వైకుంఠం.. వైశిష్ట్యం 

శేషాచలంలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం ప్రపంచంలోనే విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో 425 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది...

Published : 07 Nov 2021 15:17 IST

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: శేషాచలంలో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం ప్రపంచంలోనే విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో 425 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. వెలుపల గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివి. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపర్చుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితో పాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలను పరిశీలిస్తే..

మహద్వార గోపురం
శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి ఆలయంలోకి ప్రవేశించే ద్వారమే మహద్వార గోపురం. ప్రధాన గోపురంతో అనుసంధానిస్తూ నిర్మించిన ప్రాకారమే మహా ప్రాకారం. వైకుఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు మహద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. 
సంపంగి ప్రాకారం
సంపంగి ప్రాకారం మహద్వార గోపురం ప్రాకారానికి, నడిమి పడికావలి ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండటం పరిపాటి. తిరుమల ఆలయ స్థలవృక్షం సంపంగి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందున ఇలా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో అద్దాల మండపం, రంగనాయకుల మండపం, తిరుమలరాయ మండపం, ధ్వజస్తంభ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణ మండపం, ఉగ్రాణం, విరజానది, పడిపోటు, వగపడి అర తదితర మండపాలున్నాయి. 

కృష్ణరాయ మండపం
మహద్వారానికి ఆనుకుని లోపలివైపు 16 స్తంభాలతో ఉన్న ఎత్తైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే ప్రతిమా మండపం అని కూడా అంటారు. లోపలికి ప్రవేశించినప్పుడు కుడివైపున రాణులు తిరుమలదేవి, చిన్నమదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు ప్రతిమలు,  ఎడమవైపున చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగి ప్రతిమ, ఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార ఆకారంలో కొలువుదీరాయి.

రంగనాయకుల మండపం
కృష్ణరాయల మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే రంగనాయకుల మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను కొంతకాలం పాటు ఇక్కడ భద్రపర్చారు. అందువల్లే దీన్ని రంగనాయకుల మండపంగా పిలుస్తున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే ప్రముఖులకు వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.

తిరుమలరాయ మండపం
రంగనాయకుల మండపాన్ని ఆనుకుని పడమర వైపు ఉన్న ఎత్తైన స్తంభాల మండపమే తిరుమలరాయ మండపం. ఇందులోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించగా ఆ తర్వాత కాలంలో సభా ప్రాంగణ మండపాన్ని తిరుమల రాయలు నిర్మించారు. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం రోజు స్వామివారు ఈ మండపంలోకి వేంచేసి పూజలు అందుకుంటారు. 

అద్దాల మండపం
ప్రతిమా మండపానికి ఉత్తర దిక్కున ఉన్నదే అద్దాల మండపం. ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో అద్దాల మండపం విధిగా ఉంటుంది. నిత్యం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆర్జితం చెల్లించిన భక్తుల కోరిక మేరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామికి ఈ అద్దాల మండపంలో డోలోత్సవం జరుగుతుంది.

ధ్వజస్తంభ మండపం
ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండి వాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంటుంది. ఏటా బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడ కేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. 1982లో నూతనంగా దారు ధ్వజస్తంభాన్ని  పునః ప్రతిష్ఠించి బంగారురేకు తాపడం చేయించారు. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున ఎత్తైన పీఠమే బలిపీఠం. దీనికీ బంగారు తాపడం జరిగింది.  

వెండివాకిలి
ధ్వజస్తంభానికి ముందున్న ప్రవేశద్వారమే వెండి వాకిలి. ఇటుగా వెళ్లి శ్రీవారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశద్వారమంతటా వెండి రేకు తాపడం ఉన్నందున దీన్ని వెండివాకిలి అంటారు.

వసంత మండపం
తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమకు పూర్తయ్యేలా మూడు రోజుల పాటు ఈ మండపంలో వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయి. 

శ్రీవరదరాజస్వామి ఆలయం
విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయం మూలన శ్రీవరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో సుమారు నాలుగు అడుగుల నిలువెత్తు శ్రీవరదరాజస్వామివారి శిలామూర్తిని ప్రతిష్ఠించారు. వైష్ణవులకు శ్రీరంగం, కంచి, తిరుమల క్షేత్రాలు దర్శనీయ స్థలాలు. కంచిలోని స్వామివారికి వరదరాజ అని పేరు. తిరుమలలో కూడా వరదరాజును దర్శించి తరించేందుకు ఈ ఆలయం నిర్మించారని పెద్దలు చెబుతారు. 

ప్రధాన వంటశాల(పోటు)
విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఇక్కడే దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాలదోశ, జిలేబి, పోలి, అప్పం తదితర ప్రసాదాలను తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి స్వామికి నివేదన సమర్పిస్తారు.

సంకీర్తన భాండారం
సభేరాను ఆనుకుని ఉన్నదే సంకీర్తన భాండారం. దీన్నే ‘తాళ్లపాక అర’, ‘రాగిరేకుల అర’ అని అంటారు. తాళ్లపాక కవులు సంకీర్తనలు చెక్కిన రాగిరేకులు ఈ అరలో భద్రపర్చి ఉన్నాయి. ఈ భాండారంపై తాళ్లపాక అన్నమయ్య, ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్యల శిల్పమూర్తులు మలచి ఉన్నాయి.

బంగారు బావి
విమాన ప్రదక్షిణంలో పోటుకు వెళ్లే మార్గం పక్కన బంగారు బావి ఉంది. దీనికి బంగారు రేకు తాపబడి ఉన్నందున ఆ పేరు వచ్చింది. శ్రీవారి వంటలకు, శుక్రవారాభిషేకానికి, నిత్యార్చనలకు ఈ బావి జలాన్ని ఉపయోగిస్తారు. రంగదాసు అనే భక్తుడు దీన్ని నిర్మించారట. 

స్నపన మండపం
బంగారు బావి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపన మండపం’. క్రీ.శ.614లో పల్లవరాణి సామవై దీన్ని నిర్మించారు. భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని ఆమె సమర్పించారు. ఆనంద నిలయం జోర్ణోద్ధరణ సమయంలో ఈ మండపాన్ని నిర్మించారు.

రాములవారి మేడ
స్నపన మండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించే నడవ ‘రాములవారిమేడ’. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనంద నిలయంలో ఉన్న సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవి. అందువల్లే దీన్ని రాములవారి మేడ అని పిలుస్తున్నారు.

శయన మండపం
రాములవారి మేడ దాటి లోపలికి ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయన మండపం. రోజూ ఏకాంత సేవలో ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీభోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు. శయనమండపానికి, శ్రీవారి గర్భాలయా నికి మధ్య రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖర పడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.

గర్భగృహం
కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. వేంకటేశ్వరస్వామి స్వయంభుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ‘ఆనందనిలయం’ అంటారు. ఈ ఆనంద నిలయంపైన ఒక బంగారు గోపురం నిర్మించారు. దీనినే ఆనంద విమానం అంటారు. గర్భాలయం(లోపలిభాగం) 12.9 అడుగుల చతురస్ర మందారం. శయన మండపం గోడలకన్నా గర్భాలయం గోడలు రెండింతలుగా అంటే 7.2 అడుగుల మందాన్ని కలిగి ఉన్నాయి. ఈ గర్భగృహం గోడ 7.2 అడుగుల మందం గల ఒకే గోడ కాదని, స్వామివారి చుట్టూ ఉన్న ప్రాచీనమైన కుడ్యానికి అనుసంధానించి, దాని చుట్టూ  కొద్ది ఖాళీస్థలంతో దానికి ఆనుకొని మరో గోడ చేర్చినందునే ఇంతటి మందమైన గోడ ఏర్పడింది. లోపలి గోడ కంటే దానికి ఆనుకుని ఉన్న వెలుపలి గోడ కొత్తదని పరిశోధకులు నిగ్గుతేల్చి చెప్పారు. ఈ వెలుపలి గోడ మీద ఆనంద నిలయ విమాన నిర్మాణం క్రీ.శ.1244-50 మధ్యకాలంలో జరిగినట్లు పరిశోధకులు నిర్ధారించారు.

కల్యాణ మండపం
సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణ మండపం నిర్మించారు. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేసిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవిలకు నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితరాలు సంవత్సరోత్సవాలు జరుగుతాయి.

శ్రీయోగనరసింహస్వామి సన్నిధి
నరసింహాలయం క్రీ.శ.1330-1360 మధ్య నిర్మించారని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ.1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. ‘అళగియ సింగర్‌’ (అందమైన సింహం) అని, వేంకటాత్తరి (వేంకట శైలంపై ఉన్న సింహం) అని ప్రస్తావన ఉంది. స్వామివారికి రోజూ నివేదనలు, ప్రతి శనివారం అభిషేకం జరుగుతాయి. 

బంగారు వాకిలి
వేంకటేశ్వరుని సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారు వాకిలి. దీని దగ్గరి నుంచే స్వామివారి మూలవిగ్రహ దర్శనం నయనానందకరంగా ఉంటుంది. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపడం ఉన్నందున ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే పేరొచ్చింది. నిత్యం ఈ బంగారు వాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, మలయప్పస్వామికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని