Home buying: వడ్డీ రేట్ల పెరుగుదలపై ఆందోళన.. అయినా 3 BHKకే మొగ్గు!

Home buying: గృహ కొనుగోలుకు సంబంధించి సీఐఐ-అన్‌రాక్‌ సంస్థలు సంయుక్తంగా ఓ సర్వేను నిర్వహించాయి. వడ్డీ రేట్లు పెరుగుదల, ధరలపై ఆందోళన ఉన్నా ఎక్కువ మంది 3బీహెచ్‌కే మొగ్గు చూపుతుండడం గమనార్హం.

Updated : 18 Apr 2023 18:59 IST

ముంబయి: పెరుగుతున్న ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ రెపోరేటు పెంచడంతో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గృహ రుణ (Home loan) రేట్లు ప్రియమయ్యాయి. దీంతో చాలా మంది ఇంటి కొనుగోలు (Home buying) విషయంలో ఆలోచనలో పడ్డారు. అయితే, వడ్డీ రేట్లు మరింత పెరిగితే మాత్రం తమ ఇళ్ల కొనుగోలుపై నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని భావి కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. ఓ సర్వేలో 95 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

పరిశ్రమల సమాఖ్య సీఐఐ (CII), రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ అన్‌రాక్‌ (Anarock) సంస్థ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. ‘ది హౌసింగ్‌ మార్కెట్‌ బూమ్‌’ పేరిట ఈ సర్వే ఫలితాలను వెల్లడించాయి. 4,662 మంది ఈ సర్వేలో పాల్గొనగా.. అందులో 96 శాతం మంది అధిక హోమ్‌లోన్‌ వడ్డీ రేట్లు తమ గృహ కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, మొత్తం గృహ కొనుగోలు చేయాలనుకునేవారిలో 80 శాతం మంది వడ్డీ రేట్ల కంటే వాటి ధరలే ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారు.

ఇదే సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ 3 BHKకే ఫ్లాట్లకే ఎక్కువ మంది మొగ్గు చూపుతుండడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వ్యక్తుల్లో 42 శాతం మంది 3 BHK ఫ్లాట్ల పట్ల ఆసక్తి చూపుతుండడం గమనార్హం. 40 శాతం మంది మాత్రం 2 BHK ఫ్లాట్లు కొనాలని చూస్తున్నారు. కేవలం 12 శాతం మంది మాత్రమే 1 BHK ప్లాట్‌కు తమకు సరిపోతుందని భావిస్తుండగా.. 6 శాతం మంది మాత్రం 3 BHKకు మించి ఉండాలని కోరుకుంటున్నారు.

దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని 45 శాతం మంది సమీప భవిష్యత్‌లో 3 BHK కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముంబయి మెట్రోపాలిటన్‌ రీజిన్‌లో మాత్రం 43 శాతం మంది మాత్రం 2 BHKనే కోరుకుంటుండడం గమనార్హం. 3 BHKవైపు చూసే వారు కేవలం 32 శాతం మందే ఉంటున్నారు. ప్రాపర్టీ ధర రూ.45 లక్షల నుంచి కోటిన్నర మధ్య ఉండాలని కోరుకునే వారు 58 శాతం మంది ఉంటున్నారు. ఏడాదిలోపే ఇళ్లు కొనాలని అనుకునే వారి సంఖ్య 36 శాతంగా ఉందని సర్వే వెల్లడించింది.

సర్వే ఫలితాల గురించి అన్‌రాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి మాట్లాడుతూ..‘‘ఇళ్ల కొనుగోలు విషయంలో రేట్ల పెంపు అనేది ఒక అంశం మాత్రమే. ఇటీవల కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం వల్ల ఇళ్ల కొనుగోలు విషయంలో రాబోయే రెండు త్రైమాసికాల్లో ప్రభావం ఉండబోతోంది. లేఆఫ్‌ల కారణంగా చాలా మంది గృహ కొనుగోలును వాయిదా వేసుకున్నారు. ఇప్పటికీ చాలా మందికి ఇంటి కొనుగోలే ప్రథమ ప్రాధాన్యంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 2025 నాటికి హౌసింగ్‌ మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని