ఉత్సవాలు.. భక్తకోటికి వరాలు

కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీవేంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి అవతరించి నిత్యం భక్తులకు దర్శనమిస్తూ తరింపజేస్తున్నారు.

Published : 07 Nov 2021 15:18 IST

ఈనాడు డిజటల్‌, తిరుపతి: కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీవేంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి అవతరించి నిత్యం భక్తులకు దర్శనమిస్తూ తరింపజేస్తున్నారు. శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహమూర్తిని ఒక్క క్షణమైనా దర్శించుకుని తరించడానికి వేలకొద్ది భక్తులు నిత్యం క్షేత్రానికి వేంచేస్తున్నారు. పిలిస్తే పలికే ప్రత్యక్షదైవం, కోరిన వరాలిచ్చే కోనేటిరాయుడు అయిన స్వామి వెలసిన ఈ క్షేత్రంలో శ్రీవారికి వైభవంగా నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. స్వామివారికి జరిగే సేవల ద్వారా భక్తులకు ఫలాలు లభిస్తాయి. ఆ వివరాలివీ..

కల్యాణోత్సం:  శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామికి కల్యాణోత్సవం జరుగుతుండగా దర్శించిన వారి పాపాలు హరించుకుపోతాయి. సేవలో పాల్గొన్న మహిళలందరూ నిత్యం సుహాసినులుగా (మాంగల్య భాగ్యంతో) వర్ధిల్లుతారు. 
డోలోత్సవం(ఊంజల్‌సేవ): ఊయలయందున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు. దేవలోకంలో నివాసాన్ని పొందుతారు. 
ఆర్జిత బ్రహ్మోత్సవం: ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్న భక్తులకు శ్రీవారి అనుగ్రహంతో బుద్ధిబలం, యశస్సు, ఆరోగ్యం, కీర్తి, ధనలాభం, సంతానప్రాప్తి కలుగుతుంది. 
వసంతోత్సం: ఈ సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి కరుణతో సంతానవృద్ధి, అన్ని కార్యాల్లో విజయం, కీర్తి, కోరిన కోరికలు తీరడం, సర్వవ్యాధి నివారణ పొందుతారు. 
సహస్ర దీపాలంకార సేవ: ఈ ఉత్సవ సమయంలో శ్రీవారిని దర్శించిన వారికి(ఉత్సవర్లను) మూలవిరాట్టుకు సేవ చేసినంత ఫలితం కలుగుతుంది. పదే.. పదే గొప్ప యజ్ఞాలు నిర్వహించినంత ఫలితం లభిస్తుంది. 


 గో ఆధారిత ప్రకృతి నైవేద్యం

న్యూస్‌టుడే, తిరుమల: వంద సంవత్సరాలకు పూర్వం గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని శ్రీవారికి నైవేద్యం తయారీకి ఉపయోగించేవారు. కాలక్రమేణ వస్తున్న మార్పులతో ప్రసాదాలతోపాటు లడ్డూ తయారీలోనూ రసాయన పంటల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని వినియోగించేందుకు తితిదే సిద్ధమైంది. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి సహకారంతో  బోర్డు మాజీ సభ్యుడు కె.శివకుమార్‌ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కృష్ణా జిల్లా పినగూడురు లంకకు చెందిన ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అందులో భాగంగా మే 1 నుంచి శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లంతో అన్నప్రసాదాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయవేత్త శ్రీవారికి 365 రోజులు 365 రకాల దేశీయ బియ్యంతో శ్రీవారికి ప్రసాదాలను అందించాలనే లక్ష్యంతో తిరుమలలో ప్రయోగాత్మకంగా  తయారీని ప్రారంభించారు. బెల్లం లడ్డూల తయారీని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. మూడుదశలలో శ్రీవారికి నైవేద్యం, లడ్డూప్రసాదం తయారీ, అన్నప్రసాద సముదాయంలో వినియోగం చేసేందుకు ప్రస్తుతం తితిదే సిద్ధమవుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని