ఉపవాసం...ఓ అవకాశం!

ఓ శుభాల వసంత మేఘమా కాస్తంత నిదానంగా కదులు!అల్లాహ్‌ను ప్రసన్నం చేసుకోవాలి!....

Published : 30 Apr 2020 00:12 IST

ఇస్లాం సందేశం

ఓ శుభాల వసంత మేఘమా కాస్తంత నిదానంగా కదులు!

అల్లాహ్‌ను ప్రసన్నం చేసుకోవాలి!

చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపం చెందాలి!

నరక జ్వాలలనుంచి కాపాడుకోవాలి!

స్వర్గానికి అర్హత సాధించాలి!

ఉపవాసాలు పాటించే ముస్లిం భావాలివి.

రంజాన్‌ శుభ ఘడియల్లో శుభాలను చేజారనీయరాదన్న ప్రవక్త (స) మహనీయుల వారి సూచనను తప్పకుండా పాటిస్తారు కాబట్టే ఈ నెలలో ఉపవాసాలను ఎంతో నిష్ఠగా పాటిస్తారు. అరబ్బీ భాషలో ఉపవాసాలను సౌమ్‌ అంటారు. ఆ నిఘంటువు ప్రకారం సౌమ్‌ అంటే ‘ఆగిపోవడం’ అని అర్థం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తినడాన్ని, తాగడాన్ని త్యజించడమే సౌమ్‌. అలాగని రోజంతా ఆకలిదప్పులతో ఉండటం మాత్రమే ఉపవాసం కాదు. అందులో దైవంపై చిత్తశుద్ధి ఉండాలి. అల్లాహ్‌పై విధేయత ఉండాలి. ఇలా చేయకుండా రోజంతా పస్తులుండటం వల్ల ఆకలిదప్పులు తప్ప మరేమీ దక్కవు అని హజ్రత్‌ అలీ అన్నారు. ఆరాధనల్లో అత్యుత్తమ ఆరాధనగా భావించే ఈ ఉపవాసం అత్యుత్తమంగా నిర్వర్తించాలని ప్రవక్త మహనీయులు బోధించారు. ప్రతి ఒక్కరూ తమ దుస్తులు, తిండి, వ్యాపారం ఇలా అన్నీ ఉత్తమ శ్రేణికి చెందినవి కావాలని ఎలా కోరుకుంటారో ఉపవాసం కూడా అత్యుత్తమంగా పాటించాలని ఇమామ్‌ గజాలీ అన్నారు. నియమనిబంధనల్ని, మర్యాదలను తూచా తప్పకుండా పాటించిన ఉపవాసం మాత్రమే అల్లాహ్‌ ఆదరణకు నోచుకుంటుంది. త్రికరణ శుధ్దితో బుద్ధీ వివేకాలతో తమ ఇంద్రియాలను కాపాడుకున్నప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది.

మీలో ఎవరయినా ఉపవాసం పాటిస్తే, ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడవద్ధు గలాటా చేయవద్ధు ఒకవేళ ఎవరయినా దూషిస్తే లేక కయ్యానికి కాలుదువ్వితే వారితో ‘నేను ఉపవాసమున్నానండీ’ అని చెప్పాలి.’’


‘‘ఏ వ్యక్తి అయితే సంపూర్ణ విశ్వాసంతో, ఆత్మ విమర్శతో రంజాన్‌ ఉపవాసం పాటిస్తాడో పూర్వం అతను చేసిన పాపాలను దేవుడు మన్నిస్తాడు’’


‘‘ఉపవాసానికి ఏ మహత్తర పుణ్యఫలం ఉందో దాన్ని మనసారా కోరుకోండి’’ ఇప్తార్‌ సమయంలో దేవుణ్ని ఇలా వేడుకోవాలి. ‘‘దేవా నా ఉపవాసాన్ని స్వీకరించు. నీవు ఏ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తావని సెలవిచ్చావో దాన్ని నాకు ప్రసాదించు.’’

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని