తాయెత్తు మహిమ

షిరిడిలో కొన్నేళ్లు సజావుగా సాగిన వ్యాపారం ఉన్నట్టుండి మూల పడటంతో రానోజీ నిరాశానిస్పృహలతో ఇంట్లోనే ఉండిపోయాడు. ఓ రోజు మొక్కలకు పాదులు చేస్తోన్న సాయి వద్దకు వెళ్లి తనకో మార్గం చూపమన్నాడు. పక్కన

Updated : 11 Nov 2021 23:01 IST

షిరిడిలో కొన్నేళ్లు సజావుగా సాగిన వ్యాపారం ఉన్నట్టుండి మూల పడటంతో రానోజీ నిరాశానిస్పృహలతో ఇంట్లోనే ఉండిపోయాడు. ఓ రోజు మొక్కలకు పాదులు చేస్తోన్న సాయి వద్దకు వెళ్లి తనకో మార్గం చూపమన్నాడు. పక్కన ఉన్న బుట్టతో నీళ్లు తెచ్చి మొక్కలకు పోయమన్నాడు సాయి. అన్యమనస్కుడైన రానోజీ చిల్లులున్న బుట్టతో నీళ్లెలా తేగలను అనుకోలేదు. ఎన్నిసార్లు బుట్ట నింపినా, పాదు వద్దకు వచ్చేసరికి ఖాళీ అయిపోతోంది. సాయితో ఆ మాటే చెప్పాడు. ‘నీళ్లు తేలేదు, నిజమే! కానీ ఈ ప్రయత్నాల్లో అంతా నష్టమే జరిగిందంటావా?’ అన్నాడు బాబా. రానోజీ అవునంటే, సాయి నవ్వి, ‘నువ్వు నీళ్లు నింపక ముందు ఇది మట్టితో ఉంది. అన్నిసార్లు నీళ్లతో నింపడం వల్ల బుట్ట శుభ్రమైంది. అంటే నీ ప్రయత్నాల వల్ల కొంత లాభం ఉన్నట్టేగా! విజయం కోసం చేసే ప్రయత్నాల్లో కచ్చితంగా లాభం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించకపోతే నిరాశలో కూరుకుపోతాం. ఇదిగో తాయెత్తు. ఇకపై నీకు తిరుగులేదు. కానీ కొనుగోలుదార్లను నవ్వుతూ పలకరించు. వినయంగా మాట్లాడు. అదెంతో అవసరం’ అన్నాడు.

మర్నాడు సాయంత్రం రానోజీ సంతోషంగా సాయికి మొక్కుతూ ‘సాయీ, మీ తాయత్తు వల్ల ఈరోజు ఏకంగా 50 కంబళ్లు అమ్మాను. దీనికి ప్రతిగా మీరు ఏది కోరినా ఇచ్చేస్తాను’ అన్నాడు. దానికి సాయి ‘అయితే నా తాయెత్తు తిరిగివ్వు’ అన్నాడు. ‘మళ్లీ నష్టాల్లో పడతానేమో సాయీ’ అన్నాడతడు కంగారుగా. సాయి నవ్వుతూ ‘మహిమ నేను కట్టిన తాయెత్తులో లేదు రానో! నీకు చెప్పిన రెండు మాటల్లోనే ఉంది. ఆ మాటల్ని అమలుపరిచి, గట్టి సంకల్పంతో పనిచేశావు కనుక ఈరోజు వ్యాపారం బాగా సాగింది. రోజూ ఇలాగే చేస్తే తాయెత్తుతో పనే లేదు. మహిమంతా సంకల్ప బలానిదేనని గుర్తించు’ అన్నాడు. రానోజీకి జ్ఞానోదయమైంది.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు