ఆ ఒక్క రోజే దర్శనం

శిప్రా నదీ తీరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం ఉజ్జయిని. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారు హరసిద్ధిగా, మహాకాళిగా భక్తులను అనుగ్రహిస్తుంది. పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి కాలభైరవస్వరూపం అద్వితీయమైనది.

Updated : 12 Aug 2021 03:35 IST

శిప్రా నదీ తీరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం ఉజ్జయిని. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారు హరసిద్ధిగా, మహాకాళిగా భక్తులను అనుగ్రహిస్తుంది. పరమేశ్వరుడు మహాకాళేశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇక్కడి కాలభైరవస్వరూపం అద్వితీయమైనది. ఇన్ని విశిష్టతలున్న ఈ అవంతికా నగరంలో నాగపంచమినాడు నాగచంద్రేశ్వరుని దర్శించుకోవచ్చు. స్వామి నాగదోషాల్ని, కాలసర్పదోషాల్ని హరిస్తాడని ఆరోజు భక్తులు ఉజ్జయినికి తరలివస్తారు. కాళము అంటే సర్పం. సాధారణంగా సర్పాన్ని కాలానికి ప్రతీకగానూ చెబుతారు. కాలాన్ని, కాళుడిని(యముడు) ఆధీనంలో ఉంచుకున్న మహాకాళేశ్వరుని సేవించినవారికి అపమృత్యు భయం (అకాల మరణం) ఉండదంటారు. రుద్రసాగర సరస్సు సమీపాన మహాకాళుని ఆలయం ఉంది. మొదటి అంతస్థులో మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా దక్షిణాభిముఖంగానూ, రెండో అంతస్థులో ఓంకారేశ్వరునిగా తూర్పుముఖంగానూ, మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరునిగా పశ్చిమాభిముఖంగా ఉన్న క్షేత్రం ఉజ్జయిని.

అరుదైన స్వామి రూపం.. విశిష్టతల సమాహారం

నవనాగుల్లో ఒకటైన తక్షకుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి అమరత్వాన్ని పొందాడు. ఏడాదికి ఒకసారైనా ఈశ్వరుడు తనను శయ్యగా చేసుకుని శయనించాలని తక్షకుడు వేడుకున్నందున, నాగపంచమినాడు ఈ క్షేత్రంలో ఆ కోరిక నెరవేరుస్తాడనేది పురాణకథనం. నాగపంచమినాడు నాగరాజు తక్షకుడు ఈ ఆలయంలో సంచరిస్తాడట. 11వ శతాబ్దంలో పరమారరాజు నేపాల్‌ నుంచి ఈ మూర్తిని తెచ్చి ప్రతిష్టించారని చారిత్రక ఆధారాలున్నాయి. సాధారణంగా కనిపించే లింగస్వరూపానికి భిన్నంగా నాగచంద్రేశ్వరుడు ఏడు పడగల తక్షకుణ్ణి ఆసనంగా చేసుకుని సతీసమేతంగా దర్శనమిస్తాడు. ఈ మూర్తిలోనే వినాయకుడు, కుమారస్వామి, పాదాల వద్ద శివపార్వతులు వాహనాలను చూడవచ్చు. ఈ ఆలయంలోకి నాగపంచమినాడు మాత్రమే భక్తులను అనుమతిస్తారు.

- గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని