ఉగాది రోజు...

నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికీ ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే వసంతం ఉగాది. తెలుగువారి తొలి

Updated : 19 Mar 2020 00:37 IST

నవ చైతన్యానికీ విశ్వ సౌందర్యానికీ ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకులను నిర్మూలించి, కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే వసంతం ఉగాది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాదిపండుగనాడు మనం ఆచరించవలసిన విధివిధానాలను పెద్దలు నిర్దేశించారు.●

ఒళ్లంతా నువ్వులనూనె రాసుకుని, కుంకుడురసంతో అభ్యంగన స్నానం చేయాలి.

ఎందుకు? సంవత్సరారంభంలో చేసే ఈ మంగళ స్నానం శరీరాన్నీ మనస్సునూ చైతన్యవంతం చేస్తుంది.●

ప్రతి ఇంటిలో తమ ఇష్టదైవానికి ప్రతీకగా ఒక ధ్వజాన్ని పూజించి, ఇంటి ముంగిట ఎగరవేయాలి.

ఎందుకు? శుభారంభానికి ఇది సంకేతం. విజయశిఖరాలను అధిరోహించవలసిన లక్ష్యాన్ని ఈ ధ్వజం స్ఫురింపచేస్తుంది. ●

ఉగాదినాడు కాలస్వరూపుడైన పరమాత్మను తమ ఇష్టదైవం రూపంలో ఆరాధించటం ఒక సంప్రదాయం.

ఎందుకు? దైవారాధన ధర్మాచరణకు స్ఫూర్తిని కలిగించి, సంవత్సరం పొడవునా మనం ధార్మిక జీవనం సాగించటానికి దోహదం చేస్తుంది. ●

వసంత నవరాత్రులు ఉగాదినాడే ప్రారంభమవుతాయి.ఈ ఉత్సవాలను నిర్వహించటం, కనీసం పాల్గొనటం ఓ ముఖ్యవిధి.

ఎందుకు? ఈ ఉత్సవాలు మనలో ధార్మిక చింతనను, పదిమందితో కలసి పనిచేసే ఒక మంచి అలవాటును మనకు ప్రబోధిస్తాయి. ●

ఆ రోజు చలివేంద్రాలను ప్రారంభించాలి. రాబోయే వేసవి తీవ్రతను తట్టుకోవడానికి అనువుగా పరిసరాల ప్రజలకు చేసే సేవాకేంద్రం చలివేంద్రం.

ఎందుకు? బాటసారులకు దప్పిక తీర్చటానికి ఉద్దేశించిన ఈ చలివేంద్రాలు మనలోని మానవత్వానికి, సామాజిక బాధ్యతకూ ప్రతీకలు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని