Cool Roofs: ఇల్లు చల్లగా
ఇంట్లో ఎండవేడి నుంచి కూల్‌రూఫ్స్ ఉపశమనం కల్గించనున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లబడినా మే నెలలో ఎండలు మండిపోనున్నాయి.
చలువ పైకప్పులతో అధిక వేడి నుంచి ఉపశమనం
ఈనాడు, హైదరాబాద్
ఇంట్లో ఎండవేడి నుంచి కూల్‌రూఫ్స్ ఉపశమనం కల్గించనున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వాతావరణం కాస్త చల్లబడినా మే నెలలో ఎండలు మండిపోనున్నాయి. ఇంట్లో ఉన్నా నిప్పుల కుంపటిలో ఉన్నంత వేడి సెగలు కుదురుగా ఉండనీయవు. చలువ పైకప్పులతో ఇంటిలోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. 20 శాతం కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని చెబుతున్నారు.
నగరంలో కడుతున్న ఆవాసాలన్నీ కాంక్రీట్‌మయమే. ఇదివరకు శ్లాబ్‌ల వరకే కాంక్రీట్ వినియోగించేవారు. ఇప్పుడు మైవాన్ టెక్నాలజీలో గోడలు సైతం కాంక్రీట్‌తోనే కడుతున్నారు. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసేందుకు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. వీటితో సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో ఇళ్లలో వేడి అధికంగా ఉంటుంది. పై అంతస్తుల్లో ఉన్నవారికి మరీ అధికం. వ్యక్తిగత ఇళ్లలో ఇప్పటికీ గోడలు కడుతున్నప్పటికీ శ్లాబుల నుంచి అధిక వేడి ఇళ్లలోకి చేరుతుంది. ప్రతి గదిలో కూలర్లు, ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితి. నిర్మాణ సమయంలో కొన్ని జాగ్రత్తలతో అధిక వేడి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా నిరోధించవచ్చు. ప్రభుత్వ, వాణిజ్య భవనాల్లో కూల్‌రూఫ్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గృహ నిర్మాణంలో 600 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించేవాటికి తప్పనిసరిగా పాటించాలి. ఇప్పటికే ఉన్న ఇళ్లకు సంబంధించి కూల్‌రూఫ్స్‌తో ఉపశమనం పొందవచ్చు.
4 డిగ్రీల వరకు తగ్గించుకోవచ్చు....
చలువ పైకప్పులను ఇంటిని బట్టి చాలా రకాలుగా వేసుకోవచ్చు. పాతరోజుల్లో శ్లాబుపైన సున్నం వేసేవారు. వర్షం పడితే ఇది పోతుండడంతో ఇప్పుడు కూల్‌రూఫ్ పెయింట్స్ వచ్చాయి. వర్షం పడినా కొట్టుకుపోకుండా ఉండే వాటర్ ప్రూఫ్ రంగులివి. ఆరేళ్ల వరకు పనిచేస్తాయి. చదరపు అడుగుకు రూ.32 వరకు వ్యయం అవుతుంది. ఈ రంగులు వేయడానికి ముందే వాటర్ ప్రూఫ్ చేయించుకోవడం మంచిది.
* మోజాయిక్ టైల్స్‌ను సైతం శ్లాబుపైన వేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఎన్నో రంగులు, డిజైన్లలో లభిస్తున్నాయి. దీనికి చదరపు అడుగు రూ.50 వరకు ఖర్చు అవుతుంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఇంటిలోపల 4 డిగ్రీల వరకు తగ్గుతాయి. * రూఫ్‌గార్డెన్, సోలార్ రూఫ్‌టాప్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నవి.
సత్య అరుణ, ఎగ్జిక్యూటివ్ అధికారిణి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్
పాలసీ రాకతో అవగాహన పెరుగుతుంది...
* దేశంలో దిల్లీలో మాత్రమే కూల్‌రూఫ్ పాలసీ ఉంది. అయితే అది నగరం వరకే పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా వర్తించే పాలసీని దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాలసీ రాకతో ప్రజల్లో కూల్‌రూఫ్స్‌పై అవగాహన పెరుగుతుంది.
* ఎండలతో ఎక్కువగా బస్తీల్లో, ఇరుకిరుకు ఇళ్లలో ఉండేవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఇలాంటి వారిని దత్తత తీసుకుని వారి ఇళ్లను చలువపైకప్పులతో అమర్చేలా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టేందుకు అవకాశం లభించింది.
* ఇళ్ల పైకప్పుపై నేరుగా సూర్యకిరణాలు పడేచోట ఓవర్‌డెక్‌పైన వేసవి కాలంలో 75 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వేడి ఇళ్ల లోపల పైకప్పు వద్ద చూస్తే 65 డిగ్రీల వరకు ఉంటుంది. చలువ పైకప్పులు ఉంటే పైన ఉండే ఉష్ణోగ్రతలు గదిలోకి వచ్చేసరికి 20 డిగ్రీల వరకు తగ్గుతుంది.
* అదే గదిలోని యాంబియన్స్ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు ఉంటే.. చలువపైకప్పులతో 4 డిగ్రీల వరకు తగ్గుతుంది. 31 డిగ్రీలు అంటే చాలా సౌకర్యంగా ఉంటుంది.
* భవనాల కారణంగా నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్నాయి. ఇళ్లు అన్ని చలువ పైకప్పులుగా మారితే ఆ ప్రాంతంలో వేడి తగ్గుతుంది. ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో అన్ని ఇళ్లపైనా కూల్‌రూఫ్స్ వేసుకుంటే ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
* తక్కువ ఖర్చుతో తెలుపు రంగు ప్లాస్టిక్ కవర్లను రేకుల ఇళ్లపై పర్చడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు. మెంబ్రెన్ టెక్నాలజీతో వస్తున్న షీట్స్‌ను కూల్‌రూఫ్స్‌గా వినియోగించుకోవచ్చు.
రాజ్‌కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆస్కి
నిర్మాణ సమయంలో...
* ఇళ్ల నిర్మాణ సమయంలోనే హరిత భవనాలను నిర్మించుకోగలిగితే వేసవిలో అధిక వేడి సమస్యలను నివారించవచ్చు.
* నిబంధనల మేరకు సెట్‌బ్యాక్ వదిలి గాలి, వెలుతురు ఇళ్లలోకి వచ్చేలా ఇంటి డిజైన్ ఉండాలి.
* ఆవరణలో మొక్కలు, పచ్చదనంతో నేరుగా వేడి ఇళ్లలోకి పడకుండా ఉంటుంది. స్థలాభావం ఉన్న ఇళ్లలో మేడపైన పెంచుకోవచ్చు.
* సాధారణ ఇటుకల స్థానంలో ఏఏసీ, ఫ్లైయాష్ ఇటుకలు వాడడం ద్వారా వేడిని నిరోధించవచ్చు. విద్యుత్తు బిల్లులు తగ్గుతాయి.
* ఇంట్లోని గోడల్లో 4శాతం కిటికీలు ఉండేలా చూసుకోవాలి. క్రాస్ వెంటిలేషన్ తప్పనిసరి.
* ఇప్పుడు పగటిపూట తగిన వెలుతురు ఉండేందుకు గ్లాసులు ఉపయోగిస్తున్నారు. వేడి లోపలికి రాకుండా డబుల్ గ్లేజర్స్ ఉపయోగించాలి.
వినయ భారతి, సీనియర్ అసోసియేట్ ఇంజినీర్, ఎర్త్‌నామిక్స్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన ఎన్వీఎస్-01
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్‌డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్‌సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!