందుకే దానికి అంత పెద్దపీట దక్కింది. మహాత్మాగాంధీ లాంటి ఎందరినో ప్రభావితం చేసింది.  అహింస విషయంలో జైనం ఓ అడుగు ముందుందనే చెప్పాలి!

హింస మూడు రకాలంటారు పెద్దలు. అవి మానసిక హింస (పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం కోల్పోవటం, పాపభీతి లేకుండా ప్రవర్తించటం),  వాచిక హింస (అసత్యం పలకటం, కఠినంగా మాట్లాడటం), కాయక హింస (ఒక జీవిని చంపటం, గాయపరచటం, పీడించటం, చెడుసావాసం, పరుల ధనాన్ని అపహరించటం లాంటివి). అసలు ఏ హింసా ఉండకూడ దంటుంది జైనం.
జైనం ప్రకారం సమ్యక్‌ దర్శనం, సమ్యక్‌ జ్ఞానం, సమ్యక్‌ జీవనం అనేవే త్రిరత్నాలు. వీటి ఆధారంగా సాగే జీవికకు అయిదు ప్రమాణాలున్నాయి. వీటిలో తొలి స్థానం అహింసదే.
అహింస, అబద్ధం చెప్పకుండా ఉండటం, దొంగతనం చేయకుండా ఉండటం (అపరిగ్రహం), బ్రహ్మచర్యం, ఇతరుల ఆస్తిని కబళించాలనే ఆలోచన లేకుండా ఉండటం (అస్తేయం)... ఈ అయిదు ప్రమాణాలతో అందరూ జీవించగలగాలని అంటుంది జైనం. వీటినే అయిదు మహావ్రతాలనీ అంటారు. వీటిని దీక్షతో ఆచరించడమే జైనధర్మం. వీటన్నిటిలోకీ అహింసను తప్పనిసరిగా పాటించాలి.
జైనంలో అహింసే మూలస్తంభంగా కనిపిస్తుంది. భూమిని దున్నితే అందులో ఉండే వానపాములు లాంటివి చనిపోతాయి కనుక భూమినే దున్నకూడదంటుంది జైనం. అన్ని జీవులు, అజీవులకు వివిధ స్థాయిల్లో చైతన్యం ఉందని, గాయాలైతే అవి బాధపడతాయని, అందుకే అహింసను జాగ్రత్తగా ఆచరించాలన్నది జైన సిద్ధాంతం.  
జైన సిద్ధాంతం ప్రకారం హింస చేసే వారికి మోక్షం దక్కదు. అహింస అంటే హింసకు పాల్పడాలనే కోరిక లేకపోవడం కూడా. అయితే, ఆత్మరక్షణ విషయంలో కొన్ని మినహాయింపుల్ని జైనులు అంగీకరిస్తున్నారు.

సర్వకాల సర్వావస్థల్లో ఇతర ప్రాణులకు ఏ విధమైన కష్టాన్నీ కలిగించకుండా ఉండటమే అహింస. హింస అనేది మనిషి జీవితం నుంచి పూర్తిగా కనుమరుగవ్వాలన్నది జైనంలోని ప్రధానాంశం.

సంస్కృతంలో స్వస్తి అంటే శుభం. స్వస్తికమంటే శుభప్రదం. జైన సంప్రదాయంలో కనిపించే స్వస్తిక్‌ చిహ్నం జీవన చక్రాన్ని సూచిస్తుంది. ఇందులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయి. స్వస్తిక్‌ పైన ఉండే మూడు చుక్కలు త్రిరత్నాలకి, ఆ పైన ఉండే చిహ్నాన్ని సిద్ధ లోకానికి ప్రతీకగా భావిస్తారు. అలాగే జైన సంప్రదాయంలో కనిపించే హస్తం గుర్తు పంచ మహా వ్రతాలకు చిహ్నం.

పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయాలకి బ్రహ్మచర్యాన్ని వర్ధమానుడు జతచేశాడు. ఈ పంచవ్రతాల్ని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం చెబుతుంది. అహింసాయుత పద్ధతిలో దేశ స్వాతంత్య్రోద్యమాన్ని నడిపించిన గాంధీ మహాత్ముడికి జైన సిద్ధాంతాలు కూడా స్ఫూర్తి అని పరిశోధకులు పేర్కొంటారు.

అయిదు రకాలు

జైనం జీవులని స్థూలంగా అయిదు రకాలుగా విభజించింది.  
ఏకేంద్రియ జీవులు. ఇవి స్పర్శ జ్ఞానం మాత్రమే కలిగి ఉంటాయి.
ద్వేంద్రియ జీవులు. స్పర్శతో పాటు జిహ్వ జ్ఞానం కూడా కలిగి ఉంటాయి.
త్రీంద్రియ జీవులు. స్పర్శ, జిహ్వ, ఘ్రాణ జ్ఞానం కలిగి ఉంటాయి.
చతురింద్రియాలు. స్పర్శ, జిహ్వ, ఘ్రాణ, దృశ్య జ్ఞానాలు కలిగుంటాయి.
పంచేంద్రియ జీవులు. అదనంగా శ్రవణ జ్ఞానం కలిగి ఉంటాయి.
ఈ అయిదింటిలో తిరిగి సంజ్ఞ, అసంజ్ఞ అనే ఉప తరగతులుంటాయి.
మనసు ఉండటం, లేకపోవటం ఆ రెండింటి మధ్య ప్రధాన వ్యత్యాసం.

జైనం ప్రకారం మొక్కలు, తృణధాన్యాలు, దుంపలు లాంటివన్నీ ఏకేంద్రియ జీవులు. పంచేంద్రియ జీవుల్లాగే, రెండు, మూడు, నాలుగు ఇంద్రియాలున్న జీవులు కూడా దెబ్బ తగిలితే ఏదో విధంగా బాధకు గురవుతాయి. కానీ ఏకేంద్రియాలలో అలాంటి బాధ కనిపించదు కనుక వాటిని ఆహారంగా వినియోగించటంలో తప్పు లేదన్నది జైనం భావన. అయితే ఇది గృహస్థులకు మాత్రమే. సన్యాసులకు ఇవి కూడా వద్దన్నది జైన సిద్ధాంతం.  
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించిన వారిని ‘జినుడు’ అంటారు. దీన్నుంచి వచ్చిన పదమే జైనం. ఈ సంప్రదాయంలో 24 మంది తీర్థంకరులున్నారు. తీర్థంకరులంటే సంసార సాగరాన్ని దాటడానికి వారధిని నిర్మించిన వారని అర్థం. తీర్థంకరుల్లో మొదటివాడు రుషభనాథుడు. వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగో తీర్థంకరుడు. మహావీరుడు తన 30వ ఏట సర్వసంగ పరిత్యాగం చేశాడు. ఆరేళ్లు మక్కలి గోశాలుడి దగ్గర శిష్యరికం ఉన్నాడు. జృంభిక గ్రామం దగ్గర పన్నెండేళ్ల ధ్యానం, తపస్సు తర్వాత జ్ఞానోదయమైంది. మహావీరుడి చిహ్నం సింహం.'

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని