విహారయాత్రను తలపించే తీర్థయాత్ర

అందాల సముద్రతీరాల గోవాలో కొలువైన శాంతస్వరూప దుర్గాదేవి కొంకణీయుల ఇలవేల్పు. బాగా, క్వండోలియమ్‌ బీచ్‌లకు దగ్గర్లో ఉంది శ్రీ శాంతేరీ శాంతదుర్గాదేవి ఆలయం. శివకేశవుల మధ్య జరగబోయిన

Updated : 08 Dec 2021 16:40 IST

అందాల సముద్రతీరాల గోవాలో కొలువైన శాంతస్వరూప దుర్గాదేవి కొంకణీయుల ఇలవేల్పు. బాగా, క్వండోలియమ్‌ బీచ్‌లకు దగ్గర్లో ఉంది శ్రీ శాంతేరీ శాంతదుర్గాదేవి ఆలయం. శివకేశవుల మధ్య జరగబోయిన భీకర యుద్ధాన్ని నివారించిన శక్తిస్వరూపిణి ఈ అమ్మవారు. పరశురాముడు తన గండ్రగొడ్డలిని విసరగా అది పడిన మేర సముద్రం వెనక్కి జరిగి ఇచ్చిన భూప్రాంతమే గోవా అనేది పురాణకథనం. గోవాను గోమాంచల్‌ గోమాంతక్‌, గోపరాష్ట్ర, గోపకపురి, గోవపురి లాంటి పేర్లతో పిలిచే వారు. మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, నవాబులు, పోర్చుగీసుల కాలంలో అనేక దేవాలయాలు వెలిశాయి.

2016లో 450 సంవత్సరాలను పూర్తి చేసుకున్న దేవాలయమిది. కళాత్మక స్వాగత ద్వారంలోంచి ఆవరణలోకి వెళ్లిన భక్తులు సుందర నందన వనంలోకి అడుగు పెట్టిన అనుభూతి చెందుతారు. అంతటి అందమైన కట్టడాలు ఇక్కడ ఆవిష్కారమయ్యాయి. టెర్రకోట పెంకుల గోవా తరహా పైకప్పుతో అద్భుత భవంతిలా దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం స్థానంలో ఉండే స్తంభానికి వందలాది దీపపు గూళ్లుంటాయి. ఆ దివ్వెలవెలుగు వర్ణనాతీతం. ప్రాకార మంటపాలు, ముఖమంటపం, గోపురాలు, గోళాకారపు విమాన శిఖరాలు అన్నీ హిందూ ఇస్లామీయ, పారశీయ వాస్తునిర్మాణ శిల్పకళారీతులతో నిర్మితమయ్యాయి.

విశాల ముఖమంటపంలో మూడు గడపలకు అవతల గర్భాలయం. భక్తజనం వరదలా పోటెత్తినా సులభంగా దర్శనమయ్యేంత విశాలం. స్తంభాలు, గర్భాలయ ద్వారాలపై లతలు చెక్కివుంటాయి. శాంతదుర్గ మూలావతారిణి పార్వతీదేవి పతి పరమేశ్వరుడు మహదేవ్‌, గ్రామపురుష్‌, బ్రాహ్మణ్‌, రవల్‌నాథ్‌, భేతాళేశ్వర్‌ అనే ఐదురూపాల్లో ఉపమందిరాల్లో కొలువయ్యాడు.

కులాసారాయుళ్ల స్వర్గసీమ, సెలవుదినాల వేసవివిడిది లాంటి సముద్ర తీర ప్రాంతాన నీలి నీలి సముద్రనీటి అలలపై సూర్యకిరణాల తళతళల్లో అరేబియా సముద్రుడి తీరాన అలరారుతోందీ ఆలయం. ఈ గుడికి వచ్చిన వారు బీచ్‌ల వద్దకు చేరేసరికి తీర్థయాత్ర కాస్తా విహారయాత్ర అయిపోతుంది.

- ఉదయశంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని