దానమేధర్మం!

అది పండగ రోజు..ముహమ్మద్‌ ప్రవక్త నమాజ్‌ కోసం ఈద్గాకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక వీధిలో..

Published : 21 May 2020 00:18 IST

ఈ నెల 24 లేదా 25 ఈదుల్‌ ఫిత్ర్‌

అది పండగ రోజు..

ముహమ్మద్‌ ప్రవక్త నమాజ్‌ కోసం ఈద్గాకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక వీధిలో ఒక బాలుడు రెండు చేతులతో కళ్లునులుముకుంటూ రోదిస్తూ నిల్చున్నాడు. ప్రవక్త ఆ బాలుడిదగ్గరకెళ్లి ‘‘పండగపూట ఎందుకిలా ఏడుస్తున్నావు నాయనా’’ అని అడిగారు. దానికా బాలుడు ఏడుస్తూనే ‘‘మా అమ్మానాన్న ఇద్దరూ లేరు. పండగ రోజు తొడుక్కోవడానికి కొత్త బట్టలు లేవు.’’ అని చెప్పాడు. దానికి ప్రవక్త ‘‘ఏడవకు నాయనా. అమ్మానాన్న లేరని బాధపడకు... నీకు నేనున్నాను‘‘ అని అనడంతోనే పిల్లాడు ఏడుపు ఆపి చిరునవ్వు చిందించాడు.

ప్రవక్త ఆ బాలుడిని వెంటపెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లారు.‘‘ఇక నుంచి ఆయెషా మీ అమ్మ, నన్ను మీ నాన్నగా భావించు’’అని ఓదార్చారు.

ఆ పిల్లాడిని స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపచేసి ఈద్‌ నమాజ్‌కు తీసుకెళ్లారు.

ఆ పిల్లాడిలో దుఃఖాన్ని దూరం చేసి నవ్వులు పూయించారు. అమ్మానాన్నలు లేని లోటు తీర్చారు.

రంజాన్‌ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న దైవదాసుల హృదయాలు అల్లాహ్‌పై కృతజ్ఞతతో ఉప్పొంగుతాయి. ఆ కృతజ్ఞత వెలిబుచ్చుకోవడానికి ఈద్‌ నమాజు చేస్తారు. నమాజు కంటే ముందు మరో పని కూడా చేయాల్సి ఉంటుంది. పండగ సంతోషాలను సమాజంలోని బీదబిక్కి వారికి పంచేందుకు దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. పేదలను ఆదుకోవడమే పండగ పరమార్థం అని ప్రవక్త తేల్చిచెప్పారు. ఈదుల్‌ ఫిత్ర్‌నాడు ఏ ఒక్క నిరుపేద, మరే అనాథా చేయిచాచి అడగకూడదని, ఎవరూ కన్నీరు పెట్టుకోరాదని ప్రవక్త (స) ముస్లింలకు పిలుపునిచ్చారు. పండగ నమాజుకంటే ముందే చేసే దానాన్ని ఇస్లామీ పరిభాషలో ఫిత్రా అంటారు. అందుకే రంజాన్‌ పండగను ఈదుల్‌ ఫిత్ర్‌ అంటారు. ఈ దానం పొందడం పేదల హక్కుగా ప్రవక్త నిర్ణయించారు. ఉపవాస ప్రతంలో దాసుల నోటి వెంట వెలువడిన చెడు మాటలు, అనాలోచితంగా మనసులో కలిగిన తలంపులకు పరిహారమే ఈ ఫిత్రా దానం. దీని వల్ల ఉపవాసవ్రతంలో జరిగిన తప్పిదాలన్నీ పోయి మనిషి పరిశుద్ధుడవుతాడు. నిరుపేదలకు ఆహారమూ సమకూరుతుంది. ఫిత్రాల వల్ల పేదసాదల పండగ అవసరాలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండగ సామగ్రి కొనుక్కోలేని వారికి ఇది కాస్తంత ఆసరా అవుతుంది.

ఎవరు చెల్లించాలి..?

తమ అవసరాలకు పోను ఎవరి దగ్గరైతే డబ్బుంటుందో వారంతా సదఖే ఫిత్ర్‌ చెల్లించాలని ఉలమాలు చెబుతున్నారు. ఉపవాసాలు ఉన్నవాళ్లయినా, లేకపోయినా అందరి తరపునా ఈ దానం ఇవ్వాలి. ఇంట్లో అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముదుసలి వరకూ అందరి పేరునా లెక్కగట్టి ఈ ఫిత్రా దానాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల తరపున వారి సంరక్షకులు చెల్లించాలి.

పరిమాణం ఎంత..?

కిలోన్నర గోధుమలు లేదా బియ్యం, ఖర్జూరాలు లేదా దాని విలువకు సరిపడా డబ్బును అందించాలని ప్రవక్త (స) చెప్పారు. దాని విలువ ఈ ఏడాది రూ.50 నుండి రూ.60లుగా లెక్కగట్టారు. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత డబ్బు లెక్కగట్టి దానం చేయాల్సి ఉంటుంది. ఇంట్లో అందరి తరపున ఫిత్రా దానాన్ని ఒకే ఇంటివారికైనా ఇవ్వవచ్చు లేదా ఎంతమందికైనా దానం చేయవచ్చు.

ఎప్పటిలోగా..?

ఈద్‌ నమాజుకు ముందే ఫిత్రా దానాన్ని పంపిణీ చేయాలి. పండగకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇవ్వడం ఎంతో అభిలషణీయం. నమాజుకు వెళ్లేముందు కాకుండా ఒకరోజు ముందుగానే అందిస్తే నిరుపేదలూ పండగ సామగ్రిని కొనుగోలు చేసుకుంటారు. అలాగని మరీ ముందు ఇచ్చినా ఆ డబ్బు ఇతర అవసరాలకు ఖర్చయ్యే అవకాశం ఉంది.

అర్హులెవరు?

పండగ రోజు నిరుపేదలు చేయి చాచే పరిస్థితి రాకుండా చేయండి అని ఉల్లేఖనంలో ఉంది. వితంతువులు, అభాగ్యులు, నిరుపేదలు ఈ దానం పొందడానికి అర్హులు. దానమిచ్చేవారు తమ సమీప బంధువులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటుంది ఖురాన్‌ గ్రంథం.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని