ఇగరని గంధం చెదరని బంధం

ప్రకృతిలో కలువకూ చంద్రుడికీ స్నేహం. తొలకరికీ తొలిమొలకకూ నేస్తం. ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారమూ అదే. అందుకే దానికంత విలువ. అదే స్నేహ బంధం. ఆ గంధం ఎన్నటికీ ఇగరదు. ఆ బంధం ఎప్పటికీ చెదరదు. జీవితాంతం నీడై నిలిచేది అదే. అక్షరాలా దేవుడిచ్చిన వరం అది. తరాల అంతరాలూ ఆస్తులూ అంతస్తులూ నేస్తానికి అడ్డు కావు. మైత్రిని మరుగుపరచలేవు. ఇది ఇప్పటిది కాదు. యుగయుగాలుగా అక్షరసత్యంగా ఉన్నదే. అంటే స్నేహం అంత పాతదన్నమాట.

Updated : 29 Jul 2021 01:22 IST

ప్రకృతిలో కలువకూ చంద్రుడికీ స్నేహం. తొలకరికీ తొలిమొలకకూ నేస్తం. ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారమూ అదే. అందుకే దానికంత విలువ. అదే స్నేహ బంధం. ఆ గంధం ఎన్నటికీ ఇగరదు. ఆ బంధం ఎప్పటికీ చెదరదు. జీవితాంతం నీడై నిలిచేది అదే. అక్షరాలా దేవుడిచ్చిన వరం అది. తరాల అంతరాలూ ఆస్తులూ అంతస్తులూ నేస్తానికి అడ్డు కావు. మైత్రిని మరుగుపరచలేవు. ఇది ఇప్పటిది కాదు. యుగయుగాలుగా అక్షరసత్యంగా ఉన్నదే. అంటే స్నేహం అంత పాతదన్నమాట.

చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. భర్తృహరి సుభాషితాల్లోనూ స్నేహపరిమళాలు గుబాళించడం తెలిసిందే. ఇంతకీ ఉత్తమ మైత్రికి కొలమానం ఏమిటో, మంచి స్నేహితులు ఎలా ఉండాలో తెలుసుకుంటే పలకరించే ప్రతివారూ స్నేహితులని భ్రమించే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

అసలైన స్నేహం

స్నేహం ఎక్కడుంటుంది? ఎవరి మధ్యనుంటుంది? దానికెందుకంత విలువ, పవిత్రత? అనే ప్రశ్నలకు మన సంస్కృతీ సంప్రదాయాలు తొలినాళ్ల నుంచీ సమాధానాలు ఇస్తూనే వున్నాయి. ఎవరో బయట వ్యక్తులతోనే కాదు, తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు, బంధువులు, గురువు, శిష్యుడు- ఇలా ఒకరేమిటి ఒకచోటేమిటి అణువణువునా, సకల చరాచరాలతో మైత్రి కలుగుతూ ఉంటుంది. స్నేహం నవవిధ భక్తి మార్గాల్లో సఖ్య భక్తిగా దర్శనం ఇస్తుంది. ఈ మార్గంలో ఎంతోమంది భగవంతుడిని తమ చెంగున ముడి వేసుకుని తిప్పుకున్నారు. మరెందరో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆటపాటలలో మునిగి తేలుతూ సులువుగా మోక్షాన్ని పొందారు. ఇందులో ప్రేమ, విశ్వాసం చివరకు స్వార్థం కూడా వుండటంవల్లే ఇంత గొప్పదయ్యింది. ఈ స్వార్థం ఎలాంటిదంటే తనకు కాక తన మిత్రుడికి మేలు జరగాలనుకోవడం.

స్థాయీభేదాల్లేవు

నిఘంటువులో స్నేహానికి మైత్రి, సఖ్య మొదలైన సమానార్థకాలున్నాయి. అయితే స్నేహానికి నూనె, జిడ్డు అని, మిత్రుడు అంటే కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అని కూడా అర్థాలున్నాయి. సూర్యుడు సర్వజగత్తుకూ నిస్వార్థంగా వెలుగులు పంచుతూ చైతన్యపరుస్తాడు. స్నేహితులూ అంతే. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. మంచితనాన్ని వారు పాటించే మిత్రధర్మాన్ని బట్టి అంచనా వేయొచ్చంటారు. అలాంటి సౌశీల్యరూపుడు శ్రీరామచంద్రుడు. రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి చాటాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా దర్శనమిస్తారు. శ్రీరాముడు చక్రవర్తి అయినా.. గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని మార్గదర్శనం చేశాడు.

అన్నదమ్ముల మైత్రి

బృహన్నారదీయ పురాణం 36వ అధ్యాయంలో అన్నదమ్ముల స్నేహబంధాన్ని చెప్పే కథ వుంది. యఙ్ఞమాలి, సుమాలి అన్నదమ్ములు. అన్న ఉత్తముడు. పిత్రార్జితాన్ని సమానంగా పంచి ఇచ్చాడు. తమ్ముడు తన ధనాన్ని హరించేశాడు. అన్న తన వాటాలో మరో సగాన్నిచ్చినా అదే జరిగింది. చివరికి అన్నదమ్ములిద్దరూ ఒకేసారి మరణించారు. తన కోసం విష్ణుదూతలు, తమ్ముడి కోసం యమభటులు రాగా, తన సోదరునిపట్ల మైత్రిని వివరించి అతనికీ ముక్తి ప్రసాదించమన్నాడు. తన పుణ్యం నుంచి కొంత ధారపోసి, తమ్ముడికి ముక్తి వచ్చేలా చేశాడు.

ఆదర్శ స్నేహితులు

పురాణాల్లో కృష్ణుడు-కుచేలుడు, కర్ణుడు-దుర్యోధనుడు, రాముడు-సుగ్రీవుడు- ఇలా ఆదర్శ స్నేహితుల కథలెన్నో వున్నాయి. శ్రీకృష్ణ కుచేలుల మైత్రి తలమానికం. అశోకవనంలో వున్న సీతకు కాపలాగా వున్న త్రిజట ఎన్నోవిధాల ధైర్యంచెప్పి, ఎంతో ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలిచింది. అలాగే దశరథునితో మైత్రి వల్లనే జటాయువు సీతామాత రక్షణకోసం రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణ దుర్యోధనుల మైత్రి కొంతవరకే ఆదర్శం. స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుడిని ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది.

‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’.. మిత్రభావంతో వచ్చినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు శ్రీరాముడు. ‘ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః’ అన్నాడు వాల్మీకిమహర్షి. నిజమైన స్నేహం కోసం ధనము, శరీర సుఖాలు, చివరకు దేహాన్నైనా త్యాగం చెయ్యాలే కానీ స్నేహాన్ని మాత్రం విడవకూడదని దీని భావం. ‘సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః, సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్యే మయోష్టాః’ అనేది పెళ్లి మంత్రం. భార్యాభర్తలమైన మనం ఇకపై స్నేహ భావాన్ని విడవకుండా జీవిద్దామని భావం. ఇది తెలుసుకుంటే కాపురాలు స్నేహ గోపురాలు అవుతాయి. పురాణాలూ ఇతిహాసాలూ ఉపనిషత్తులూ అన్నీ స్నేహం విలువను చాటుతూ స్నేహబంధాన్ని పటిష్టం చేసుకోమని హితవు పలుకుతున్నాయి.


గురుశిష్య మైత్రి

ఓం సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై

తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః

పాఠానికి ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది. భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించుగాక. మన మధ్యలో విభేదాలు తలెత్తకుండుగాక- అనేది భావం.


మిత్రలక్షణం!

అఘము వలన మరల్చు, హితార్థ కలితు జేయుగోప్యంబు దాచు, బోషించు గుణము

విడువడాపన్ను, లేవడి వేళ నిచ్చు మిత్రుడీ లక్షణంబుల వెలుగుచుండు

మిత్రుడు చెడు పనులు చేయకుండా నివారిస్తాడు, మంచి పనులకు ప్రోత్సాహమిస్తాడు. రహస్యాలను దాచిపెడతాడు, సద్గుణాలను పెంపొందిస్తాడు. ఆపదలో ఆదుకుంటాడు, సంపదలు పోగానే విడిచి వెళ్లడు. పేదరికంలో సాయం చేస్తాడు. ఇవే అసలైన స్నేహితుల లక్షణాలంటూ నిర్వచించాడు ఏనుగు లక్ష్మణ కవి.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని