జ్ఞాన కిరణాలు

ఒకసారి ఓ ఖలీఫాకు ఓ సందేహమొచ్చింది. దాన్ని నివృత్తి చేసుకునేందుకు పండితుడిని రావాల్సిందిగా...

Published : 10 Dec 2020 01:42 IST

ఇస్లాం సందేశం

కసారి ఓ ఖలీఫాకు ఓ సందేహమొచ్చింది. దాన్ని నివృత్తి చేసుకునేందుకు పండితుడిని రావాల్సిందిగా సేవకుడితో కబురు పంపారు.
సేవకుడు వెళ్లిచూడగా ఆ పండితుడు పుస్తక పఠనంలో లీనమై ఉన్నారు. ఆయన చుట్టూ పెద్ద పెద్ద గ్రంథాలు గుట్టలుగా ఉన్నాయి.
‘తమరిని ఖలీఫా రమ్మన్నారు’ అని చెప్పాడు సేవకుడు.
‘నేను గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులతో మాట్లాడుతున్నా. వీలు చిక్కగానే హాజరవుతాను’ అని చెప్పి సేవకుడిని పంపించేశారాయన.
సేవకుడు తిరిగి వచ్చి అదే విషయాన్ని చెప్పాడు. పండితుడు చెప్పి పంపిన సమాధానానికి ఖలీఫా ఆశ్చర్యపోయారు.
‘ఇంతకీ ఆ పండితుడి దగ్గర ఎవరున్నారు?’ అని ఆరా తీసారు ఖలీఫా.
‘నేనైతే ఎవరినీ చూడలేదు’ అన్నాడు సేవకుడు. పండితుడు అబద్దం చెబుతున్నాడని ఖలీఫా అనుకున్నాడు.
మరోసారి సేవకుడిని తిప్పిపంపారు.
ఈసారి పండితుడు ఖలీఫా ముందు హాజరయ్యాడు. ‘మీతో మాట్లాడటానికి వచ్చిన ఆ మహా విద్వాంసులు, తత్వవేత్తలు ఎవరో చెప్పండి’ అని అడిగాడు ఖలీఫా. అప్పుడా పండితుడు ఇలా సమాధానమిచ్చాడు.
‘ఆ మహానుభావులు భౌతికంగా నా పక్కన లేకపోయినా వారు రాసిన పుస్తకాల రూపంలో మంచి మిత్రులు. తమ విజ్ఞానం ద్వారా నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తారు.  సభ్యత, సంస్కారం నేర్పుతారు.’’
ఈ మాటలతో.. పండితుడు గ్రంథపఠనం చేస్తున్నారని ఖలీఫా అర్థం చేసుకున్నారు.
‘విద్యాజ్ఞానాలు అర్జించడం ప్రతీ ముస్లిం ధార్మిక విధి’ అన్న ప్రవక్త సూక్తిని ఆరాధనాభావంతో ఆచరించాలి.  

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని