Interior design: ఇంటీరియర్‌ డిజైన్‌ రంగానికి ప్రోత్సాహం

నగరంలో లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Published : 29 Jun 2024 02:07 IST

ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హరిచందన దాసరి, ఐఐఐడీ జాతీయ అధ్యక్షుడు సరోష్‌ వాడియా తదితరులు

రాయదుర్గం: నగరంలో లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో శుక్రవారం ఐఐఐడీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైనర్స్‌) ఇన్‌సైడర్‌ ఎక్స్‌ 2024 పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల ఇంటీరియర్‌ డిజైన్‌ రంగ ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. స్టాళ్లను సందర్శించారు. 

మంత్రి మాట్లాడుతూ.. ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణం, లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటు విషయంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో మూడు రోజలు క్రితమే సమీక్ష నిర్వహించాం. భవిష్యత్‌లో నగరాన్ని ప్రపంచ పటంలో ఉత్తమ స్థానంలో నిలిచేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇందులో భాగంగా మూసీని సుందరీకరించడం ద్వారా నగరాన్ని ఒక పర్యాటక ఆకర్షణ రివర్‌ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతాం. నదికి ఒడ్డున రెండువైపులా రెస్టారెంట్లు, వినోద కేంద్రాలతోపాటు కేబుల్‌ బ్రిడ్జిలతో సుందర కేంద్రంగా అభివృద్ధిచేస్తాం. దీనికి డీపీఆర్‌ (ప్రాజెక్ట్‌ సవివర నివేదిక) రూపొందుతోంది. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది’ అని మంత్రి చెప్పారు. 

రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన దాసరి మాట్లాడుతూ.. నగరం స్థిరాస్తి, ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు గమ్యస్థానంగా మారింది. ఈ రంగం శరవేగంగా ప్రపంచంలో దూసుకెళ్తున్న విపణి.. ఈ రంగంలో అపారమైన నైపుణ్యం గల యువశక్తి, ప్రగతి పథంలో నడుస్తున్న పరిశ్రమ ఉన్న నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ చేతులు కలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగరాన్ని డిజైన్‌ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రంగానికి ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారమైనా అందిస్తామని చెప్పారు. 

ఐఐఐడీ హైదరాబాద్‌ విభాగం ఛైర్‌పర్సన్‌ పల్లవి ఎంచూరి మాట్లాడుతూ.. ఇంటీరియర్‌ డిజైన్‌ రంగానికి చెందిన ఉత్పత్తులను ఒకే ఛత్రం కిందికి తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయ కళల నుంచి ఆధునిక, ఏఐ ఆధారిత డిజైన్‌ ఇంటీరియర్‌ ఉత్పత్తుల తయారీ సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయన్నారు. కార్యక్రమంలో ఐఐఐడీ జాతీయ అధ్యక్షుడు సరోష్‌ వాడియా, ప్రదర్శన కన్వీనర్‌ రాకేష్‌ వాసు, హైదరాబాద్‌ విభాగం ఐఐఐడీ నూతన అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ నూనె, కార్యదర్శి నవీన్‌ చలనాసి, మనోజ్‌ వాహి, గౌరవ్‌ పెర్షాద్, జీనత్‌ హిరాని, సుశ్మిత సుబుద్ధి, రమేశ్‌ పటేల్, శ్రీనాథ్, జబ్బర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని