అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం

తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని ఎన్నో ఏళ్లుగా పలువురు పేర్కొంటున్నారు. దీనిపై  ఎవరూ శాస్త్రీయంగా నిరూపించేందుకు ముందుకు రాలేదు.

Published : 07 Nov 2021 15:14 IST

ఈనాడు-తిరుపతి: తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని ఎన్నో ఏళ్లుగా పలువురు పేర్కొంటున్నారు. దీనిపై  ఎవరూ శాస్త్రీయంగా నిరూపించేందుకు ముందుకు రాలేదు. తితిదే ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలువురు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి.. పరిశోధనలు చేసి నిర్ధారించాలని కోరారు. అన్ని అంశాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని  పండిత పరిషత్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ మురళీధర్‌శర్మ ఛైర్మన్‌గా ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం వీసీ సన్నిధానం సుదర్శనశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, శాస్త్రవేత్త రెమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, తితిదే ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీషణశర్మ పరిషత్‌ సభ్యులుగా ఉన్నారు. వీరు పౌరాణిక వాజ్ఞ్మయ, శాసన, చారిత్రక ఆధారాలను పరిశీలించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తిరుమలలోని ఆకాశగంగ వద్దనే హనుమంతుడు జన్మించినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని శ్రీరామనవమి నాడు(2021) తిరుమలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తితిదే అధికారులు ప్రకటించారు. స్కంధ, వరాహ, బ్రహ్మాండాది పురాణాల నుంచి వివిధ విషయాల సంకలనమైన ఈ గ్రంథం ఆంజనేయస్వామి పుట్టుకను తెలియజేస్తుందని సభ్యులు చెబుతున్నారు. శ్రీనివాసుని నివాసమైన వేంకటాచల ప్రస్తావన మొత్తం 12 పురాణాల్లో ఉంది. వేంకటాచల క్షేత్రంలో అంజనాద్రి, వృషబాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని వివిధ కొండలు ఉండేవి. త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్ని అంజనాద్రిగా పిలిచేవారని వెల్లడించారు. స్కంద పురాణంలో ఆకాశగంగ ప్రాంతంలో అంజనాదేవి తపస్సు చేయడంతో పుత్రసంతానం కలిగిందన్నారు. ఆంజనేయస్వామికి జన్మనివ్వడంతో కొండకు అంజనాద్రి అని పేరువచ్చిందని నిర్ధారించారు. వాజ్ఞ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, శ్రీవేదాంతదేశికులు, శ్రీతాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిని అంజనాద్రిగా అభివర్ణించారని విశదీకరించారు. స్కంద పురాణంలో మాతంగ మహర్షి అంజన సంతానం కోసం తన ఆశ్రమానికి వస్తే ఆమెకు భౌగోళికంగా మార్గాన్ని చెబుతూ ఈ కొండల వద్దకు వెళ్లమని బోధించాడని చెబుతున్నారు. తన ఆశ్రమానికి దక్షిణ దిక్కున పది యోజనాల దూరంలో నృసింహస్వామి నెలకొన్న ఘనాచలం (అహోబిలం) వద్ద బ్రహ్మతీర్థం ఉందని, దానికి తూర్పున పది యోజనాల దూరంలో స్వర్ణముఖి నది ఉందని మహర్షి పేర్కొన్నారని అన్నారు.. ఉత్తరాన వృషభాచలంపైన పుష్కరిణి ఉందని, అక్కడకు వెళ్లి వరాహస్వామిని సేవించి ఆకాశగంగ వద్దకు వెళ్లి వాయుదేవుని ప్రార్థించమని దీవిస్తాడని పురాణాల్లో పేర్కొన్నట్లు పండిత పరిషత్‌ సభ్యులు తమ నివేదికలో పొందుపర్చారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తిరుమల కొండల్లోనే ఆంజనేయుడు జన్మించినట్లు నిర్ధారించారు. 

ఆలయ అభివృద్ధికి తితిదే చర్యలు
హనుమంతుడు జన్మించిన స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తితిదే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి చిన్న ఆలయం ఉంది. అందులో అంజనాదేవితోపాటు ఆంజనేయుని చిన్న విగ్రహం ఉంది. రానున్న కాలంలో ఇక్కడ హనుమంతుడి వృత్తాంతాన్ని ప్రజలకు తెలియజేసేందుకు డిజిటల్‌ తెరను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యానవనం, స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆకాశగంగ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులు ఆంజనేయుని దర్శించుకునేందుకు అనువుగా పనులు చేపట్టనున్నారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని