రాయి విలువ

ఒక తాతా మనవడు పేదల వాడలో ఓ గుడిసెలో ఉండేవారు. వాళ్లిద్దరూ ఒకరికొకరు అంతే. అడవిలో తిరిగేంత వయసు వచ్చిన తర్వాత తాత మనవడిని తనతో వేటకు తీసుకువెళ్లేవాడు. జంతువుల జాడలు తీయటం, ఉచ్చులు వేయటం, క్రూరమృగాల నుంచి...

Updated : 28 Oct 2021 02:38 IST

క తాతా మనవడు పేదల వాడలో ఓ గుడిసెలో ఉండేవారు. వాళ్లిద్దరూ ఒకరికొకరు అంతే. అడవిలో తిరిగేంత వయసు వచ్చిన తర్వాత తాత మనవడిని తనతో వేటకు తీసుకువెళ్లేవాడు. జంతువుల జాడలు తీయటం, ఉచ్చులు వేయటం, క్రూరమృగాల నుంచి రక్షించుకోవటం, ఆకులూ మూలికలను గుర్తించటం వంటివన్నీ నేర్పుతుండేవాడు. మనవడికి అన్నీ సందేహాలే. అన్నింటికీ తాత ఓపిగ్గా సమాధానం చెప్పేవాడు. వాళ్లిద్దరూ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. ఒకరోజు సెలయేటి ఒడ్డున మనవడికి తళతళ మెరిసే రాయి దొరికింది. దాన్ని తీసి నీళ్లలో కడగగానే ఆ మెరుపు పదింతలయ్యింది. బాల్య చాపల్యం కొద్దీ దాన్ని తీసి దాచుకున్నాడు. ఆ రాయి మనవడి మనసంతా ఆక్రమించింది. అదే అతని లోకమైంది. దాన్ని తీసి పదే పదే చూసుకునే వాడు. రాత్రింబవళ్లు అది వాడిదగ్గరే ఉండేది. కంటి దగ్గర పెట్టుకుంటే కాంతి రకరకాల రంగుల్లో కనువిందు చేసేది. అడవిలోకి వెళ్లినపుడు మనవడు ప్రశ్నలు అడగటం తగ్గిపోయింది. పరధ్యానం పెరిగింది. మళ్లీమళ్లీ రాయి ఉందోలేదో తడిమిచూసుకోవటం ఎక్కువైంది.

మనవడి నడవడికలో మార్పును గమనించాడు తాత. త్వరలోనే దానికి కారణమూ గ్రహించాడు. ఆ రాయిని వాడినుంచి వేరు చేయకపోతే, వాడు ఇంకే కొత్త విషయమూ నేర్చుకోడని అర్థమైంది.
ఒకరోజు అడవిలో మనవడు రాయిని చూస్తూ ఏమరుపాటుగా ఉండి, ఓ పామును తొక్కబోయాడు. ఆఖరిక్షణంలో దాన్నుంచి తొలగిపోయాడు.

మనవడికి పాఠం చెప్పటానికి తాతకు సరైన అదను లభించింది. ‘బిడ్డా! నీ రాయి తినటానికి పనికొస్తుందా?’ అనడిగాడు. లేదన్నాడు మనవడు. ‘అడవి దుంపలు తవ్వటానికి పనికొస్తుందా? క్రూరమృగాలను తరమటానికి పనికొస్తుందా? ఈ అడవిలో మనకి దేనికీ అక్కరకు రాని వస్తువును నువ్వెందుకు వెంటబెట్టుకు తిరుగుతున్నావు? దానివల్ల పెద్ద ప్రమాదంలో పడ్డావు, అదృష్టవశాత్తూ ఆపద నుంచి బయటపడ్డావు’ అన్నాడు తాత. మనవడు ఆ రాతిని తీసి చూశాడు. తాత చెప్పింది నిజమే కదా అనిపించింది. గుప్పిట బిగించి బలంకొద్దీ విసిరాడు. అది సెలయేటిలో బుడుంగుమని మునిగిపోయింది. ఆ రాయి వజ్రం. అలౌకిక విషయాలను కాలదన్నుకోవడమూ అంతే.

- వి.లక్ష్మీపున్నేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని