ఇవి ఇళ్లా.. ఇంద్ర భవనాలా?
హోటళ్లను తలపిస్తున్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు
విశాలమైన లాబీలు.. లోపలికి ప్రవేశించగానే సాదరంగా ఆహ్వానించే రిసెప్షనిస్టు.. సకల సదుపాయాలుండే క్లబ్ హౌస్.. అతిథుల కోసం సూట్ రూమ్స్.. కలిసి కబుర్లు చెప్పుకొనేందుకు లాంజ్‌లు.. ఇంట్లో ఎత్తైన సీలింగ్.. పడక గదికో బాల్కనీ.. కావాల్సిన విందు ఆరగించేలా రెస్టారెంట్లు.. వేడుక చేసుకునేందుకు బాంక్వెట్ హాల్.. శబ్దం లేకుండా ఇంట్లోకి చల్లని గాలిని ప్రసరింపజేసే సెంట్రలైజ్డ్ ఏసీ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేలా స్నానాల గదుల్లో వేడి నీరు.. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే హౌస్ కీపింగ్ సిబ్బంది.. మూడంచల భద్రతా వ్యవస్థలు.. ఏదో స్టార్ హోటల్ గురించి ఇక్కడ చెబుతున్నారేంటి అని ఆలోచిస్తున్నారా? ఇటీవల నగరంలో కడుతున్న విలాసవంతమైన ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు స్టార్ హోటళ్లను తలపిస్తున్నాయి. ఆయా కమ్యూనిటీల లాబీల్లోకి అడుగుపెట్టగానే వెళుతోంది ఇంటికా? లేక మరేదైనా హోటల్‌కా అన్నంత విలాసవంతంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక నిర్మాణ సంస్థ ఒక అడుగు ముందుకేసి ఆధునిక గృహ కొనుగోలుదారులకు ఫైవ్‌స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పించడం తమ ప్రాజెక్ట్ లక్ష్యం అని చెబుతోంది.
హోటళ్లు ఇల్లులాగా మారితే.. ఇళ్లేమో హోటళ్లను తలపిస్తున్నాయి. సిటీలో పదుల సంఖ్యలోని ప్రాజక్టుల్లో వందకుపైగా టవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కోటి పాతిక అంతస్తుల నుంచి యాభై అంతస్తుల వరకు ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్నారు. ఎత్తులోనే కాదు ప్రాజెక్టుల్లో సౌకర్యాలు కల్పించడంలోనూ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. గొప్ప కోసం మాత్రమే కాకుండా ఆయా గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే కొనుగోలుదారుల అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో సేవ చేరుతూ ఫైవ్‌స్టార్ స్థాయికి వచ్చాయి. ఇంటి కొనుగోలుదారులు ధర కంటే అక్కడ కల్పిస్తున్న సదుపాయాలను చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ప్రత్యేకించి కొన్ని వర్గాల కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకునే ఈ తరహా ప్రాజక్టులను డిజైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
జీవనశైలికి తగట్టుగా...
నగర జీవనశైలిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ఇంటి నిర్మాణంలోనూ మార్పులు వస్తున్నాయి. దంపతులు వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారు. మళ్లీ ఇంటి పనులంటే అబ్బో మా వల్ల కాదంటున్నారు. ఈ తరహా గేటెడ్ కమ్యూనిటీల్లో ఇంట్లో నీళ్ల దగ్గర్నుంచి.. వంట వండే గ్యాస్ వరకు పట్టించుకోనవసరం లేదు. వంటగది వరకు పైప్‌లైను ఉంటుంది. నెలకు బిల్లు కడితే సరిపోతుంది. మోటారు పాడైంది.. నీళ్లు రావడం లేదనే చికాకు లేదు. ఈ పనులన్నీ ప్రత్యేకంగా ఉన్న సిబ్బంది చూసుకుంటారు. పిల్లల ఆలనా పాలనా చూసేందుకు వంతులవారీగా అమ్మమ్మో, నానమ్మో వారి పనులు వదులుకుని చూస్తుంటారు. కుదరనప్పుడు ఉద్యోగాలకు సెలవులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే పిల్లలను ఆడించేందుకు డే కేర్ సెంటర్లు, పెద్దల కాలక్షేపానికి ఎల్డర్స్ క్లబ్, పిల్లలు శిక్షణ పొందేందుకు కమ్యూనిటీల్లోనే క్రీడా సదుపాయాలు ఉండటంతో ఆయా ఇళ్లలో నివసించేవారు తమ వృత్తి, ఉద్యోగాలపై దృష్టి పెట్టేందుకు ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు. అత్యవసరంలో వైద్య సదుపాయం చెంతనే ఉంటుంది. ఈ కారణంగానే వ్యక్తిగత ఇళ్ల నుంచి క్రమంగా గేటెడ్ కమ్యూనిటీల వైపు మళ్లుతున్నారు. సిటీలో ఈ తరహా విలాసవంతమైన కమ్యూనిటీలు ఐటీ కారిడార్ చుట్టుపక్కలనే ఎక్కువగా వస్తున్నాయి. ఎక్కడో విదేశాల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఒక యువ నటుడు సైతం వీటిలోని సౌకర్యాలకు ఫిదా అయిపోయాడు. పలువురు సినీ ప్రముఖులు వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆరోగ్యం పైనే...
ఈ కమ్యూనిటీల్లో సౌకర్యాలే కాదు అక్కడ నివసించే వారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. నీటి ఆదా, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగించడం, వాననీటి సంరక్షణ, విద్యుత్తు ఆదా చర్యలు చేపడుతూనే పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. నిటారుగా భవనాలు వెళ్లే కొద్దీ పచ్చదనం తగ్గిపోతుంది కాబట్టి వర్టికల్ గార్డెన్స్ పెంచేలా ఏర్పాటు చేస్తున్నారు. బాల్కనీల్లో మొక్కలే కాదు చిన్నపాటి వృక్షాలను పెంచుకునేలా డిజైన్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు ముందుకొస్తున్నారు.
ఖరీదు ఎక్కువే..
సౌకర్యాలు పెరిగేకొద్దీ ఆయా ప్రాజెక్టులు ప్రీమియంగా మారిపోతున్నాయి. చదరపు అడుగు ధర ప్రాంతాన్ని బట్టి రూ.8వేల నుంచి రూ.16 వేల వరకు వీటిల్లో ఉన్నాయి. ఫ్లాట్ విస్తీర్ణం తక్కువలో తక్కువ 3500 చదరపు అడుగుల నుంచి 8వేల చ.అ. వరకు ఉంటున్నాయి. ఫ్లోర్‌కు ఒకటి చొప్పున, స్కైవిల్లాల పేరుతోనూ వీటిని ఇంద్ర భవనాల్లా నిర్మిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్‌తో అలరించి.. టేకింగ్‌తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు