జీవితం వేదనలా కాదు వేడుకలా సాగాలి..

గలిలయలోని కానా అనే ఊళ్లో పెళ్లి వేడుకకు క్రీస్తు ప్రభువు తన తల్లి, శిష్యులతో కలిసి వెళ్లాడు. ఆ రోజుల్లో పేద, గొప్ప భేదం లేకుండా అతిథులకు ద్రాక్షరసం ఇవ్వడం ఆచారం. కానీ కొందరికి ఇవ్వగానే ద్రాక్షరసం అయిపోయింది. భోజనాలు వడ్డించేటప్పుడు

Updated : 14 Oct 2021 05:36 IST

లిలయలోని కానా అనే ఊళ్లో పెళ్లి వేడుకకు క్రీస్తు ప్రభువు తన తల్లి, శిష్యులతో కలిసి వెళ్లాడు. ఆ రోజుల్లో పేద, గొప్ప భేదం లేకుండా అతిథులకు ద్రాక్షరసం ఇవ్వడం ఆచారం. కానీ కొందరికి ఇవ్వగానే ద్రాక్షరసం అయిపోయింది. భోజనాలు వడ్డించేటప్పుడు కొన్ని వంటకాలు అయిపోతే, అతిథులు అలుగుతారు. అపవాదులు ప్రచారమై రసాభాస అవుతుంది. కానీ యేసు ప్రభువు పెళ్లివారిని సిగ్గుపడేలా చేయదలచ లేదు. వారు అప్రతిష్టపాలు కాకుండా అద్భుతం చేశాడు. అదే నీటిని ద్రాక్షరసంగా మార్చడం. సేవకులతో ఖాళీ కుండలను నీటితో నింపించాడు. కానీ ఆ నీటిని రుచి చూసినవారు, ద్రాక్షరసం అద్భుతమంటూ మెచ్చుకున్నారు.
దీనికున్న విశేషాలను గుర్తించినట్లయితే.. మొదటిది ప్రభువు వివాహ వ్యవస్థను గౌరవించాడు. అతిథిగా వచ్చి పెళ్లికొడుకుకు ఎదురైన ఇబ్బందిని తొలగించాడు. ఇది అవసరంలో ఉన్నవారిని ఆదుకోమన్న సందేశాన్నిస్తుంది. క్రీస్తులా అద్భుతాలు చేయలేక పోయినా మనం మన పరిధిలో పొరుగువారి సమస్యలు తీర్చడంలో ముందుండాలి. యేసు ఈ అద్భుతాన్ని గొప్పకోసం ప్రముఖుల ఎదుట చేయలేదు. అవసరానికి పల్లెటూళ్లో చేశాడు. దీన్ని చూసింది ఆయన తల్లి, శిష్యులు, సేవకులు మాత్రమే. సేవకులు క్రీస్తు మాటలకు లోబడి పనిచేశారు కనుక అతిథులకు ద్రాక్షరసం అందింది. మనం ఒకరికోసం ఒకరన్నట్టు ఉంటే దేవుడు సాయం చేస్తాడనేది ఇక్కడ స్పష్టమవుతోంది.

పెళ్లిలో ద్రాక్షరసం ఖాళీ అయిన కుండల్లో ప్రేమ, కరుణ, క్షమలను నింపాడు. అలా ఎండి, మోడువారిన జీవితాల్లోకి ద్రాక్షరసం లాంటి మాధుర్యం రావాలంటే ఆయన సూచించినట్లు ప్రేమతో సాగాలి. ఈ క్రియలోని అసలు అద్భుతం అదే. జీవితం దుఃఖం కాదు, వేదన కాదు. అది వేడుకలా, ఉత్సవంలా ఉండాలంటే ప్రేమ అనే ద్రాక్షరసాన్ని తాగమంటున్నాడు ప్రభువు.

- డాక్టర్‌ ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని