ముప్పూటలా.. మృష్టాన్న భోజనం

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమల తరలివస్తుంటారు. వీరందరికీ అవసరమైన అన్నప్రసాదాన్ని తితిదే ఉచితంగా అందిస్తోంది. ..

Published : 07 Nov 2021 15:16 IST

ఎన్టీఆర్‌ చేతుల మీదుగా 1985లో ప్రారంభం

న్యూస్‌టుడే, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమల తరలివస్తుంటారు. వీరందరికీ అవసరమైన అన్నప్రసాదాన్ని తితిదే ఉచితంగా అందిస్తోంది. యాత్రికుల ఆకలితీర్చడమే లక్ష్యంగా 1985 ఏప్రిల్‌ 6న తితిదే అన్నదానం ట్రస్టును ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం నిరంతరాయంగా కొనసాగుతోంది.  కరోనా ముందు వరకు రోజుకు లక్షన్నర మందికి అన్నప్రసాదాలు అందజేస్తుండగా.. ప్రస్తుతం రోజుకు 35వేల నుంచి 40వేల మంది స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. 

నిత్యాన్నదాన ట్రస్టు
1994 ఏప్రిల్‌ 1న శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదానం ట్రస్టుగా ఏర్పాటైంది. తొలిరోజుల్లో కల్యాణకట్ట ఎదురుగా చిన్నపాటి కాంప్లెక్స్‌లో రెండువేల మందితో ప్రారంభమైంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా 2011 జులై 7న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని అధునాతన వసతులతో ప్రారంభించారు. గతంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తులకు అన్నప్రసాదం వితరణ చేసిన ప్రాంతంలోనే ఈ కేంద్రం ప్రస్తుతం ఏర్పాటైంది. కరోనాకు ముందు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, నడక మార్గాల్లో అన్నప్రసాద వితరణ చేసేవారు. దీంతోపాటు కొన్ని సంవత్సరాల క్రితమే తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. తిరుపతిలోని తితిదే అనుబంధ ఆసుపత్రుల వద్ద కూడా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో రోజుకు 1.20 లక్షల నుంచి 1.50 లక్షల మందికి 10 నుంచి 12 టన్నుల బియ్యం ఉపయోగిస్తుండగా కరోనా ప్రభావంతో వినియోగం తగ్గింది. ప్రస్తుతం 35వేల నుంచి 40వేల మంది వరకు భక్తులు వస్తుండటంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయల వినియోగం తగ్గిపోయింది. 

మూడుపూటలా..
గతంలో రెండు పూటలే భోజన వసతి కల్పిస్తున్న తరిగొండ అన్నప్రసాద భవనంలో ప్రస్తుతం ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు అల్పాహారం, 12 నుంచి 4గంటల వరకు భోజనం వితరణ చేస్తున్నారు. గంటపాటు విరామం ఇచ్చి సాయంత్రం 5 నుంచి రాత్రి 11గంటల వరకు భక్తులకు భోజనాన్ని అందిస్తున్నారు. ఉదయం అల్పాహారంగా పొంగలి, ఉప్మా, వర్మిసెల్లి ఉప్మా పెడుతున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో బెల్లం పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగ వడ్డిస్తున్నారు. అన్నప్రసాద కేంద్రంలో నాలుగు హాళ్లు ఉండగా ఒకదానిలో రెండువేల చొప్పున నాలుగు హాళ్లలో సాధారణ రోజుల్లో ఎనిమిదివేల మంది వరకు భోజనం చేయవచ్చు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే భౌతిక దూరం పాటించి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ కేంద్రం ఆసియా ఖండంలోనే అతిపెద్ద భోజనశాలగా గుర్తింపు పొందింది. 

అన్నప్రసాదం ట్రస్టుకు భూరి విరాళాలు 
తితిదే శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. కూరగాయలను దాతలు విరాళాలుగా అందిస్తున్నారు. ట్రస్టుకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.507.05 కోట్లు, 2014-15లో రూ.592.23 కోట్లు, 2015-16లో రూ.693.91 కోట్లు, 2016-17లో రూ.809.82 కోట్లు వచ్చాయి. కరోనా ప్రభావంతో 2019-20, 2020-2021లో విరాళాలు తగ్గాయి. సుమారుగా రూ.1100 కోట్లు వరకు విరాళాలు రాగా.. మొత్తాన్ని వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీతో అన్నప్రసాదం ట్రస్టును నిర్వహిస్తున్నారు. కూరగాయల దాతలు 2004 నుంచి తితిదే అన్నప్రసాదానికి కూరగాయలను అందిస్తున్నారు.  ఏటా కోట్లాది రూపాయల విలువైన కూరగాయలను  విరాళంగా పంపుతున్నారు. ఇటీవల దర్శన సమయంలో ప్రతిరోజు 500 అరటిపండ్లను శ్రీవాణి     ట్రస్టు భక్తులకు అందించేందుకు కూరగాయల దాతలు ముందుకొచ్చారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు భోజనం అందించనున్నారు.

భవిష్యత్తులో 14 రకాల వంటలు
శ్రీవారి భక్తులకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతోనే అన్నప్రసాదాన్ని అంచాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా తితిదే అన్నప్రసాదం ట్రస్టుకు కూరగాయలను విరాళంగా అందించే దాతలను దేశీయ గో ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టి, రసాయన రహిత కూరగాయలను పండించాలని కోరింది. ఇప్పటికే తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కర్నూలులో రైతులతో సమావేశమై గో ఆధారిత వ్యవసాయంలో వారిని భాగస్వాములను చేసేందుకు సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఉదయం, సాయంత్రం వేర్వేరు మోనూతో రుచికరమైన భోజనం అందించాలని ఇటీవల నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీవారి భక్తులకు రుచికరంగా 14 రకాలతో భోజనాన్ని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఇటీవల అదనపు ఈవో తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన 14 మంది కూరగాయల దాతలతో సమావేశమై అన్నప్రసాదం విభాగం కోరిన మెనూ ప్రకారం సరఫరా చేయాలని కోరారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని