దేవుడే పోషిస్తాడు

సుప్రసిద్ధ కవి కబీర్‌దాస్‌ ఊహ తెలిసింది మొదలు రాముని ధ్యానించేవాడు. ఆ భక్తిలో మునిగి కులవృత్తి అయిన నేతపనిని పట్టించుకునేవాడు కాదు. కొడుకు ఎలా బాగుపడతాడని తల్లిదండ్రులు నీమా, నీలూ బాధపడుతుంటే ‘మూడు లోకాలను పాలించే...

Updated : 26 Aug 2021 06:38 IST

సుప్రసిద్ధ కవి కబీర్‌దాస్‌ ఊహ తెలిసింది మొదలు రాముని ధ్యానించేవాడు. ఆ భక్తిలో మునిగి కులవృత్తి అయిన నేతపనిని పట్టించుకునేవాడు కాదు. కొడుకు ఎలా బాగుపడతాడని తల్లిదండ్రులు నీమా, నీలూ బాధపడుతుంటే ‘మూడు లోకాలను పాలించే దేవుడే మన కుటుంబాన్నీ పోషిస్తాడు’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చేవాడు.

వైష్ణవ భక్తుని వేషధారణతో తిరుగుతున్న కబీర్‌ను చూసి ‘నువ్వు ఏ గురువు దగ్గర ఉపదేశం పొందావు? వైష్ణవ సంప్రదాయంలో గురువు ఉపదేశం లేకుండా ముక్తి దొరకదు తెలుసా!’ అంటూ హేళన చేశారు కొందరు. దాంతో వైష్ణవ భక్తులలో అగ్రగణ్యుడైన రామానందస్వామి వద్ద ఉపదేశం తీసుకోదలచాడు కబీర్‌. కానీ నేత కుటుంబానికి చెందిన తనను ఆయన శిష్యునిగా పరిగణిస్తాడో లేదోనని సందేహం కలిగింది.

రోజూ వెలుగురేఖలు విచ్చుకోకముందే రామానందుడు నదీస్నానానికి వెళ్తాడని తెలిసి, కబీర్‌ ఒకరోజు తెల్లవారుజామున వెళ్లి ఆ దారిలో మాటువేశాడు. రామానందస్వామి రామనామం స్మరిస్తూ వస్తున్నాడు. చీకట్లో ఆయన రూపం కనిపించకున్నా రామ ఉచ్చారణ వినగానే కబీర్‌కు పారవశ్యం కలిగింది. పక్కకు జరగాలనే ధ్యాస కూడా లేకుండా నీడ లాంటి ఆకృతిని చూస్తుండిపోయాడు. దైవచింతనలో మునిగివున్న రామానందుడు దారికి అడ్డంగా ఉన్న కబీర్‌ను చూడక పావుకోళ్లతో తొక్కాడు. తన కాలికి తగిలింది మనిషని గమనించకుండానే దాటుకుని వెళ్లిపోయాడు. కబీర్‌కు నొప్పి తెలీకపోగా సంతోషం కలిగింది. గురువుగారు తనకు రామనామం ఉపదేశించినట్లుగా అనిపించింది. వెంటనే ఇంటికి వచ్చేశాడు. రామానందులవారే తన గురువని, ఆయన వద్ద ఉపదేశం పొందానని చెప్పాడు. జపమాల చేత పట్టి రామనామాన్ని స్మరించసాగాడు. ఇతను ఎప్పుడు శిష్యరికం చేశాడు, ఆయనెప్పుడు గురూపదేశం చేశారని ఆశ్చర్యపోయారంతా.

- రత్న


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని