దేవుడున్నాడు!

వేదవతీ నగర సమీపంలో శాండిల్యుడు నడుపుతున్న గురుకులం ఉంది. ఆయన శిష్యులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ చదువు నేర్పేవాడు. నాటి విద్యావిధానాన్ని అనుసరించి విద్యార్థులు భిక్షాటన చేస్తూ, ఉదయం వేదపఠనం చేస్తూ..

Updated : 14 Oct 2021 06:17 IST

వేదవతీ నగర సమీపంలో శాండిల్యుడు నడుపుతున్న గురుకులం ఉంది. ఆయన శిష్యులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ చదువు నేర్పేవాడు. నాటి విద్యావిధానాన్ని అనుసరించి విద్యార్థులు భిక్షాటన చేస్తూ, ఉదయం వేదపఠనం చేస్తూ, మధ్యాహ్నం అరణ్యంలో హోమానికి కావలసిన సమిధలు తెస్తూ జీవనం గడిపేవారు. ఒకరోజు ఉదయం దేవుని గురించి చెబుతూ శాండిల్యుడు ‘దేవుడు అన్ని జీవుల్లో ఉన్నాడు. దేవుని మించిన రక్షకుడు, శ్రేయోభిలాషి ఎవరుంటారు?’ అంటూ వేదాంత విషయాలు బోధించాడు. మర్నాడు  దిలీపుడు, సుదీపుడు అనే ఇద్దరు శిష్యులు భిక్షాటనకు వెళ్లి గురుకులానికి తిరిగి వస్తున్నారు. ఇంతలో ఒక ఏనుగు పరిగెత్తుతూ రావడం చూశారు. మావటివాడు ‘ఏనుగు అదుపుతప్పింది. అందరూ పారిపోండి. తప్పుకోండి’ అని అరుస్తున్నాడు. భయపడిన దిలీపుడు పక్కనే ఉన్న చెట్టు వెనుక దాక్కున్నాడు. ఏనుగు దూకుడు చూసి కూడలిలో ఉన్న జనాలు తలా ఓ దిక్కూ వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో సుదీపుడు మాత్రం ఉన్నచోటే నిల్చున్నాడు. మావటి ఎంత హెచ్చరించినా సుదీపుడు వినకుండా ఏనుగుకు ఎదురుగా నిలుచున్నాడు. అది అడ్డువచ్చిన సుదీపుని తొండంతో కొట్టి పక్కకి తోయడంతో అతనికి గాయాలయ్యాయి. ఈ కోలాహలం సద్దుమణిగాక, దిలీపుని సహాయంతో సుదీపుని గురుకులానికి తీసుకొచ్చారు. జరిగిందంతా గురువుగారితో చెప్పారు. గాయాలకు వైద్యం చేయించారు. శాండిల్యుడు బాధపడుతూ ‘నాయనా! ఏం జరిగింది? మావటి హెచ్చరిస్తున్నా ఎందుకు వినలేదు?’ అనడిగాడు. దానికి సుదీపుడు ‘గురుదేవా! దేవుడు అన్ని జీవాల్లో ఉన్నాడని, దేవుడే మనని కాపాడుతాడని నిన్నటి పాఠంలో మీరే కదా చెప్పారు?! ఏనుగులో ఉన్న దేవుడు నన్నెందుకు బాధిస్తాడని కదలకుండా ఉండిపోయాను’ అన్నాడు. శిష్యుని అమాయకత్వానికి ఒకింత జాలి, ఒకింత బాధ కలిగిన గురువు గారు ‘నిజమే నాయనా! దేవుడు అన్ని జీవాల్లో ఉన్నాడని చెప్పాను. మరి మావటివానిలోనూ దేవుడున్నాడని నువ్వెందుకు గుర్తించలేదు? అతడు నిన్ను రక్షించాలని ఎంత హెచ్చరించినా ఎందుకాయన మాట వినలేదు?’ అన్నారు. ఆ మాటతో సుదీపుడికి తన అజ్ఞానం అర్థమైంది. లోకంలో మాయ ఎలా ఉంటుందో తెలియజేసేందుకు రామకృష్ణ పరమహంస చెప్పారీ కథ.

- పైడిమర్రి ఫణీంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు