చల్లగుండు చిట్టితల్లీ!

కోల్‌కతా సమీపంలోని జయరాంబాటి... అదో కుగ్రామం. ఆ ప్రాంతమంతా వానల్లేవు. కరవు విలయతాండవం చేస్తోంది. మరోవైపు మలేరియా విజృంభించింది. గ్రామస్థులంతా ఆకలితో అలమటిస్తున్నారు.

Published : 09 Apr 2020 01:05 IST

ఆమె ఎవరో తెలుసా?

కోల్‌కతా సమీపంలోని జయరాంబాటి... అదో కుగ్రామం. ఆ ప్రాంతమంతా వానల్లేవు. కరవు విలయతాండవం చేస్తోంది. మరోవైపు మలేరియా విజృంభించింది. గ్రామస్థులంతా ఆకలితో అలమటిస్తున్నారు.

ఎవరు ఇంత అన్నం పెడతారా! అని దీనంగా ఎదురుచూస్తున్నారు.

ఇంతలో దయామయుడైన రామచంద్రముఖర్జీ ముందుకు వచ్చారు.

నిజానికి ఆయనేమీ ధనవంతుడు కాదు. వ్యవసాయం, పౌరోహిత్యంతో పాటు జంధ్యాలు వడికి అమ్మడం ద్వారా వచ్చే రాబడితో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అందులోంచే పిల్లల కోసం కొంత పొదుపు చేసేవాడు. అయినా సాటి ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అతని హృదయం ద్రవించిపోయింది.

దాచుకున్న ధాన్యమంతా వారికి పంచిపెట్టాడు. ఆయన భార్య శ్యామసుందరీ దేవి కూడా ధర్మపరాయణురాలు.

వండుకోవడానికి సరైన చోటు లేని వారికి ఇంటి ముందే వండి వడ్డించేవారామె.

ఓ రోజు బియ్యం, పప్పు కలిపి పులగం తయారు చేశారు. దాన్ని పెద్ద పెద్ద కుండల్లో నింపి, విస్తరాకుల్లో పెట్టి అన్నార్తులకు అందించారు. వారు ఆకలి కారణంగా దాన్ని అందుకుని గబగబా తినడం ప్రారంభించారు. కానీ పులగం వేడిగా ఉండడంతో తినడానికి ఇబ్బంది పడుతున్నారు.

వాళ్ల పరిస్థితి గమనించి కదిలిపోయింది రామచంద్ర ముఖర్జీ పెద్ద కూతురు. ఆ అమ్మాయికి అప్పుడు పదకొండేళ్లు. ఆ పసిహృదయానికి ఏదో తోచింది.

వెంటనే ఇంట్లోకి పరుగెత్తుకెళ్లింది. విసనకర్ర పట్టుకొచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గరకూ వెళ్లి ఆ పులగం చల్లారేవరకు విసరసాగింది. ఆమె స్పందనకు అక్కడి వారందరి హృదయం కరిగిపోయింది. ఆ చిట్టితల్లి ప్రేమపూర్వక ఆతిథ్యానికి వారు మనసారా ఆశీర్వదించారు.

ఆ చిన్నారి మరెవరో కాదు... భారత ఆధ్యాత్మిక చింతనకు దిక్సూచి అయిన రామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదామాత. తల్లిదండ్రుల దయాగుణాన్ని పుణికిపుచ్చుకుని కాలక్రమంలో అపర అన్నపూర్ణాదేవిగా ప్రణతులందుకున్నారామె.

- సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని