చెడుపై విజయానికి ఉపవాసం

రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ కోసం పాటించే మహోన్నత ఉపవాస ఆరాధన... రోజా. ‘మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు....

Published : 22 Apr 2021 00:32 IST

రంజాన్‌ సందేశం

రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ కోసం పాటించే మహోన్నత ఉపవాస ఆరాధన... రోజా. ‘మనిషి సత్కార్యాలన్నీ తన కోసమే చేసుకుంటాడు. కాని ఉపవాసం ప్రత్యేకంగా నా కోసం పాటిస్తాడు. కాబట్టి దానికి ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తాను’ అని అల్లాహ్‌ అంటున్నారు. ఉపవాస ప్రభావం శరీరంలోని ఇంద్రియాలన్నింటిపై ప్రస్ఫుటమవ్వాలి. ఉపవాసి అన్ని రకాల చెడులను త్యజించాలి. ఆంతర్యంలోనూ, బాహ్యంలోనూ చిన్న పాపాన్ని కూడా దరిచేరనివ్వకూడదు. ఉపవాసాల విషయంలో ఉలమాలు పంచశీల సూత్రాలు నిర్దేశించారు.

ఉపవాసి తన దృష్టి చెడు కార్యాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
అబద్ధాలు, చాడీలు చెప్పటం, పరోక్ష నింద, అనవసర కబుర్లతో కాలయాపన, నోటిదురుసు లాంటివన్నీ ఉపవాస స్ఫూర్తికి విరుద్ధం. ముఖ్యంగా పరోక్ష నింద వల్ల ఉపవాసం భంగమవుతుంది. సాధారణ రోజుల్లోనూ ఇవన్నీ నిషేధితాలు. రంజాన్‌ మాసంలో వీటి విషయంలో మరింత జాగరూకత వహించాలి.  
ఉపవాస సమయంలో చెడు మాటలు పలక్కపోవటంతో పాటు, వాటిని వినటం కూడా నిషేధమే.  
ఉపవాసి తన శరీర భాగాలన్నిటినీ చెడు పనుల నుంచి కాపాడుకోవాలి. అనైతిక, నిషిద్ధ కార్యాల నుంచి చేతల్ని, చేతుల్ని కట్టిపెట్టుకోవాలి. అక్రమ సంపాదనతో ఇఫ్తార్‌ చేయకూడదు.
‘అల్లాహ్‌ దర్బారులో నా రోజా స్వీకృతమవుతుందో లేదో, అల్లాహ్‌ అభీష్టం మేరకు నా ఉపవాసాన్ని చేస్తున్నానో లేదో’ అనే భయం ఉపవాసికి ఉండాలి. నా ఉపవాసం ఫలవంతం అవుతుందో లేదో అనే ఆందోళనే రోజాను చక్కగా నిర్వర్తించేలా చేస్తుంది.
బ్బుగా ఉన్నవారు లేదా ప్రయాణం చేస్తున్న వారు ఇతర దినాల్లో ఉపవాసాలు పూర్తి చేయాలని దివ్య ఖురాన్‌ చెబుతుంది. రోజా ఉపవాసానికి సహెరీ, ఇఫ్తార్లు ప్రాణం లాంటివి. తెల్లవారు జామున ఫజర్‌ నమాజుకు గంట ముందు నిద్రలేచి ఆహారం భుజించడాన్ని సహెరీ అంటారు. రోజా పాటించాలంటే సహెరీ తప్పనిసరి. ‘సహెరీ భుజించండి. సహెరీలో శుభముంది. సహెరీ భుజించే వారిని దైవదూతలు దీవిస్తారు’ అని ముహమ్మద్‌ ప్రవక్త (స) చెప్పారు. సహెరీ భుజించడం వల్ల శరీరంతో పాటు ఆత్మకూ శక్తి లభిస్తుంది అని చెబుతారు ఉలమాలు.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని